
ప్రతి నెలా వివరాలు వెల్లడించాలి
ముంబై: మ్యూచువల్ ఫండ్ సంస్థలు ఇకపై తమ నిర్వహణలో ఉన్న ఆస్తుల (ఏయూఎం) గురించి ప్రతి నెలా మరిన్ని వివరాలు వెల్లడించాల్సి రానుంది. అలాగే, తాము ఇన్వెస్ట్ చేసిన కంపెనీల్లో వోటింగ్ హక్కులను వినియోగించుకున్న తీరు వెనుక హేతుబద్ధతను కూడా ఇన్వెస్టర్లకు వివరించాల్సి ఉంటుంది. మరోవైపు, ఇన్వెస్టర్లకు మరింత చేరువయ్యే దిశగా ఆన్‌లైన్, మొబైల్ మాధ్యమాలతో పాటు ఇతర మార్గాల్లోనూ ఫండ్స్ విక్రయాలను పెంచుకోవాల్సి ఉంటుంది.
దాదాపు రూ. 9 లక్షల కోట్ల మ్యూచువల్ ఫండ్ పరిశ్రమకు సంబంధించి మొట్టమొదటిసారి రూపొందించిన దీర్ఘకాలిక నిబంధనలపై స్టాక్‌మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ సోమవారం సర్క్యులర్ జారీ చేసింది. ఈ విధానాలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. వీటి ప్రకారం వివిధ స్కీములు, రిటైల్..కార్పొరేట్ వంటి ఇన్వెస్టర్ల పెట్టుబడులు, రాష్ట్రాల వారీ పెట్టుబడులు తదితర వివరాలన్నీ ఫండ్ సంస్థలు ప్రతి నెలా వెల్లడించాలి. వీటన్నింటినీ కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఆఫ్ ఇండియా వెబ్‌సైట్‌లో వారం పనిదినాల్లోగా ఉంచాలి.
మరోవైపు, వివిధ సంస్థల్లో వోటింగ్ హక్కులను ఏ విధంగా (అనుకూలంగా, వ్యతిరేకంగా మొదలైనవి) వినియోగించుకున్నదీ, దాని వెనుక హేతుబద్ధత ఏమిటి అన్నది కూడా ఫండ్ సంస్థలు వార్షిక నివేదికల్లో, వెబ్‌సైట్లలో వెల్లడించాలి. ఇక, అదనపు పంపిణీ మార్గాలను పెంచుకునే దిశగా.. ప్రభుత్వ రంగ బ్యాంకుల మద్దతు తీసుకోవాలని ఫండ్ సంస్థలకు సెబీ సూచించింది. అలాగే ఇంటర్నెట్, మొబైల్ యూజర్ల కోసం ఆన్‌లైన్ ఇన్వెస్ట్‌మెంట్ విధానాలను మెరుగుపర్చాలని పేర్కొంది. ప్రాంతీయ భాషల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించింది.