
అమరావతి నగరాన..అపురూప ఘట్టం
♦ నేడు రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్
♦ వేదిక : అసెంబ్లీ కమిటీ హాలు
♦ ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహణ
♦ 5,246 కృష్ణా, గుంటూరు జిల్లాల ఎమ్మెల్యేల ఓట్ల విలువ
⇔ అమరావతి ఓ అపురూప ఘట్టానికి వేదిక కానుంది. రాష్ట్రపతి ఎన్నికలు సోమవారం నిర్వహించనున్నారు. ఈ ప్రతిష్టాత్మక ఎన్నికలకు తొలిసారి రాష్ట్ర అసెంబ్లీ వేదికగా మారనుంది. కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి 33 మంది ఎమ్మెల్యేలు, ఐదుగురు ఎంపీలు ఓటు హక్కు కలిగి ఉన్నారు.
సాక్షి, అమరావతిబ్యూరో:
రాష్ట్రానికి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కును అమరావతిలో వినియోగించుకుంటారు. రాష్ట్రంలో ప్రస్తుతం 175 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. వాటిలో నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి మృతి చెందడంతో ఆ స్థానం ఖాళీగా ఉంది. మిగిలిన 174 మంది కూడా సోమవారం తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అమరావతి పరిధిలోని కృష్ణా జిల్లాలో 16 మంది ఎమ్మెల్యేలు రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటర్లుగా ఉన్నారు. వారిలో కామినేని శ్రీనివాస్, కొల్లు రవీంద్ర, రక్షణనిధి, వల్లభనేని వంశీ, ఉప్పలపాటి కల్పన, బోడే ప్రసాద్, బోండా ఉమా తొలిసారి రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయనున్నారు.
మిగిలిన ఎమ్మెల్యేలు గతంలోనూ ఎమ్మెల్యే, ఎంపీలుగా చేసిన అనుభవం ఉంది. వారు గతంలో రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక గుంటూరు జిల్లాలో 17 మంది ఎమ్మెల్యేలు ఓటింగ్‌లో పాల్గొంటారు. వారిలో ఆళ్ల రామకృష్ణారెడ్డి, కోన రఘుపతి, ముస్తఫా, గోపిరెడ్డి శ్రీని వాసరెడ్డి, తెనాలి శ్రావణ్‌కుమార్, అనగాని సత్యప్రసాద్, రావెల కిషోర్‌బాబు తొలిసారి ఎమ్మెల్యేలుగా ఉన్నారు. వారు రాష్ట్రపతి ఎన్నికల్లో మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. మిగిలినవారు గతంలో కూడా ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు.
రెండు జిల్లాల్లో ఐదుగురు ఎంపీలు
రాష్ట్రంలో 25 మంది లోక్‌సభ సభ్యులు రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయనున్నారు. వారిలో కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి ఐదుగురు ఎంపీలు ఉన్నారు. విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు, నరసరావుపేట, బాపట్ల ఎంపీలు రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేస్తారు. కేశినేని నాని, గల్లా జయదేవ్, శ్రీరాం మాల్యాద్రి తొలిసారి ఎంపీలుగా గెలుపొందారు. రాష్ట్రానికి చెందిన 11 మంది రాజ్యసభ సభ్యులు రాష్ట్రపతి ఎన్నికల ఓటింగ్‌లో పాల్గొంటారు. వారిలో అమరావతి నుంచి ఒక్క కేంద్రమంత్రి సుజనా చౌదరి మాత్రమే ఉన్నారు.
వై.ఎస్.జగన్ రాక నేడు
రాష్ట్రపతి ఎన్నికల కోసం వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం విజయవాడ రానున్నారు. హైదరాబాద్ నుంచి బయలుదేరి ఆయన సోమవారం ఉదయం 8 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా విజయవాడలోని స్టేట్ గెస్ట్ హౌస్‌కు వస్తారు. అక్కడ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో కాసేపు సమావేశమవుతారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటింగ్‌పై చర్చిస్తారు. అనంతరం పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో కలసి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అమరావతిలోని తాత్కాలిక అసెంబ్లీ భవనానికి బయలుదేరుతారు. అసెంబ్లీ కమిటీ హాలులో నిర్వహించే రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొంటారు. రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ముగిసిన అనంతరం హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమవుతారు.