ఓటు హక్కు మరవకు..ఎవ్వరికీ వెరవకు | everyone use their vote with brave | Sakshi
Sakshi News home page

ఓటు హక్కు మరవకు..ఎవ్వరికీ వెరవకు

Published Thu, Mar 20 2014 11:36 PM | Last Updated on Mon, Sep 17 2018 6:08 PM

everyone use their vote with  brave

 సాక్షి, సంగారెడ్డి: ఓటర్లను అడ్డగించి, భయాందోళనలు కలిగించే అరాచక మూకలకు ఇకపై కాలం చెల్లనుంది. ప్రతి ఒక్క ఓటరూ నిర్భయంగా స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకునేలా ఎన్నికల సంఘం పక్కా ప్రణాళికను రచిస్తోంది. ఎన్నికల సంఘం ఆదేశాలతో ఏదైన సమూహానికి చెందిన ప్రజలు ఓటేయకుండా పోలింగ్‌కు దూరంగా ఉంటే.. దానికి గల కారణాలను అధికారులు ఆరా తీస్తున్నారు.

ఓటేయకుండా వీరిని ఏవరైనా అడ్డుకుంటున్నారా?.. భయపెడుతున్నారా?.. లేక వీరే అయిష్టతతో ఓటేయడం లేదా? అన్న అంశాలను తెలుసుకునేందుకు జిల్లావ్యాప్తంగా ప్రత్యేక సర్వే నిర్వహిస్తున్నారు. సమస్యాత్మక, అతి సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక దృష్టి పెట్టడం ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో పరిపాటిగా మారింది. అయితే, ఈ ఎన్నికల్లో మాత్రం నేరుగా ఓటుకు దూరంగా ఉంటున్న ఓటర్లపై ఎన్నికల సంఘం దృష్టిపెట్టడం గమనార్హం.

 బడుగు ఓటరుకు భరోసా
 మారుమూల ప్రాంతాల్లో నివసిస్తున్న దళిత, గిరిజనవాడల్లో తక్కువ ఓటర్లు ఉంటే అక్కడ పోలింగ్ కేంద్రాలు లేవు. సమీప గ్రామంలోని
  పోలింగ్ బూత్‌లకు వెళ్లి ఓటేయాల్సిందే. వీరు ఓటేయకుండా ప్రజలు సుదూరంలో ఉన్న పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటేయాల్సిన దుస్థితి. పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు హక్కును వినియోగించుకోకుండా వీరిని అడ్డుకున్న ఉదంతాలు గతంలో ఎన్నో జరిగాయి. జిల్లాలోని అన్నీ అసెంబ్లీ నియోజకవార్గల్లోని మారుమూల తండాల్లో ఇలాంటి పరిస్థితే ఉన్నా.. నారాయణ్‌ఖేడ్, దుబ్బాక నియోజకవర్గాల్లో మరీ ఎక్కువ అని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.

అసెంబ్లీ నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారుల ఆధ్వర్యంలో సెక్టోరియల్, స్థానిక పోలిసు అధికారులు ఇలాంటి సమూహాలను గుర్తించే పనిలో నిమగ్నమయ్యాయి. ఎన్నికల ఏర్పాట్లను సమీక్షించడానికి కలెక్టర్ స్మితా సబర్వాల్ నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు, సెక్టోరియల్ అధికారులతో  శుక్రవారం సమీక్ష సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఆలోగా సర్వే నివేదికలను కలెక్టర్‌కు అందజేయనున్నారు.

  నిర్భయంగా పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి స్వేచ్ఛగా ఓటేసేలా ఈ సమూహాల ప్రజలకు ప్రత్యేక రక్షణ కల్పించనున్నారు. అదే విధంగా ఓటర్లలో ధైర్యాన్ని నింపడంతో పాటు ఓటు హక్కుపై చైతన్యం కల్పించడానికి అధికారులు ఆయా ప్రాంతాలను సందర్శించి కౌన్సెలింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. అవసరమైతే స్వచ్ఛంద సంస్థ సహకారాన్ని సైతం తీసుకోవాలని సూచించింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement