![Senior Leaders Of Various Parties Are Interested In Joining The Ysr Congress Party](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/8/YSRCP.jpg.webp?itok=OfNW44Ko)
సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతోంది. సూపర్ సిక్స్‌తో పాటు ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయకపోవడంతో ఎన్నికలు జరిగిన ఆరు మాసాల్లోనే టీడీపీ కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి వ్యక్తం అవుతోంది. దీంతో సీనియర్ రాజకీయ నేతలంతా ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు.
ప్రజల ఆకాంక్ష లకు అనుగుణంగా పనిచేయడంలో టీడీపీ కూటమి ప్రభుత్వం విఫలం అవుతోంది. ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్ హామీల తో పాటు సుమారు 150కి పైగా హామీలు ఇచ్చారు ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్. మ్యానిఫెస్టోలో పేర్కొన్న హామీలే కాకుండా జిల్లాలు.. నియోజకవర్గాల వారీగా స్థానిక హామీలను ప్రత్యేకంగా ఇచ్చారు కూడా. దీంతో గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలకు ఓట్లు వేసి గెలిపించారు ప్రజలు. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చి ఎనిమిది మాసాలు పూర్తయినా హామీల అమలులో టీడీపీ కూటమి ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది.
పింఛన్ల పెంపు మినహా ఏ ఒక్క హామీపై స్పష్టమైన ప్రకటన రాకపోవడంతో ప్రజలు అసంతృప్తి చెందుతున్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ మాటలు నమ్మి ఓట్లు వేస్తే సంక్షేమ పథకాలు ఎందుకు అమలు చేయలేదంటూ వారు భగ్గుమంటున్నారు. ఈ నేపథ్యంలో ఏపీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. పీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ వైఎస్సార్ సీపీలో చేరటం ప్రాధాన్యత సంతరించుకుంది. శైలజానాథ్ చేరికతో ఉమ్మడి అనంతపురం జిల్లాలో వైఎస్సార్‌సీపీ మరింత బలోపేతం అయింది.
ఇదీ చదవండి: జగనన్న చేసిన సాయం.. ‘తండేల్’లో చూపకపోవడం బాధాకరం
శింగనమల నియోజకవర్గం నుంచి 2004, 09 ఎన్నికల్లో శైలజానాథ్ గెలుపొందారు. ప్రభుత్వ విప్‌గా, విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో సాకే శైలజానాథ్ కీలక పాత్ర పోషించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు సాకే శైలజానాథ్. రాజకీయాలంటే వ్యాపారం కాదని.. ప్రజా సేవ అని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేస్తున్నారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు చాలా మంది సీనియర్ నేతలు ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. తాజా పరిణామాలు టీడీపీ, జనసేన, బీజేపీలకు మింగుడు పడటం లేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే.. అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు గడవకనే గతం లో ఎన్నడూలేని విధంగా ప్రజా వ్యతిరేకత మూటగట్టుకోవడమే ఇందుకు కారణంగా చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment