లేజీ యూత్‌! | Nets Away Shocking Report on Voting Percentage in Metro Cities | Sakshi
Sakshi News home page

లేజీ యూత్‌!

Published Tue, Feb 12 2019 10:49 AM | Last Updated on Mon, Mar 11 2019 11:12 AM

Nets Away Shocking Report on Voting Percentage in Metro Cities - Sakshi

విద్యాధికులు, ఉద్యోగులు అధికంగా ఉండే నగరాల్లో ఓటు చైతన్యం కొరవడుతోంది. ప్రజాస్వామ్యంలో ఓటుకు ఎంతో విలువుంటుంది. ఐదేళ్ల పాటు మనల్ని పాలించేవారిని ఎన్నుకోవడంలో ఓటు పాత్ర కీలకం. అయితే ఈ కీలక పాత్రను నేటి యువత విస్మరిస్తోంది. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు ఎన్ని చైతన్య, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా ఓటు వేయడంలో మాత్రం నగర యువత బద్ధకిస్తోంది. హైటెక్‌సిటీగా పేరొందిన మన భాగ్యనగరంలో దాదాపు 55 శాతం మంది యువత ఓటు విషయంలో అనాసక్తి చూపుతున్నారని ఓ సంస్థ సర్వేలో వెల్లడవడం ఆందోళన కలిగిస్తోంది.

సాక్షి, హైదరాబాద్‌: ఎన్నికల సంఘం, పలు స్వచ్ఛంద సంస్థలు చేపడుతున్న కార్యక్రమాలతో గ్రామీణ ప్రాంతాల్లో ఓటరు చైతన్యం పెరుగుతోంది. అయితే.. మెట్రో నగరాల్లో మాత్రం ఈ చైతన్యం పూర్తిగా కొరవడుతోంది. మరీ ముఖ్యంగా మెట్రో యువత ఓటువేయడాన్ని తమకు సంబంధం లేని అంశంగా చూస్తున్నారని ‘నెట్స్‌ అవే’ అనే సంస్థ తాజాగా జరిపిన సర్వేలో వెల్లడైంది. నగరాల్లో ఉంటున్న వారు.. తమ ఓటుహక్కు నమోదు, ఓటేయడం,ఓటరు ఐడీకార్డును పొందడం వంటి విషయాల్లో వెనుకంజలో ఉన్నట్లు పేర్కొంది. ఈ సంస్థ తాజాగా ఢిల్లీ, ముంబై, పుణే, బెంగళూరు, హైదరాబాద్‌ నగరాలకు చెందిన యువతీయువకుల అభిప్రాయాలను తెలుసుకునేందుకు ప్రత్యేకంగా ప్రశ్నావళి రూపొందించి..ఆన్‌లైన్‌లో వారి అభిప్రాయాలను సేకరించింది. ఈ ఆన్‌లైన్‌ సర్వే ప్రకారం..పై అంశాల్లో బెంగళూరు యూత్‌ ముందువరుసలో ఉన్నారు. ఓటరు నమోదు, ఓటరు ఐడీకార్డులను పొందడం, ఓటు వేసేవారు ఈ సిటీలో 53 శాతం మేర ఉన్నట్లు వెల్లడైంది. ఇక 52 శాతంతో పుణే, ముంబైలు రెండోస్థానంలో నిలిచాయి.  దేశ రాజధాని ఢిల్లీలో 47శాతం మంది మాత్రమే ఈ అంశాలపై ఆసక్తి చూపుతుండడం గమనార్హం. హైదరాబాద్‌లో కేవలం 45 శాతం మందే ఓటింగ్‌ విషయంలో ఆసక్తిగా ఉన్నట్లు తేలింది.

సర్వేలో తేలిన అంశాలివే!
వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల నిమిత్తం వివిధ మెట్రో నగరాలకు వలసొస్తున్న వారిలో 91 శాతం మంది ఓటర్లుగా నమోదు చేసుకునేందుకు ఆసక్తిచూపడం లేదు.
మెట్రో నగరాల్లో నివసిస్తున్న యూత్‌లో 75శాతం మందికి తమ ఓటును ఎలా నమోదు చేసుకోవాలన్న అంశంపై అవగాహన కొరవడింది.
వివిధ అవసరాల నిమిత్తం మెట్రో నగరాల్లో నివసిస్తున్న యువతలో 60శాతం మంది తాము నివసిస్తున్న సిటీలో ఓటు వేసేందుకు ఆసక్తి చూపడం లేదు.
40 శాతం మంది ఓటర్‌ ఐడీ ఉంటే దేశంలో ఎక్కడైనా ఓటుహక్కు వినియోగించుకోవచ్చని నమ్ముతున్నారు.

2019 పార్లమెంట్‌ ఎన్నికల్లో ఓటేస్తాం..
ఓటుహక్కు నమోదుపై సరైన అవగాహన లేకపోయినా.. ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో జరిగే పార్లమెంట్‌ ఎన్నికల్లో మాత్రం ఓటేస్తామని 75 శాతం యువత  చెప్పడం విశేషం. మరో 20 శాతం మంది ఏదీ చెప్పలేమని పేర్కొన్నారు. ఇక 5 శాతం మంది పార్లమెంట్‌ ఎన్నికల్లో తాము ఓటేయబోమని స్పష్టంచేయడం గమనార్హం.

ఇదీ గ్రేటర్‌ పరిస్థితి
గ్రేటర్‌లో నెటిజన్లుగా మారిన మెజారిటీ హైటెక్‌ సిటీజన్లు..గతంలో జరిగిన పలు ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకునే విషయంలో దూరంగా ఉన్నారనేది సుస్పష్టం. మహానగరం పరిధిలో గతంలో పలు దఫాలుగా జరిగిన ఎన్నికల్లో రాష్ట్రస్థాయి సగటుతో పోలిస్తే పోలింగ్‌ శాతం తక్కువగా నమోదవడం పట్ల ప్రజాస్వామ్యవాదుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. గ్రేటర్‌లో సుమారు 24 నియోజకవర్గాల పరిధిలో 77 లక్షల మందికి పైగా ఓటర్లుగా నమోదయ్యారు. వీరిలో తమ ఓటుహక్కు వినియోగించుకునేవారు మాత్రం 60 శాతం లోపే. ఈ విషయం. గత సార్వత్రిక ఎన్నికలు, బల్దియా, మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో నిరూపితమైంది. పోలింగ్‌ జరిగే రోజును సెలవుదినంగా భావిస్తున్న ఐటీ, బీపీఓ, కేపీఓ, మార్కెటింగ్‌ తదితర రంగాల ఉద్యోగులు, వేతనజీవులు పోలింగ్‌కు దూరంగా ఉంటున్నారు.

గతానుభవాల నుంచి పాఠాలేవీ?
మహానగరం పరిధిలో 2009లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో సుమారు 58శాతం మంది తమ ఓటుహక్కును వినియోగించుకున్నట్లు ఎన్నికల సంఘం లెక్కలు చెబుతున్నాయి. ఇక 2014లో జరిగిన ఎన్నికల్లో అంతకంటే తక్కువగా కేవలం 53 శాతం మందే ఓటు హక్కు వినియోగించుకున్నారు. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్‌ నగరంలోని 15 నియోజకవర్గాల్లో కేవలం 48.89 శాతం మంది మాత్రమే తమ ఓటుహక్కు వినియోగించుకోవడం గమనార్హం.

చైతన్యం పెరగాల్సిందే..
ఓటరు చైతన్యం పెంచడం, ఓటుహక్కును వినియోగించుకునే విషయంలో ప్రధాన రాజకీయ పక్షాలు, స్వచ్ఛంద సంస్థలు, జీహెచ్‌ఎంసీ అధికారులు, ఎన్నికల కమిషన్‌ అధికారులు నగర వ్యాప్తంగా విస్తృత అవగాహన, ప్రచార కార్యక్రమాల నిర్వహణకు  శ్రీకారం చుట్టాల్సి ఉంది. నూతనంగా ఓటర్లుగా నమోదు చేసే విషయంలో వివిధ రాజకీయ పార్టీలు క్రియాశీలంగా వ్యవహరించి వయోజనులను ఓటర్లుగా నమోదు చేసేందుకు శక్తివంచన లేకుండా కృషిచేస్తే పరిస్థితిలో మార్పులొస్తాయని నిపుణులు సూచిస్తున్నారు. 

ఓటర్లలో చైతన్యం నింపేందుకు జీహెచ్‌ఎంసీ ఇటీవల తీసుకున్న చర్యలివీ..
వాదా యాప్‌: అంధులు, వృద్ధులు, గర్భిణీలు రద్దీగా ఉండే పోలింగ్‌ కేంద్రాలకు వెళ్లి ఓటు హక్కును తమకు వీలైన సమయంలో వినియోగించుకునేందుకు వారికి అనువైన స్లాట్‌ను ఈ యాప్‌ ద్వారా బుక్‌ చేసుకోవచ్చు. వీరికి ప్రత్యేకంగా వాహనాలు ఏర్పాటుచేయడంతోపాటు స్వేచ్ఛగా ఓటు వేసేందుకు వీలుగా వారికి పోలింగ్‌ సిబ్బంది సహకరిస్తారు.
నమూనా పోలింగ్‌కేంద్రాలు: జీహెచ్‌ఎంసీ పరిధిలోని 150 డివిజన్ల పరిధిలో నమూనా పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసి..నూతనంగా ఓటర్లుగా నమోదైన వారు తమ ఓటుహక్కును ఎలా వినియోగించుకోవాలి..వీవీప్యాట్‌ యంత్రాల పనితీరుపై అవగాహన కల్పించారు.

సి–విజిల్‌(సిటిజన్‌ విజిల్‌): ఎన్నికల అక్రమాలు, వివిధ పార్టీల అభ్యర్థులు, క్యాడర్‌ చేసే అక్రమాలను ఎన్నికల సంఘం, బల్దియా దృష్టికి తీసుకొచ్చేందుకు ఈ యాప్‌ను ప్రారంభించారు. ఫోటోలు, వీడియోలను ఈ యాప్‌లో అప్‌లోడ్‌ చేస్తే చాలు అక్రమార్కులపై చర్యలు తథ్యం.
సువిధ: ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు నామినేషన్ల దాఖలు, ఎన్నికల ప్రవర్తనా నియమావళి తదితర  అవసరమైన సమాచారాన్ని ఈ యాప్‌ ద్వారా తెలుసుకోవచ్చు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement