
సాక్షి, సిటీబ్యూరో: లోక్‌సభ ఎన్నికల్లో ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఎలక్షన్ కమిషన్ ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ‘నా ఓటు’ అనే యాప్‌ను ప్రవేశపెట్టి.. ఓటర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో పోలింగ్ కేంద్రం, ఓటరుతో పాటు సమాచారాన్ని తెలుసుకునే విధంగా డిజైన్ చేశారు. స్మార్టుఫోన్ ఉన్న ప్రతిఒక్కరూ ఈ యాప్ ద్వారా ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చు. ఏప్రిల్ 11న జరిగే పోలింగ్ సమయంలో ఓటుహక్కును సులువుగా వినియోగించుకునేందుకు ఉపయోగపడుతుంది. ఇందులో పొందుపరిచిన అంశాలు ఓటర్లను చైతన్యం చేసే విధంగా ఉన్నాయి.
సమాచారం ఇలా..
ఈ యాప్ ద్వారా సమగ్ర సమాచారాన్ని ‘ఓటరు అన్వేషణ’ తో çపూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. గ్రామం, వయస్సు, పేరు, తండ్రి, లింగం, జిల్లా, నియోజకవర్గం నమోదు చేస్తే అన్ని వివరాలు తెరపై కనిపిస్తాయి. ఎలక్ట్రానిక్ ఫొటో ఐడెంటీ కార్టు (ఎపిక్) సంఖ్యతో సహా కేంద్రం వివరాలు వస్తాయి. ఒక వేళ ఇవన్నీ కాకున్నా ఎపిక్ సంఖ్య నమోదు చేసినా ఓటరు వివరాలు పూర్తిగా తెలుస్తాయి. దివ్యాంగుల కోసం నాఓటు యాప్‌లో ‘పికప్ సర్వీస్’ అనే ఆప్షన్ ఉంది. వారు తమ ఎపిక్ నంబర్ నమోదు చేస్తే నిర్దేశిత బీఎల్‌ఓకు పోలింగ్ కేంద్రానికి తీసుకెళ్లాలనే సమాచారం వెళుతుంది. దీనికోసం దివ్యాంగుల ఫోన్ నెంబర్ అనుసంధానం చేసి ఉండాలి. అలా లేకపోయినా సంబంధిత బీఎల్‌ఓకు ఫోన్‌చేస్తే వారిని పోలింగ్ కేంద్రానికి తీసుకెళ్తారు. ప్రభుత్వం పంపిణీ చేసే ప్రతి ఓటరు చీటీపై సంబంధిత బీఎల్‌ఓ నంబర్ ఉంటుంది. ఇందుకోసం పీడబ్ల్యూడీ వలంటీర్లను ప్రభుత్వం ప్రత్యేకంగా నియమించింది. తమ పోలింగ్ కేంద్రం పేరును నొక్కితే ఆ కేంద్రంలోని సంబంధిత వలంటీర్ పేరు, హోదా, ఫోన్ నంబర్ తెరపై ప్రత్యక్షమవుతుంది. దివ్యాంగులు వలంటీర్లకు ఫోన్‌చేస్తే.. వారు ఓటర్ల వద్దకు వెళ్లి, ప్రత్యేక వాహనంలో పోలింగ్ కేంద్రానికి తీసుకెళ్లి తిరిగి ఇంటికి చేరుస్తారు.
అభ్యర్థుల వివరాలు..
ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల పేర్లు యాప్‌లో కనిపించనున్నాయి. ఇందులో జిల్లా ఎన్నికల ఆఫీసర్, ఆయా నియోజక వర్గాల ఆర్వోల పేర్లు, ఫోన్ నంబర్లతో పాటు ఈ– మెయిల్ వివరాలు కూడా ఉంటాయి. వీటితో పాటు ఎన్నికల షెడ్యూల్ మొదలు, ప్రక్రియ పూర్తయ్యే వరకు ఏఏ తేదీల్లో ఏ కార్యక్రమం ఉంటుందనే సమాచారం యాప్‌లో పొందుపరిచారు.
కేంద్రానికి ఎలా వెళ్లాలంటే...
ఈ యాప్‌లో పోలింగ్ రూట్ మ్యాప్ తెలిపే ఆప్షన్ ఇచ్చారు. ఇందులో ఓటర్లు తాము ఉన్న ప్రదేశం నుంచి నిర్దేశిత పోలింగ్ కేంద్రానికి చేరుకోవడానికి రూట్ మ్యాప్‌తో పాటు చిరునామా కనిపిస్తుంది. సంబంధిత ఫోన్‌లో జీపీస్ కూడా పని చేయాల్సి ఉంటుంది. యాప్ కింద భాగంలో పోలింగ్ స్టేషన్, పోలీస్‌స్టేషన్, బస్టాప్ వివరాలతో కూడిన ఆప్షన్లను ఎన్నికల సంఘం వారు ఉంచారు. ఓటర్లు తాము ఉన్న ప్రదేశానికి సమీపంలోని పోలీస్‌స్టేషన్, బస్టాప్ వివరాలను తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే ఎన్నికల సంఘం ఈ ఏర్పాట్లు చేస్తుంది. స్మార్ట్‌ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ గూగుల్ ప్లే స్టోర్‌లో ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment