స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీకి జరగనున్న ఉప ఎన్నిక
నేటి నుంచి 11 వరకు నామినేషన్లు, 28న పోలింగ్
కసిరెడ్డి నారాయణరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన పదవి
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా స్థానిక సంస్థల కోటాలోని ఓ ఎమ్మెల్సీ స్థానం ఉప ఎన్నికకు సంబంధించి ఆదివారం నోటిఫికేషన్ వెలువడనుంది. ఆదివారం నుంచి ఈ నెల 11వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనుండగా, ఈ నెల 28న పోలింగ్ జరగనుంది. 2022 జనవరిలో ఈ స్థానం నుంచి బీఆర్‌ఎస్ తరఫున ఎమ్మెల్సీగా ఎన్నికైన కసిరెడ్డి నారాయణరెడ్డి ఆరేళ్ల పదవీ కాలం 2028 జనవరిలో ముగియాల్సి ఉంది. అయితే గత ఏడాది చివర్లో కాంగ్రెస్ పార్టీలో చేరిన కసిరెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో కల్వకుర్తి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. దీంతో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో సుమారు నాలుగేళ్ల కాలానికి ఉప ఎన్నిక జరగనుంది. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో స్థానిక సంస్థల కోటాలో రెండు ఎమ్మెల్సీ పదవులు ఉండగా, మరో స్థానానికి కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్నారు.
బీఆర్‌ఎస్‌దే ఆధిపత్యం
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని జిల్లా, మండల పరిషత్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు శాసన మండలి స్థానిక సంస్థల కోటా ఎన్నికలో ఓటర్లుగా పరిగణించబడతారు. జిల్లాలో మొత్తం 1,450 మంది స్థానిక సంస్థల ప్రతినిధులు ఉండగా, వీరిలో మెజారిటీ ఓటర్లు బీఆర్‌ఎస్‌కు చెందిన వారే ఉన్నారు. దీంతో తమకు అవకాశం ఇవ్వాలంటూ పలువురు కొత్త ఆశావహులతో పాటు తాజా మాజీ ఎమ్మెల్యేలు కొందరు పార్టీ అధినేత కేసీఆర్‌ను కోరుతున్నారు. మరోవైపు సీఎం రేవంత్‌రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న జిల్లాలో జరుగుతున్న ఎన్నికను అధికార కాంగ్రెస్ సీరియస్‌గా తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో రెండు పార్టీల నుంచి ఎవరు బరిలోకి దిగుతారనే ఆసక్తి నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment