అసత్య ప్రచారాలు చేస్తే కేసులే | Rajat Kumar Comments on False campaigns | Sakshi
Sakshi News home page

అసత్య ప్రచారాలు చేస్తే కేసులే

Published Wed, Apr 17 2019 1:54 AM | Last Updated on Wed, Apr 17 2019 1:54 AM

Rajat Kumar Comments on False campaigns - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఇటీవల ముగిసిన లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల యంత్రాంగం పూర్తిగా నిబంధనల మేరకే నడుచుకుందని, దురుద్దేశాలతో, అవగాహన లేమితో కొందరు పనిగట్టుకుని అవాస్తవాలు వ్యాప్తి చేస్తున్నారని, పత్రికలు, టీవీలు కూడా నిజానిజాలు తెలుసుకోకుండా వాటిని ప్రచురించడంతో ప్రజలు మరింత గందరగోళానికి గురవుతున్నారని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి రజత్‌కుమార్‌ ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం సచివాలయంలో మాట్లాడుతూ.. ఈవీఎంల తరలింపు, పోలింగ్‌ శాతంపై తప్పుడు ప్రచారం చేసే వారిపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిజామాబాద్‌లో పోలింగ్‌ శాతం మొదట ప్రకటించిన దానికి, తుది ప్రకటనకు మధ్య వ్యత్యాసంపై కొందరు లేనిపోనివి మాట్లాడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

పోలింగ్‌ ముగిసిన వెంటనే అంచనా శాతం ప్రకటిస్తామని, తర్వాత అన్ని పోలింగ్‌ కేంద్రాల నుంచి సమాచారం అందాక 17–ఏ ఫారం (ఓటర్లు ఓటు వేసేముందు సంతకం చేసే రిజిస్టర్‌)తో పోల్చి చూసుకుని, పోలింగ్‌ శాతం తుది వివరాలతో 17 సీ ఫారం నింపి ఒక కాపీని పోలింగ్‌ కేంద్రంలో ఉన్న రాజకీయ పార్టీల, అభ్యర్థుల ఏజెంట్లకు అందజేస్తామని, ఈ వివరాలనే మీడియాకు కూడా ఇచ్చామని వివరించారు. ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం కలిగేలా కొందరు సామాజిక మాధ్యమాల్లో ఈసీపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. నిజామాబాద్‌ సరిహద్దుల్లో ఒక ప్రముఖ నేత ఇంట్లో దొరికిన ఈవీఎంలంటూ సోషల్‌ మీడియాలో వైరల్‌ చేస్తున్నారని, అది రాజస్తాన్‌కు చెందిన పదేళ్ల కిందటి వీడియో అని స్పష్టం చేశారు. నిజామాబాద్‌లో సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ నడిచిందని, చాలా పోలింగ్‌ కేంద్రాల్లో 6 గంటల వరకు పోలింగ్‌ జరిగిందన్నారు.

జీపీఎస్‌తో ఈవీఎంల తరలింపు
పోలింగ్‌ పూర్తయిన సాయంత్రం 5 గంటలకు అంచనా వివరాలు ఇస్తామని.. తర్వాతి రోజు మాత్రమే పోలింగ్‌ శాతాలపై స్పష్టమైన సమాచారం ఇవ్వగలమని పేర్కొన్నారు. నిజామాబాద్‌ మినహా ఈవీఎంలు స్ట్రాంగ్‌ రూమ్‌లకు చేరే వరకు అర్ధరాత్రి 12.04 గంటలు అయిందన్నారు. మొత్తం స్ట్రాంగ్‌ రూమ్‌లు సీల్‌ చేసే వరకు ఉదయం 5.30 గంటలు అయిందన్నారు. తాము ఎంతో కష్టపడి ఎన్నికలు నిర్వహిస్తే ఒక్క మాటతో చెడ్డ పేరు తెస్తున్నారని మండిపడ్డారు. ఈవీఎంల తరలింపునకు జీపీఎస్‌ ట్రాకింగ్‌ కూడా ఉందన్నారు. స్ట్రాంగ్‌ రూమ్‌ల వద్ద మూడు అంచెల భద్రత ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మొదటి అంచె భద్రతలో రాజకీయ పార్టీల ప్రతినిధులు కూడా ఉండొచ్చన్నారు. పోలింగ్‌ ముగిసే ముందు ఫారం 17సీ కాపీలు పోలింగ్‌ ఏజెంట్లకు అందిస్తామని.. దానిపై వాళ్ల సంతకాలు సైతం ఉంటాయన్నారు. ఫారం 17 ఏ, ఫారం 17సీని సరిచూసుకున్న తర్వాత కూడా పోలింగ్‌ శాతంపై అనవసర రాద్ధాంతం చేయడం తగదన్నారు. రిసెప్షన్‌ సెంటర్‌కు వచ్చిన తర్వాత కూడా 17 సీ ఫారం పరిశీలిస్తామన్నారు.

పోలింగ్‌ ఏజెంట్లు సంతకాలు చేసిన తర్వాత కూడా ఎందుకు అనుమానిస్తున్నారు అని ఆయన ప్రశ్నించారు. స్ట్రాంగ్‌రూం నుంచి వీవీప్యాట్‌లు బయటకు తీసుకువచ్చే ముందు ఆ కాపీలను సరిచూస్తామన్నారు. ఈవీఎంలు, వీవీప్యాట్‌లపై ఆరోపణలు చేసేటప్పుడు ఫారం–17సీ ఎందుకు సరిచూడరన్నారు. ప్రతిఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని, అవాస్తవాలు ప్రచారం చేయొద్దని విజ్ఞప్తి చేశారు. సోషల్‌ మీడియాలో వచ్చిన కీసర స్ట్రాంగ్‌ రూమ్‌లో ఒక పార్టీ నేత ఫొటోపై కలెక్టర్‌ను వివరణ కోరామన్నారు. అతడిని అరెస్ట్‌ కూడా చేశామన్నారు. ఫొటోలు తీసుకున్న వ్యక్తిపై న్యాయవిచారణ జరుగుతోందన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం పూర్తి పారదర్శకంగా పనిచేస్తున్నట్టు స్పష్టంచేశారు. పోలింగ్‌ శాతాలతో పాటు పలుచోట్ల ఈవీఎంల తరలింపు తదితర అంశాలపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కాగా, హైదరాబాద్‌ పార్లమెంటు స్థానానికి తొలుత విడుదల చేసిన పోలింగ్‌ శాతానికి, ఆ తర్వాత వచ్చిన శాతానికి 10 శాతం పెరగడంపై మీడియా ప్రశ్నించగా, సాయంత్రం చల్లగా ఉంటుందని ఎక్కువ సంఖ్యలో ఓటు వేశారని అనుకోవచ్చు కదా అని రజత్‌ కుమార్‌ సమాధానమిచ్చారు.

అవి శిక్షణ ఈవీఎంలు..
జగిత్యాలలో ఆటోలో రవాణా చేసిన ఈవీఎంలను పోలింగ్‌ కోసం వాడలేదని.. కేటగిరీ–సీ కిందకు చెందిన వాటిని అధికారుల శిక్షణ, అవగాహన కోసం వాడినట్లు స్పష్టంచేశారు. మండల కేంద్రం నుంచి వాటిని జిల్లా కేంద్రానికి తరలిస్తున్నట్లు చెప్పారు. ఈవీఎంలు నాలుగు రకాలుంటాయన్నారు. మొదటి రకం పూర్తిగా ఓటింగ్‌కు వినియోగించేవని, ఓటింగ్‌ కొంతమేర జరిగిన తర్వాత సమస్యలొస్తే కొత్త ఈవీఎం వాడుతామని.. ఈ రెండింటికి మాత్రం అత్యంత ప్రాధాన్యం ఇచ్చి పటిష్టమైన భద్రతలో ఉంచుతామని వివరించారు. మాక్‌ పోలింగ్‌ నిర్వహించే సందర్భంలో లోపాలున్న వాటిని తొలగించి వేరు చేస్తామనీ, ఇవి మూడో రకం ఈవీఎంలని అన్నారు. వీటిని తయారీదారుకు తిప్పి పంపుతామన్నారు. ముందు జాగ్రత్తగా అదనంగా కొన్ని ఈవీఎంలను తెప్పించి రిజర్వులో ఉంచుతామనీ వీటిని నాలుగో రకం అంటామన్నారు. ఇవి మన రాష్ట్రంలో కానీ, అవసరమైన ఇతర రాష్ట్రాలకు తరలించడానికి సిద్ధంగా ఉంచుతామని చెప్పారు.

అందువల్ల చివరి రెండు రకాల ఈవీఎంలను తరలిస్తున్న సందర్భాలను చూసి వాస్తవాలను తనిఖీ చేసుకోకుండా ఓట్లతో ఉన్న ఈవీఎంలను తరలిస్తున్నట్లు ప్రచారం కల్పిస్తే అహోరాత్రులు శ్రమిస్తున్న అధికార యంత్రాగం విశ్వసనీయత కోల్పోయే ప్రమాదముందని, సంబంధిత సమాచారంపై ఎప్పుడు వివరణ కావాలన్నా సీనియర్‌ అధికారులందరూ మీడియాకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటారనీ, వాస్తవాలను నిర్ధారించుకోవచ్చని సూచించారు. శిక్షణకు, ఓటర్ల అవగాహనకు ఉపయోగించేవాటిని, రిజర్వులో ఉంచిన వాటిని కూడా కేంద్ర గోదాముల్లో సాయుధ కాపలాతోనే ఉంచుతామని స్పష్టం చేశారు. బ్యాలెట్‌ పేపర్లతో ఫలితాలు త్వరగా వస్తాయనేది అవాస్తవమన్నారు. ఓటింగ్‌ శాతంపై అనుమానం వద్దన్నారు. ఎన్నికలు జరిగాక వీడియో రికార్డులను పరిశీలకులు అన్ని పరిశీలించి నిర్ణయం తీసుకుంటారన్నారు. తప్పుడు వార్తలు ప్రసారం చేస్తే కఠినంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటికే ప్రసారం చేసిన చానెల్‌ పై కేసులు బుక్‌ చేస్తామన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement