కొత్తగూడెం రామవరంలోని పోలింగ్ కేంద్రంలో బారులుదీరిన ఓటర్లు
సాక్షి, కొత్తగూడెం: శాసనసభ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో కలిపి 79.5 శాతం ఓట్లు పోలయ్యాయి. అశ్వారావుపేట నియోజకవర్గంలో 88.61 శాతం, భద్రాచలంలో 78.5 శాతం, కొత్తగూడెంలో 80.18 శాతం, పినపాకలో 82 శాతం, ఇల్లెందులో 68 శాతం పోలింగ్ నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన 13 నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. కాగా, జిల్లాలోని ఐదు నియోజకవర్గాలూ మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలే కావడంతో గంట ముందుగానే పోలింగ్ ముగించేలా చర్యలు తీసుకున్నారు.
అయినప్పటికీ సాయంత్రం ఓటర్లు ఎక్కువగా రావడంతో 4 గంటలలోగా పోలింగ్ కేంద్రాలకు వచ్చి క్యూలో నిల్చున్నవారికి అవకాశం కల్పించారు. పలు కేంద్రాల్లో మొదట్లో ఈవీఎంలు మొరాయించడం, కొన్ని చోట్ల మధ్యమధ్య సాంకేతిక సమస్యలు తలెత్తడంతో పోలింగ్ ప్రక్రియ కొంత ఆలస్యమైంది. భద్రాచలం, అశ్వారావుపేట నియోజకవర్గాల్లో ని కొన్ని కేంద్రాల్లో రాత్రి 8 గంటల వరకు, పినపాక, కొత్తగూడెం, ఇల్లెందు నియోజకవర్గాల్లో రాత్రి 9.30 గంటల వరకు పోలింగ్ కొనసాగింది. మొదట్లో మందకొడిగా ప్రారంభమైనప్పటికీ చివర్లో ఓటర్లు పోటెత్తడం గమనార్హం. పలు కేంద్రాల్లో పోలింగ్ ఆలస్యం అయిన నేపథ్యంలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడంతో పోలీసులు అత్యంత పకడ్బందీగా వ్యవహరించారు. ముఖ్యంగా భద్రాచలం నియోజకవర్గంలోని ఛత్తీస్‌గఢ్‌కు సరిహద్దులో ఉన్న చర్ల మండలంలోని కొన్ని బూత్‌ల్లో రాత్రి 8 గంటల వరకు పోలింగ్ నిర్వహించాల్సి రావడంతో మరింతగా జాగ్రత్తలు పాటించారు.
ఎన్నికల నేపథ్యంలో ఎ లాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకపోవడంతో ఎన్నికల సంఘం, పోలీసు యంత్రాంగం ఊపిరి పీల్చుకున్నా యి. అయితే భద్రాచలం నియోజకవర్గం పరిధిలోని వాజేడు, వెంకటాపురం మండలాలు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉన్నాయి. ఈ క్రమంలో వాజేడు మండలంలో పోలింగ్ పూర్తయిన తర్వాత ఎన్నికల సిబ్బంది ఈవీఎంలు, ఇతర పోలింగ్ సామగ్రితో వాజేడు నుంచి భద్రాచలం మీదుగా పాల్వంచలోని స్ట్రాంగ్ రూంకు తరలించారు. అయితే సిబ్బంది ప్రయాణిస్తున్న బస్సు వెంకటాపురం చేరుకున్న తరువాత చర్ల, భద్రాచలం మార్గంలో వెళ్లడం శ్రేయస్కరం కాదని పోలీసులు సూచించడంతో వెంకటాపురం నుంచి తిరిగి వాజేడు వెళ్లారు. అక్కడి నుంచి ఏటూరునాగారం, మంగపేట, మణుగూరు మీదుగా పాల్వంచకు చేరుకున్నారు.
ముఖ్యంగా భద్రాచలం నియోజకవర్గంలో ప్రధాన రహదారి కాకుండా అటవీ ప్రాంతాల్లో పోలీసు బలగాలను భారీగా మోహరించారు. మావోయిస్టు పార్టీ అనుబంధ పీఎల్‌జీఏ(పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ రోత్సవాలు శనివారం వరకు ఉండడంతో పోలింగ్ భద్రతతో పాటు సమాంతరంగా సరిహద్దులో కూంబింగ్ నిర్వహించారు. ఈ క్రమంలో చర్ల మండలం పెదమిడిసిలేరు వద్ద సీఆర్‌పీఎఫ్ 141 బెటాలియన్ సిబ్బంది మావోయిస్టు యాక్షన్ టీం సభ్యు డిని అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి డైరెక్షనర్ మైన్స్(పేలుడు పదార్థాలు) స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
అంచనాల్లో పార్టీలు, అభ్యర్థులు..
నామినేషన్ల ఉపసంహరణ పర్వం పూర్తయినప్పటి నుంచి బరిలో నిలిచిన అభ్యర్థులు గెలుపు కోసం హోరాహోరీ ప్రచారం చేశారు. అనేక రకాల వ్యూహాలు, ఎత్తులు, పైఎత్తులతో ఎన్నికల రణక్షేత్రంలో ముందుకెళ్లారు. ముఖ్యంగా ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎప్పటికప్పుడు కేడర్‌ను సమాయత్తం చేసుకుంటూ పోలింగ్ ముగిసేవరకు రేయింబవళ్లు పనిచేశారు. ఎట్టకేలకు ఎన్నికలు ముగియడంతో ఆయా అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తం అయింది. మరో మూడు రోజుల్లో తమ భవితవ్యం తేలనుండడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తూనే పలు రకాల అంచనాలు, లెక్కలు వేసుకుంటున్నారు. అన్ని నియోజకవర్గాల్లో ప్రధానంగా టీఆర్‌ఎస్, కాంగ్రెస్ కూటమి మధ్యే పోటీ ఉంది. అన్ని చోట్లా పోటీ నువ్వా.. నేనా.. అనే స్థాయిలో పోలింగ్ జరిగినట్లు రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment