
మాట్లాడుతున్న కలెక్టర్ నారాయణరెడ్డి
సాక్షి, ములుగు: ఓటు హక్కు అంటే వంద రూపాయాల నోటు, లిక్కర్ బాటిల్ కాదని కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. డీఆర్‌డీఏ తరఫున మండలంలోని జాకారం సాంఘిక సంక్షేమ శాఖ గురుకులం విద్యార్థులతో ఆదివారం ఏర్పాటు చేసిన ఓటు హక్కు వినియోగ అవగాహన కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకోవడం ద్వారా సరైన నాయకుడిని ఎంచుకునే అవాకాశం ఉంటుందని అన్నారు.
కొంతమంది ఓటు వేసే రోజును ప్రభుత్వ సెలవుదినంగా అనుకుంటున్నారని, ఆ ఆలోచనను మరిచి ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని అన్నారు. ఓటు వినియోగంలో ఎలాంటి ప్రలోభాలకు గురికావద్దని సూచించారు. ప్రలోభాల విషయంలో పౌరులు నేరుగా 1950 టోల్ ప్రీ నంబర్‌కి కానీ, ప్రత్యక్ష సమాచారాన్ని అందించడానికి నేరుగా సీ విజిల్ యాప్ ద్వారా కాని ఫిర్యాదు చేయవచ్చని అన్నారు.
సీ విజిల్ ద్వారా వచ్చే ఫిర్యాదులను జిల్లా యంత్రాంగం తరఫున గంటన్నర సమయంలో పరిష్కరిస్తామని, బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఓటర్లు స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటును వినియోగించే విధంగా తగిన సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. అంతకు ముందు తెలంగాణ సాంస్కృతిక కళాకారులు, జాకారం సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థులు చేపట్టిన ఆటపాటలు అలరించాయి. కార్యక్రమంలో డీఆర్‌డీఏ పీడీ సంజీవరావు, డీపీఎం సతీష్, సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహ్మద్, డీఎంహెచ్‌ఓ డాక్టర్ అల్లెం అప్పయ్య, సీఐ సార్ల రాజు, తహసీల్దార్ భూక్యా గన్యానాయక్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment