
విభజన పార్టీలపై ప్రతీకారం తీర్చుకుంటాం: అశోక్‌బాబు
మేమూ రాజకీయాలు చేస్తాం: అశోక్‌బాబు
తణుకు, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజనకు సహకరించిన పార్టీలపై ఓటు హక్కుతో ప్రతీకారం తీర్చుకుంటామని ఏపీఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు అన్నారు. శ్రీరామనవమి సందర్భంగా మంగళవారం తణుకు ఎన్జీవో హోంలో జరిగిన సీతారాముల కల్యాణోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉద్యోగుల డిమాండ్లను మేనిఫెస్టోలో పెట్టిన పార్టీలవైపే ఉద్యోగ సంఘాలు మొగ్గుచూపుతాయని చెప్పారు. రాజకీయ పార్టీలు ఓట్లు, సీట్లు అనే పద్ధతిలో కాకుండా, ఉద్యోగుల సంక్షేమం కోసం పాటుపడాలని.. అటువంటి పార్టీల వైపు తాము ఉంటామన్నారు.
ఉద్యోగుల సమస్యలను, సంక్షేమాన్ని పట్టించుకోకపోతే తామూ రాజకీయాలు చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. కమలనాథన్ కమిటీలో అవగాహనలేమి కారణంగా ఉద్యోగుల ఆప్షన్‌లపై ఎటువంటి స్పష్టతా లేకుండా పోయిందన్నారు. హైదరాబాద్‌లో ఉన్న లక్ష మంది పెన్షనర్లకు సక్రమంగా పెన్షన్ అందాలని, పీఆర్‌సీ, హెల్త్ కార్డులు, కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ తదితర అంశాలకు ప్రాధాన్యతనిచ్చే పార్టీలకే ఉద్యోగ సంఘాలు మద్దతిస్తాయని స్పష్టం చేశారు. 2009 ఎన్నికల్లో 4 లక్షల మంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ల ద్వారా పలుచోట్ల ఎన్నికల ఫలితాలను మార్చారని.. ఉద్యోగులను తక్కువగా అంచనా వేయొద్దని చెప్పారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం వైఎస్సార్ కాంగ్రెస్, టీడీపీ అధినేతలను కలిశామని, త్వరలో మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిని కూడా కలుస్తామని చెప్పారు.