కలెక్టరేట్, న్యూస్‌లైన్: ఈ ఏడాదికి కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారందికీ ఓటుహక్కు కల్పించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ జిల్లా అధికారులను ఆదేశించారు. అలాగే బూత్‌స్థాయి అధికారుల డేటాను తప్పనిసరిగా నమోదు చేయాల ని ఆదేశించారు.మంగళవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడారు. ఏటా కొత్త వారికి అవకాశం కల్పిం చడం కంటే తొలగించే వారి జాబితానే ఎక్కువగా ఉంటుందని, ఈసారి అలా కాకుండా దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికీ అవకాశం కల్పించాలని సూచించారు.
ఇదివరకు ఉన్న పోలింగ్ కేంద్రాలతో పాటు, కొత్తగా ఏర్పాటుచేసిన వాటన్నింటిని తనిఖీచేసి పరిశీలించాలన్నారు. అవి ఎన్నికల సమయంలో అనుకూలంగా ఉన్నాయో, లేదో పరిశీలించిన తరువాతనే పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరారు. అదేవిధంగా డిసెంబర్ నాటికి అన్ని జిల్లాల్లో ఈవీఎం గోదాంల నిర్మాణాలు పూర్తవుతాయని తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఎం.గిరిజాశంకర్ మాట్లాడుతూ..బూత్‌స్థాయి అధికారుల డాటా నమోదుకు సంబంధించి రిజిస్టర్ల నిర్వాహణ చేపట్టాలని ఈసీఓకు వివరించారు. ఈ కార్యక్రమాన్ని వందశాతం పూర్తిచేసి కొత్త ఓటర్లకు నమోదుకు ఫారం 6ను 70శాతం పూర్తి చేసినట్లు తెలిపారు. ఇక ఫారం 7, 8, 8ఏ ప్రక్రియకు సంబంధించి ఐదు శాతం పనులు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయన్నారు. దీంతో పాటు పోలింగ్ కేంద్రాలన్నింటిని వ్యక్తిగతంగా పరిశీలించడం పూర్తయ్యిందని, ఇక పోలింగ్ కేంద్రాల జాబితాను ఈనెల 12న ప్రచురించినట్లు కలెక్టర్ వివరించారు. వీటితోపాటు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను కొత్త గోదాంలో ఉంచామన్నారు. దీంతోపాటు ఆర్‌ఓ, ఏఆర్‌ఓల నియామాకానికి ఇటీవల ప్రతిపాదనలు పంపామని, అదే విధంగా పోలింగ్ సిబ్బంది, వెబ్‌కాస్టింగ్‌కు విద్యార్థుల జాబితాను సేకరించనున్నట్లు తెలిపారు.
ఈనెల 20న అఖిలపక్షం సమావేశం..
అనంతరం ఆర్డీఓలు, తహశీల్దార్లతో కలెక్టర్ సమావేశం నిర్వహించి ఈనెల 20న అఖిలపక్షం సమావేశం నిర్వహించాలని సూచించారు. ఇక తహశీల్దార్లు అన్ని పోలింగ్ కేంద్రాలను వ్యక్తిగతంగా తనిఖీచేసి ఫోటోలతో సహా నివేదిక పంపాలని ఆదేశించారు. అదేవిధంగా కొత్త ఓటర్లకు వచ్చిన దరఖాస్తులను 20లోగా పూర్తి చేయాలని ఆదేశించారు.
ఇక బోగస్ ఓటర్లు ఎవరైనా ఉంటే ఇంటింటి సర్వే నిర్వహించి వాటిని తొలగించాలని సూచించారు. దీంతోపాటు ఆధార్ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. ఇదివరకు జిల్లాలో కేవలం 45 శాతం ప్రక్రియ మాత్రమే పూర్తయిందని, మిగిలిన శాతాన్ని వేగవంతంగా పూర్తిచేసేందుకు కృషిచేయాలని సూచించారు. కార్యక్రమంలో డీఆర్వో రాంకిషన్, ఏఓ కిషన్‌రావు, ఆర్డీఓలు నారాయణరెడ్డి, యాస్మిన్ బాష, వెంకటేశ్వర్లు, కిమ్యానాయక్, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కొత్తవారికి అవకాశం కల్పించండి
Published Wed, Aug 14 2013 5:34 AM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM
Advertisement
Advertisement