రేవంత్ ఓటేయడం అనుమానమే..!
కోర్టులో హాజరుపరిచే సమయాన్నిబట్టి అవకాశం
సోమవారం సాయంత్రం 4 గంటలకే ముగియనున్న పోలింగ్ సమయం
ఓటింగ్‌కు అవకాశం ఇవ్వాలని కోర్టును కోరనున్న ఎమ్మెల్యే
సాక్షి, హైదరాబాద్: ఏసీబీ అధికారులు అరెస్టు చేసిన టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి సోమవారం జరిగే ఎమ్మెల్సీ ఎన్నిక ల్లో ఓటు హక్కు వినియోగించుకోవడం అనుమానంగానే కనిపిస్తోంది. రేవంత్‌ను సోమవారం కోర్టులో ఏసీబీ అధికారులు హాజరుపరచనుండగా కోర్టులో బెయిల్ పిటిషన్‌తోపాటు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఇవ్వాలని రేవంత్ పిటిషన్ వేస్తారని టీడీపీ వర్గాలు చెప్పాయి.
కానీ, ఆయనను ఏ సమయంలో ఏసీబీ అధికారులు కోర్టుకు తీసుకెళ్తారో చెప్పలేని పరిస్థితి నెలకొంది. మేజిస్ట్రేట్ ఎదుట హాజరు పరిచేముందు రేవంత్‌ను సోమవారం ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహిస్తారని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ వ్యవహారమంతా ముగిసి హాజరుపరిచేందుకు ఎంత సమయం పడుతుందో చెప్పలేమంటున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సోమవారం సాయంత్రం 4 గంటలకు ముగియనుండటంతో ఈలోగా ఆయనకు కోర్టు అనుమతి ఇచ్చి కొంత సమయం మిగిలి ఉంటే ఓటు వేసే అవకాశం ఉంటుందని, లేదంటే అనుమానమేనని పేర్కొంటున్నాయి.