టిఫిన్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ, కూరగాయల దుకాణం వద్ద..
సాక్షి, సూపర్‌బజార్(కొత్తగూడెం): ఓటు హక్కు వినియోగంపై ప్రజల్లో చైతన్యం పెంచేందుకు ఎన్నికల అధికారులు వినూత్న రీతిలో అవగాహన కల్పిస్తున్నారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రజత్‌కుమార్ శైనీ ప్రత్యేక దృష్టి పెట్టి విస్తృతస్థాయిలో ప్రచారం చేపట్టేలా చర్యలు తీసుకున్నారు. ఈవీఎం, వీవీప్యాట్‌ల వినియోగంపై మారుమూల గ్రామాల్లో కూడా అవగాహన కల్పించారు. పోస్టర్లు, ఆకాశవాణి ద్వారా కూడా ప్రచారం చేపట్టారు. తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో, వాహనాలు సైతం వెళ్లడానికి అవకాశం లేని ప్రాంతాలకు ప్రత్యేకంగా పోలీస్ అధికారితో కలిసి మోటారుసైకిల్‌పై 21 కిలోమీటర్లు ప్రయాణించి ఆయా గ్రామాలకు చేరుకుని ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. ప్రజలకు ఓటు హక్కు విలువను తెలియజేసే విధంగా కూరగాయల, పండ్ల వ్యాపారులకు ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకుంటాం.. ప్రలోభాలకు గురికాం అనే ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తున్నారు. మండల సమాఖ్య, డ్వాక్రాసంఘ సమావేశాల్లో మహిళలకు, కళాశాలల్లో యువతకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దివ్యాంగులకు కల్పిస్తున్న రవాణా సౌకర్యాలపై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఓటు హక్కుపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు అంతర్జాతీయ స్థాయిలో విలువిద్యలో జిల్లా కీర్తిప్రతిష్టలను ఇనుమడింపచేసిన గొంది మారెప్పను ఐకాన్‌గా నియమించారు. జిల్లాలో గత ఎన్నికల్లో నమోదైన 70 శాతం ఓటింగ్‌ను ఈసారి మరింత పెంచాలని కలెక్టర్, ఇతర అధికారులు కృషి చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment