ఈసీని డిమాండ్ చేసిన ఏడీఆర్
న్యూఢిల్లీ: ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో పోలైన ఓట్లకు, లెక్కించిన ఓట్లకు మధ్య వ్యత్యాసం ఎందుకుందో చెప్పాలని భారత ఎన్నికల సంఘాన్ని అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫారమ్స్ (ఏడీఆర్) గురువారం డిమాండ్ చేసింది. ఓట్లలో వ్యత్యాసానికి కారణాలను వివరించాలని కోరింది.
సార్వత్రిక ఎన్నికల్లో ఏకంగా 538 నియోజకవర్గాల్లో పోలైన ఓట్లు, లెక్కించిన ఓట్లకు మధ్య తేడాలున్నాయని ఏడీఆర్ సోమవారం తమ నివేదికలో వెల్లడించిన విషయం తెలిసిందే. 362 నియోజకవర్గాల్లో పోలైన ఓట్ల కంటే.. 5,54,598 ఓట్లను తక్కువగా లెక్కించారని తెలిపింది. మరో 176 నియోజకవర్గాల్లో పోలైన ఓట్లకంటే 35,093 ఓట్లను అదనంగా లెక్కించారని పేర్కొంది. ఏడీఆర్ సోమవారం నివేదిక వెలువరించినప్పటికీ ఈసీ ఇప్పటిదాకా ఓట్లలో వ్యత్యాసంపై స్పందించలేదు.
ఏపీలోనే అత్యధికం
పోలైన, లెక్కించిన ఓట్ల మధ్య వ్యత్యాసం మొత్తం దేశంలో ఆంధ్రప్రదేశ్‌లోనే అత్యధికంగా ఉంది. ఏపీలో 21 నియోజకవర్గాల్లో కలిపి మొత్తం పోలైన ఓట్ల కంటే 85,777 ఓట్లను తక్కువగా లెక్కించారు. అలాగే మరో నాలుగు నియోజకవర్గాల్లో పోలైన ఓట్ల కంటే 3,722 ఓట్లను అధికంగా లెక్కించారు. ఇది అనుమానాలకు తావిస్తోంది.
ఓట్లలో తేడా ఎలా వచి్చందో చెప్పాలని.. ఏడీఆర్ గురువారం ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు జ్ఞానేశ్ కుమార్, డాక్టర్ సుఖ్‌బీర్ సింగ్ సంధూలకు లేఖ రాసింది. సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎంల ఓట్ల లెక్కింపులో వ్యత్యాసాలపై తీవ్ర ఆందోళనను వ్యక్తం చేసింది. ఈ వ్యత్యాసాలపై ఈసీ తక్షణం వివరణ ఇవ్వాలని, ఎన్నికల ప్రక్రియలో ప్రజా విశ్వాసం సడలకుండా చూడాలని కోరింది.
Comments
Please login to add a commentAdd a comment