
మళ్లీ విద్వేష రాజకీయం
సంపాదకీయం
మంచీ చెడ్డ విచక్షణ లేకపోతే పోయింది...కనీసం వేళా పాళా అయినా చూసుకోవా లని మతతత్వవాదులు అనుకోవడం లేదు. వివిధ మతాలు, భాషలు, సంస్కృతి, సంప్రదాయాలున్న దేశానికి ఆమోదయోగ్యమైన, అపురూపమైన రాజ్యాంగాన్ని అం దించిన మహనీయుడు డాక్టర్ అంబేడ్కర్ 125వ జయంతి జరగ బోతున్నదని గానీ... విదేశీ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ అన్ని మతాలకూ, సంస్కృతు లకూ, జాతులకూ దేశంలో సమానావకాశాలుంటాయని చెప్పిన సందర్భాన్నిగానీ గుర్తించకుండా ఎన్డీయే కూటమిలోని భాగస్వామి శివసేన మళ్లీ తన నైజాన్ని ప్రద ర్శించింది. ముస్లింలను తరచుగా ఓటు బ్యాంకు రాజకీయాలకు వాడుకుంటున్నారు గనుక వారికున్న ఓటు హక్కును రద్దుచేయాలని శివసేన అధికార పత్రిక ‘సామ్నా’ రెండ్రోజుల క్రితం డిమాండ్ చేసింది. తరచు నోరుపారేసుకోవడంలో ఖ్యాతి గడిం చిన బీజేపీ ఎంపీ సాక్షి మహరాజ్ కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలను కఠినంగా అమలు చేయాలని, అందుకు అంగీకరించనివారి ఓటు హక్కును రద్దు చేయాలని కోరారు. హిందూ మహాసభ ఉపాధ్యక్షురాలు సాధ్వీ దేవ ఠాకూర్ ఇంకో అడుగు ముందు కేశారు. దేశంలో అత్యవసర పరిస్థితి విధించి ముస్లిం, క్రైస్తవ మతాలవారికి బలవంతంగా కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలా చేస్తేనే వారి జనాభా పెరగకుండా ఉంటుందని ఆమె సలహా ఇచ్చారు.
ఇవి ఎవరో మతి చలించినవారి మాటలుగా కొట్టిపారేయడానికి వీల్లేదు. ఇప్పు డు మాట్లాడిన నేతలందరూ గతంలో కూడా ఇదే బాణీలో మాట్లాడారు. ఇక శివసేన సంగతి చెప్పనవసరం లేదు. ఆ పార్టీ సంస్థాపకుడు స్వర్గీయ బాల్ ఠాక్రే ఇలాంటి ప్రసంగాల్లో అందరినీ మించిపోయారు. 1987 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచా రంలో ఆయన ముస్లింలపై చేసిన వ్యాఖ్యానాలపై కేసు సుప్రీంకోర్టు వరకూ వెళ్లింది. ఎన్నికల్లో అవినీతి విధానాలు అవలంబించారన్న అభియోగం రుజువైనందున ఠాక్రేను ఆరేళ్లపాటు ఎన్నికల్లో పోటీచేయకుండా, ఆయనకు ఓటు హక్కు లేకుండా చేయాలని సుప్రీంకోర్టు 1995 డిసెంబర్‌లో ఆనాటి రాష్ట్రపతి కేఆర్ నారాయణన్‌కు సలహా ఇచ్చింది. మిగిలిన ప్రక్రియంతా పూర్తయ్యాక ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని నిబంధనలకింద 1999లో ఠాక్రే ఓటింగ్ హక్కును సస్పెండ్‌చేశారు. ఆయన ఓటింగ్ హక్కు ఎందుకు రద్దయిందో శివసేన నేతలకు లోతుగా అర్థమై ఉంటే మళ్లీ ఆ తరహా మాటలు మాట్లాడకూడదు. కానీ వారికి తెలిసిందల్లా చట్టంలో ఓటు హక్కు రద్దు చేసే అవకాశం ఉంటుందన్న విషయం ఒక్కటే. అందువల్లే ఇప్పుడు ముస్లింలకు ఆ హక్కు రద్దుచేయమని డిమాండుచేస్తున్నారు. శివసేన వ్యక్తంచేసిన భావాలను తమవిగా భావించనవసరం లేదని బీజేపీ సంజాయిషీ ఇవ్వొచ్చు. సామ్నా సంపాదకీయాన్ని వెనువెంటనే ఆ పార్టీ ఖండించి ఉండొచ్చు. కానీ, ఇంతమాత్రాన బీజేపీ పాపం మాసిపోదు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తర్వాత రెండు పార్టీల మధ్యా దూరం పెరిగిన మాట వాస్తవమే కావొచ్చుగానీ...ఇప్పటికీ శివసేన ఎన్డీయే కూటమిలో భాగస్వామిగా ఉంది. కేంద్ర కేబినెట్‌లోనూ కొనసాగుతున్నది.
ముస్లింలైనా, మరొకరైనా వారికై వారు ఓటు బ్యాంకుగా మారరు. శివసేన లాంటి పార్టీలు వారిని అలా మార్చుకుంటున్నాయి. సమాజాన్ని కుల, మత ప్రాతి పదికలపై చీల్చి వాటి ఆధారంగా ఎన్నికల్లో లబ్ధిపొందాలని చూడటం రాజకీయ పార్టీలు చేసే పని. తమ ప్రయోజనాల పరిరక్షణ సాధ్యమవుతుందనో, తమకు రక్షణ లభిస్తుందనో, తమ ఆర్థిక స్థితి మెరుగుపడుతుందనో ఆశించి చాలామంది ఇలాంటి పార్టీలపై భ్రమలు పెంచుకోవడం మాట వాస్తవమే అయినా అన్నివేళలా అది కొనసాగదు. నిజానికి అలా మత ప్రాతిపదికన ఓట్లేసి ఉంటే మొన్నటి లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి ఈ తరహా విజయం సాధ్యమయ్యేదే కాదు. ఈ దేశ ప్రజలు తమపై చూపిన విశ్వాసాన్ని అవాంఛనీయమైన మాటలతో, అధిక ప్రసంగాలతో చెదరగొట్టుకుంటున్నదీ, అభద్రతా భావన కల్పించి వారిని మరోవైపు నెడుతున్నదీ ఈ బాపతు నేతలే. ఇంతకూ శివసేనకు ముస్లింల ఓటు హక్కు రద్దుచేస్తే బాగుంటుందన్న ఆలోచన ఎందుకొచ్చినట్టు? పుట్టి ఇన్నేళ్లయినా శివసేన అటు పటిష్టమైన ప్రాంతీయ పార్టీగా ఎదగలేదు. కనీసం హిందూత్వ విషయంలోనూ బలమైన పార్టీగా రూపొందలేదు. మహారాష్ట్ర కూటమిలో తనకు ఒకప్పుడు జూనియర్ భాగస్వామిగా ఉన్న బీజేపీ ఇవాళ శాసించే స్థాయికి చేరుకుంది. తన ఓటు బ్యాంకును కొల్లగొడుతున్నది. గొడ్డు మాంసాన్ని నిషేధించడంలోగానీ, మల్టీప్లెక్స్‌లలో మరాఠీ చిత్రాల ప్రదర్శనకు సంబంధించిన ఆంక్షలు విధించడం లోగానీ బీజేపీ చురుగ్గా వ్యవహరించి శివసేనకు ఎజెండా లేకుండా చేసింది. ఎన్డీయే కూటమితో ఉంటామో ఉండమో చెప్పలేమన్న బెదిరింపులేవీ బీజేపీ అధినేతల ముందు పనిచేయలేదు. దానికితోడు ఎంఐఎం మహారాష్ట్రలో వేళ్లూనుకుంటున్న సూచనలు కనిపిస్తున్నాయి. అందువల్లే ఇలాంటి వివాదాన్ని తెరపైకి తీసుకొచ్చి సంచలనం కలిగించాలని, లబ్ధిపొందాలని శివసేన భావిస్తోంది. సమాజంలో అశాం తిని రగిలించేందుకూ, భిన్నవర్గాలమధ్య విభేదాలు సృష్టించేందుకూ ప్రయత్నించే శక్తులను ఆయా పార్టీల్లోని అగ్రనేతలు మందలింపుతో సరిపెట్టడమో, ప్రత్యర్థి పక్షాలు విమర్శించి ఊరుకోవడమో చేసినంతమాత్రాన ఒరిగేదేమీ లేదు. కొంత వ్యవధినిచ్చి అటువంటివారు మళ్లీ అదే బాణీలో మాట్లాడుతున్నారు. సమాజానికి జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. విద్వేషపూరిత వ్యాఖ్యానాలు ఎవరు చేసినా వెనువెంటనే రంగంలోకి దిగి కేసులు పెట్టి చర్య తీసుకునే స్వతంత్ర వ్యవస్థ ఉన్నప్పుడు మాత్రమే ఈ బాపతు నేతలు దారికొస్తారు. తమ వ్యాఖ్యలు ఏదో సంచలనం కలిగించి ఊరుకోవడంకాక జైలుపాలు చేస్తాయని, ఎన్నికల రాజకీయా లకు శాశ్వతంగా దూరంచేస్తాయన్న స్పృహకలిగినప్పుడు నోరు అదుపులో పెట్టుకుంటారు. రాజ్యాంగంపైనా, చట్టబద్ధపాలనపైనా నమ్మకం ఉన్న పాలకులు చేయాల్సిన పని అది.