పలమనేరు ఆర్వో వద్ద రిజర్వులో ఉన్న శిక్షణ పొందిన ఓపీఓలు (ఫైల్)
జిల్లా వ్యాప్తంగా వివిధ కార్యాలయాల్లో అనేక కేడర్లలో పనిచేస్తున్న 18వేల మందిని ఓపీవీలుగా నియమించారు. వారిలో 4,800 మంది వరకు అంగన్ వాడీ వర్కర్లు, స్వీపర్లు, ఆశావర్కర్లు ఉన్నారు. ఎన్నికల విధులకు వినియోగించే ఉద్యోగులకు తప్పనిసరిగా పోస్టల్ బ్యాలెట్ ను అందజేయాల్సి ఉంటుంది. అయితే 4,800 మందికి పోస్టల్ బ్యాలెట్లు ఇవ్వకుండా ఓటు వేసే వారి ప్రాథమిక హక్కును కాలరాశారు. ఈ విషయం జిల్లావ్యాప్తంగా విమర్శలకు తావిస్తోంది. ఓటు విలువను తెలియజేసే జిల్లా యంత్రాం గమే ఇలా చేయడంపై పలువురు ఈ ఘటనను ఈసీ దృష్టికి తీసుకెళ్లడానికి సిద్ధమవుతున్నారని తెలిసింది.
చిత్తూరు కలెక్టరేట్ : ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరికీ ఓటు వేసేందుకు అవకాశం కల్పించాలి. ఎన్నికలను నిష్పక్షపాతంగా, నిజాయితీగా నిర్వహించాల్సిన జిల్లా యంత్రాంగం 4,800 మంది ఉద్యోగులకు ఎన్నికల బాధ్యతలు అప్పజెప్పి వారి ఓటు హక్కును వినియోగించుకోకుండా దూరం చేసింది. ప్రతి ఐదు సంవత్సరాలకొకసారి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేసేందుకు 18 సంవత్సరాలు నిండిన వారందరికీ హక్కును కల్పి స్తారు. ఆ హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని జిల్లాలోని ప్రతి ఊరిలో ప్రచారం కల్పిం చిన జిల్లా యంత్రాంగమే తప్పు చేయడంపై విమర్శలు గుప్పుమంటున్నాయి. ఎన్నికల ప్రక్రియలో పోలింగ్ బూత్‌లలో విధులు నిర్వహించడానికి 1+5 చొప్పున పీఓ, ఏపీఓ, ఓపీఓలను నియమించారు. జిల్లావ్యాప్తంగా 3,800 పోలింగ్ కేంద్రాలున్నాయి. ఆ పోలింగ్ కేంద్రాల్లో విధులు నిర్వహించడానికి 27,189 మందిని నియమించారు. పోలింగ్ బాధ్యతలు అప్పజెప్పే వారికి ముందుగా పోస్టల్ బ్యాలెట్ అందజేయాల్సి ఉంది. పోలింగ్ ప్రక్రియ కసరత్తులో నిర్లక్ష్యం వహించడం వల్ల ఓపీఓల నియామకాల్లో తప్పిదాలు చేశారు. ఓపీఓ కేడర్‌లో విధులు నిర్వహించడానికి ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే జూనియర్, సీనియర్, రికార్డు అసిస్టెంట్ వారిని తీసుకోవాల్సి ఉంటుంది. అయితే జిల్లాలో అలా చేయకుండా అంగన్‌వాడీ వర్కర్లను, స్వీపర్లను, ఆశా వర్కర్లకు విధులు అప్పగించారు. పోతేపోనీ అనుకుంటే వారి ఓటు హక్కుకు భంగం కలిగించడం ఎంతవరకు న్యాయమని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.
అధికారిక కుట్రేనా?
అంగన్‌వాడీ వర్కర్లను, స్వీపర్లను, ఆశావర్కర్లను విధులకు కేటాయించి వారి ఓటు హక్కును కాలరాయడం అధికారికంలో ఉన్న పాలకులు చేయించిన కుట్రే అని అనుమానాలు వస్తున్నాయి.
గత ఐదు సంవత్సరాల్లో అంగన్‌వాడీ ఉద్యోగులకు అధికారంలో ఉన్న ప్రభుత్వం అన్యాయం చేసిందని ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వారు అధికారంలో ఉన్న పాలకులకు ఓట్లు వేయరని, వారి ఓట్లు మరొకరికి పడకూడదనే కుట్రతో ఇలాంటి పనులను అధికారులతో చేయించారని తెలుస్తోంది. అధికార పార్టీకి తొత్తులుగా ఉన్న అధికారులు కొందరు ఇలా చేయడం బాధ్యతారాహిత్యమని విమర్శలు వస్తున్నాయి.
బాధ్యులు ఎవరు?
తాము ఓటు హక్కు కోల్పోవడంపై ఎవరు బాధ్యత వహిస్తారని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ఓపీఓ విధులపై కనీస అవగాహన లేని వారిని విధులకు కేటాయించడం ఎంతవరకు న్యాయమని వామపక్ష నాయకులు ప్రశ్నిస్తున్నారు. జిల్లాలోని 3,800 పోలింగ్ కేంద్రాల్లో ఓపీఓలుగా 18వేల మందిని నియమించిన వారిలో 30 శాతం మందిని పోలింగ్ రోజున రిజర్వులో ఉంచారు. శిక్షణ తీసుకున్న ఓపీఓ కేడర్ ఉద్యోగులను రిజర్వ్‌లో పెట్టి, శిక్షణ పొందని అంగనవాడీ, ఆశా వర్కర్లను, హెల్పర్లకు పోలింగ్‌లో ఓపీఓలుగా విధులను అప్పజెప్పారు. విధుల కేటాయింపులో అధికార పార్టీ సూచనల మేరకు జిల్లా యంత్రాంగం చేసిన తప్పు వల్ల ఓటు హక్కు కోల్పోయేలా చేసినందుకు బాధ్యత ఎవరు వహిస్తారని రాజకీయపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఈ ఘటనను ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లేందుకు పలు రాజకీయ పార్టీల నేతలు సిద్ధమవుతున్నారని తెలిసింది.
ముమ్మాటికీ అధికారిక కుట్రే
కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎన్నికల కమిషన్, జిల్లా యంత్రాంగం ప్రచారం చేసింది. ప్రతి ఒక్కరూ వారి ప్రాథమిక హక్కు అయిన ఓటును కచ్చితంగా వినియోగించుకోవాలి. జిల్లాలో ఓపీఓలుగా అంగన్‌వాడీ, ఆశా వర్కర్లు, స్వీపర్లను విధులకు కేటాయించి ఓటు హక్కు వినియోగించుకోకుండా చేయడం రాజ్యాంగ విరుద్ధమే. ఓటు హక్కు కోల్పోయిన వారికి కచ్చితంగా పోస్టల్ బ్యాలెట్ ద్వారా అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం. – నాగరాజన్, సీపీఐ, జిల్లా కార్యదర్శి
Comments
Please login to add a commentAdd a comment