చీకటి రోజు | YSRCP Voters Removing From Lists in Vizianagaram | Sakshi
Sakshi News home page

చీకటి రోజు

Published Sat, Jan 26 2019 8:36 AM | Last Updated on Sat, Jan 26 2019 8:36 AM

YSRCP Voters Removing From Lists in Vizianagaram - Sakshi

జామి పోలీస్‌స్టేషన్‌ వద్ద ఉద్రిక్త పరిస్థితి

ఓటర్ల దినోత్సవం నివ్వెరపోయింది. ‘ఓటు హక్కు పొందాలి... దానిని న్యాయం చేస్తారనుకున్న వారిని ఎన్నుకునేందుకు వాడుకోవాలి... నిర్భయంగా హక్కును వినియోగించుకోవాలి.’ అంటూ ఓ వైపు నినాదాలు జిల్లా వ్యాప్తంగా మార్మోగుతున్నాయి. ఓటు హక్కు వజ్రాయుధమనీ... దానిని సక్రమంగా వినియోగించుకోమని మరోపక్క ప్రసంగాలతో అధికారులు ఉత్తేజితుల్ని చేస్తున్నారు. కానీ మరోపక్క ఓటు హక్కును హరిస్తున్నారని అడ్డుకుంటున్న వారిపై అదేరోజు కేసులు నమోదయ్యాయి. అన్యాయంగా ఓట్లను తొలగిస్తున్నవారికి లాఠీలు అండగా నిలిచాయి. ప్రభుత్వ పెద్దల తెరవెనుక మంత్రాంగంతో నిరపరాథులపై ప్రతాపం చూపిస్తున్నాయి.

సాక్షి ప్రతినిధి, విజయనగరం: ఓట్ల గల్లంతైపోతున్నాయని ఆందోళ న వ్యక్తం చేసిన వారిని ఓటర్ల దినోత్సవం రోజే రాష్ట్ర ప్రభుత్వం అరెస్టులు చేయించ డం ప్రజాస్వామ్యంలో చీకటిరోజుగా మిగి లింది. అర్ధరాత్రి ఇళ్లల్లో చొరబడి, మహిళలు, వృద్ధులు అని చూడకుండా ఈడ్చుకెళ్లిన పోలీసుల తీరు తీవ్ర విమర్శలకు తావిచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ దిశా నిర్దేశంలో ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం జిల్లా పోలీసులు జిల్లా వైఎస్‌ఆర్‌సీపీ రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావుతో పాటు నేతలను కేవలం ట్యాబ్‌లు లాక్కున్నారనే నెపంతో ఎలాంటి లిఖితపూర్వక ఫిర్యాదు లేకుండానే అరెస్టు చేసి పోలీస్‌ స్టేషన్లకు తరలించడం ఉద్రిక్తతలకు దారితీసింది. ఓ వైపు ఈ విషయంపై ఆందోళన వ్యక్తం అవుతుండగానే జిల్లాలోమరికొన్ని ప్రాంతాల్లో ప్రైవేట్‌ సర్వే బృందాలు కలకలం రేపాయి. వారిని పట్టుకుని పార్టీ నేతలు పోలీసులకు అప్పగించారు. ఓట్లు పోతున్నాయోమోనని ఆందోళన వ్యక్తం చేసిన వారిని అరెస్ట్‌ చే యడంవంటి పరిణామాలపై జిల్లా వ్యాప్తంగా అన్ని వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది.

ప్రజావ్యతిరేకత ఉందన్న భయంతోనే...
ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ప్రజా సంకల్పయాత్రకు విజయనగరం జిల్లాలో విశేష ఆదరణ లభించడంతో అధి కార తెలుగుదేశం పార్టీలో అంతర్మధనం మొదలైంది. ఆ పార్టీ నేతల కంటిమీద కునుకు కరువైం ది. ప్రతిపక్ష పార్టీని జిల్లాలో ఎలాగైనా దెబ్బకొట్టా లని పలు విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో పీపుల్స్‌ రీసెర్చ్‌ అనే ప్రైవేటు సంస్థ వైఎస్సార్‌సీపీ సానుభూతి పరుల ఓట్లను సర్వే ద్వారా గుర్తించి తొలగించే ప్రయత్నం చేస్తోందనే విషయం వెలుగులోకి వచ్చింది. పూసపాటిరేగ మండలం కుమిలి గ్రామంలో సర్వే బృందం సభ్యులను పార్టీ నాయకులు, కార్యకర్తలు గురువారం పట్టుకుని వారి ట్యాబ్‌లను పరిశీలించగా వాటిలో ఓటర్ల జాబితాలు ఉండటం చూసి ఖంగుతిన్నారు. ఓటర్ల జాబితాలతో ఎందుకు సర్వే చేస్తున్నారని నిలదీస్తే వారి నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. అనుమానం వచ్చి వారిని పోలీసులకు అప్పగించారు. సర్వే బృందాన్ని పోలీసులకు అప్పగించిన తర్వాత పోలీసుల తీరు అనుమానాలకు బలం చేకూర్చింది. వెంటనే ఎన్నికల కమిషన్‌కు, డీజీపీకి ఫిర్యాదు చేయడానికి పార్టీ సీనియర్‌ నేతలు సన్నద్ధమయ్యారు.

టీడీపీ కొత్త నాటకం
ఎన్నికల కమిషన్‌ను వైఎస్సార్‌సీపీ నేతలు కలవనున్నారనే విషయం తెలుసుకున్న ప్రభుత్వం ట్యాబ్‌ల నాటకానికి తెరతీసింది. తమ ట్యాబ్‌లు లాక్కుని వెళ్లిపోయారంటూ సర్వే సంస్థ ఫిర్యాదు చేసిందని చెబుతూ అర్ధరాత్రి దాటిన తర్వాత భారీ పోలీసు బలగాలు వైఎస్సార్‌సీపీ నాయకుల ఇళ్లపై పడ్డారు. ఆ సంస్థ ఫిర్యాదు చేయడం, అర్ధరాత్రి పోలీసులు రంగంలోకి దిగడం మరింత అనుమానాలు రేకెత్తించింది. పూసపాటిరేగ, కు మిలి గ్రామాలకు చెందిన 14 మందిని వారి ఇళ్లనుంచి బలవంతంగా బయటకు లాక్కువచ్చి అరె స్ట్‌ చేశారు. అర్ధరాత్రి తమ వారిని ఎందుకు అరెస్ట్‌ చేస్తున్నారు, ఎక్కడికి తీసుకువెళుతున్నారని అడిగిన మహిళలను, ప్రజా ప్రతినిధులను పక్కకు ఈడ్చిపడేశారు. అయినా ప్రభుత్వం సంతృప్తి చెం దలేదు. ప్రజాసంకల్పయాత్రలో జిల్లా వ్యాప్తంగా నాయకత్వం వహించిన మజ్జి శ్రీనివాసరావును టార్గెట్‌ చేసింది. విజయనగరం పట్టణంలోని ధర్మపురిలో ఉన్న శ్రీనివాసరావు ఇంటిని తెల్లవారుజామునే పోలీసు బలగాలు ముట్టడించాయి. ఆయన నిద్రలేవకముందే చుట్టుముట్టాయి. ఎలాంటి ఆధారంగానీ, ఫిర్యాదుగానీ లేకుండానే ఆయన్ను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

అప్పటి పార్టీ నాయకులుగానీ, కార్యకర్తలుగానీ అందుబాటులో లేకపోవడం, కొద్దిమంది సిబ్బంది మాత్రమే శ్రీనివాసరావు ఇంటి వద్ద ఉండటంతో కాసేపు ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ఈ విషయం తెలుసుకున్న పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా శ్రీనివాసరావు నివాసానికి చేరుకుంటుండగానే ఆయనను పోలీసులు వాహనంలో ఎక్కించి పట్టణమంతా తిప్పి తమను వెంబడిస్తున్న మీడియాను ఏమార్చేందుకు యత్నించి చివరకు జామి స్టేషన్‌కు తీసుకువెళ్లారు. కేవలం ట్యాబ్‌ల కోసం ఇంత హైడ్రామా నడపాల్సిన అవసరం ఏమిటనే ప్రశ్నకు పోలీస్‌ అధికారుల వద్ద సమాధానం లేదు. ఎమ్మెల్సీ, పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల కన్వీనర్‌ కోలగట్ల వీరభద్రస్వామితో పాటు విజయనగరం, అరకు పార్లమెంటరీ జిల్లాల అధ్యక్షులు బెల్లాన చంద్రశేఖర్, శత్రుచర్ల పరీక్షిత్‌రాజు, పార్టీ నియోజకవర్గాల సమన్వయకర్తలు కడుబండి శ్రీనివాసరావు, అలజంగి జోగారావు, శంబంగి వెంకట చినప్పలనాయుడు, బొత్స అప్పలనర్సయ్య, సీనియర్‌ నేతలు పెనుమత్స సాంబశివరాజు, నెక్కల నాయుడుబాబు తదితరులు పోలీస్‌ స్టేషన్‌ వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు. తమ నాయకుడిని ఎందుకు అరెస్ట్‌ చేశారంటూ డీఎస్పీ శ్రావణ్‌కుమార్‌ను ప్రశ్నించారు. జిల్లా వ్యాప్తంగా జరిగిన అరెస్టులకు నిరసనగా ఆయా ప్రాంతాల్లో పార్టీ శ్రేణులు ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించాయి.

ఆగని సర్వే బృందాల చర్యలు
ఇంత జరుగుతున్నా జిల్లాలోని చీపురుపల్లి, నెల్లి మర్ల, బొబ్బిలి, సాలూరు, గజపతినగరం వంటి ప్రాంతాల్లో సర్వే బృందాలు శుక్రవారం కూడా తి రిగాయి. దాదాపు 700 మంది సభ్యులు ఈ బృం దాల్లో ఉన్నట్లు భావిస్తున్నారు. వారిలో కొందరిని అడ్డుకున్న వైఎస్సార్‌సీపీ నాయకులు స్థానిక పోలీ సులకు అప్పగించారు. మరోవైపు సర్వేను తప్పుబట్టలేమని, వారిని అడ్డుకోవడమే తప్పని విశాఖ రేంజ్‌ డీఐజీ జి.పాలరాజు ఓ ప్రకటన విడుదల చే శారు. ఇంకోవైపు పార్టీ సీనియర్‌ నేత, మాజీ మం త్రి బొత్స సత్యనారాయణ అమరావతిలో ఎన్నికల కమిషన్‌ను, డీజీపీని కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం జిల్లాలో అరెస్ట్‌ అయిన వారిని పోలీసులు స్టేషన్‌ బెయిల్‌(41 నోటీస్‌)పై మధ్యాహ్నం 2గంటల సమయంలో విడుదల చేశారు. అయితే ఈ మొత్తం ఉదంతం నేపథ్యంలో ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీని భయపెట్టాలని అధికార టీడీపీ చేసిన ప్రయత్నం బెడిసి కొట్టింది. ప్రైవేటు సర్వే సంస్థపై సాక్షా త్తూ మంత్రి సుజయకృష్ణ రంగారావు ప్రేమ ఒలకబోస్తూ వ్యా ఖ్యలు చేయడం, అర్ధరాత్రి పోలీసులు అరెస్టులకు పాల్పడటం వంటి పరిణామాలు ఓట్ల తొలగింపు ప్రక్రియను  అధికారపార్టీయే చేపడుతోందనే అనుమానాలకు బలం చేకూర్చాయి.

రామభద్రపురంలో సర్వే కలకలం
రామభద్రపురం: మండలంలోని నరసాపురంలో పార్వతీపురం ఏరియా పెదబొండపల్లికి  చెందిన గొడబ కిరణ్‌కుమార్‌ అనే యువకుడు ఇంటింటికీ తిరిగి మీరు ప్రభుత్వానికి అనుకూలమా... ప్రతికూలమా అంటూ ప్రశ్నిస్తుండటతో ఆయన్ను స్థానికులు పోలీసులకు అప్పగించారు. గ్రామంలోని 147 బూత్‌లో ఉన్న ఓటర్లను వివిధ ప్రశ్నలు వేసి వివరాలను ట్యాబ్‌లో ఆన్‌లైన్‌ చేస్తుండటం, అక్కడ వారు లేకపోయినా ఫోన్‌ నంబర్‌ తీసుకుని వారిని ఫోన్‌లో సంప్రదిస్తుండటంతో ఆ యువకుడిని నిలదీశారు. ఆయన పొంతన లేని సమాధానాలు చెప్పడంతో ఆ యువకుడిని పోలీసులకు అప్పగించారు. ఆ యువకుడితో పూచీకత్తు రాయించుకుని విడిచిపెట్టినట్టు ఎస్‌ఐ ఆర్‌ సత్యంనాయుడు తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement