
సాక్షి, న్యూఢిల్లీ: విజయనగరంలో 73.68 కోట్ల రూపాయల వ్యయంతో 100 పడకల ఆస్పత్రి నిర్మాణానికి కార్మిక బీమా సంస్థ (ఈఎస్‌ఐ) ఆమోదించినట్లు కార్మిక శాఖ మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ వెల్లడించారు. వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు మంత్రి ఈ మేరకు బుధవారం రాతపూర్వక సమాధానమిచ్చారు. ఈ ఆస్పత్రిలో ప్రాథమిక వైద్య సేవలతోపాటు ఔట్ పేషెంట్, ఇన్ పేషంట్లకు ప్రత్యేక వైద్య సదుపాయాలను కల్పించబోతున్నట్లు వెల్లడించారు. ఎమర్జెన్సీ సర్వీసులు, ఆపరేషన్ థియేటర్, లేబర్ రూమ్, డయాగ్నోస్టిక్స్ సేవలు, మందుల పంపిణీతో వంటి సకల సదుపాయాలను అందుబాటులోకి తీసురానున్నట్లు తెలిపారు. అదే విధంగా.. ఈ ఆస్పత్రిలో ఆయుష్ కింద కూడా రోగులకు సేవలు అందిస్తారని చెప్పారు. ఆస్పత్రి నిర్మాణాన్ని 2023 నాటికల్లా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు.(చదవండి: బడ్జెట్ 2021: రాష్ట్రంపై సవతి తల్లి ప్రేమ)
గృహ రుణాల వడ్డీపై సబ్సిడీ పథకం పొడిగింపు
మధ్య తరగతి ప్రజలు తమ సొంతింటి కలను నెరవేర్చుకునేందుకు ప్రవేశపెట్టిన గృహ రుణాల వడ్డీపై సబ్సిడీ చెల్లింపు పథకం (సీఎల్‌ఎస్‌ఎస్)ను ఈ ఏడాది మార్చి 31 వరకు పొడిగించినట్లు గృహ నిర్మాణ శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి తెలిపారు. రాజ్యసభలో బుధవారం వఘెస్సార్ సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన స్పందిస్తూ.. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (అర్బన్) కింద అర్హులైన మధ్య తరగతి ప్రజలు గృహ రుణాలపై వడ్డీ మొత్తాన్ని ప్రభుత్వం సబ్సిడీ రూపంలో చెల్లిస్తుందని అన్నారు.
అదే విధంగా అర్హులైన లబ్దిదారులు రుణం పొందిన వెంటనే వడ్డీ మొత్తాన్ని వారి అకౌంట్ ద్వారా రుణం తీసుకున్న సంస్థలకు ప్రభుత్వం బదలాయిస్తుందని తెలిపారు. ఆత్మనిర్భర్ భారత్ కింద గృహ రుణాలపై వడ్డీ సబ్సిడీ పథకాన్ని గత ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఈ ఏడాది మార్చి 31 వరకు పొడిగించినట్లు మంత్రి తెలిపారు. 2020-21 మధ్యకాలంలో ఈ పథకం కింద 1.67 లక్షల మంది లబ్ది పొందారు. పథకం ప్రారంభిన నాటి నుంచి ఇప్పటి వరకు 4.93 లక్షల మంది ప్రయోజనం పొందారని మంత్రి చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment