
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ రద్దయిన నేపథ్యంలో ముందస్తు ఎన్నికల నిర్వహణకు చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమానికి మంచి స్పందన లభిస్తోందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ తెలిపారు. ఓటరు నమోదు కోసం ఇప్పటివరకు సుమారు 17 లక్షల నుంచి 18 లక్షల మంది ఫారం–6 దరఖాస్తులు సమర్పించారని వెల్లడించారు. కొత్త ఓటర్ల నమోదు కార్యక్రమం సంతృప్తికరంగా సాగుతోందని, పెద్ద ఎత్తున యువత దరఖాస్తు చేసుకుంటోందన్నారు. ఎన్నికల ప్రకటన విడుదలై అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరించడానికి 10 రోజుల ముందు వరకు కొత్త ఓటర్ల నమోదుకు దరఖాస్తు చేసుకోవచ్చని, ఎన్నికల్లో ఓటు హక్కు కల్పిస్తామని చెప్పారు.
ముందస్తు ఎన్నికల ఏర్పాట్లపై గురువారం సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇప్పటికే ప్రకటించిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం షెడ్యూల్ ప్రకారం ముసాయిదా ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు, ఫిర్యాదుల స్వీకరణ ఈ నెల 25వ తేదీతో ముగుస్తుందని తెలిపారు. ఓటర్ల జాబితాలో బోగస్ ఓట్లున్నాయని ఆరోపిస్తున్న విపక్ష పార్టీలు ఈ అవకాశాన్ని వినియోగించుకుని క్షేత్ర స్థాయిలో పూర్తి వివరాలతో బూత్ స్థాయి అధికారుల(బీఎల్‌వో)కు అభ్యంతరాలు అందించాలని సూచించారు. వారు క్షేత్ర స్థాయిలో విచారణ జరిపి బోగస్ ఓట్లను తొలగిస్తారన్నారు.
ఈఆర్వో నెట్ సాయంతో..
కేంద్ర ఎన్నికల సంఘం రూపొందించిన ‘ఈఆర్వో నెట్’సాఫ్ట్‌వేర్ సాయంతో ఓటర్ల జాబితాను విశ్లేషించి రాష్ట్రంలో 4.92 లక్షల డూప్లికేట్ ఓటర్లున్నట్లు ప్రాథమికంగా గుర్తించామని రజత్ తెలిపారు. దేశం లోని ఓటర్లందరి వివరాలు ఈ సాఫ్ట్‌వేర్‌లో ఉంటాయని, భౌగోళికంగా ఒకే ప్రాంతంలో ఒకే విధమైన పేర్లు, వయసు, చిరునామా ఉన్న ఓటర్లను సాఫ్ట్‌వేర్ గుర్తిస్తుందన్నారు.
4.92 లక్షల అనుమానాస్పద ఓటర్లందరికీ 7 రోజుల్లో వివరణ ఇవ్వాలని నోటిసులు జారీ చేస్తున్నామని, వివరణలు అందాక పరిశీలించి తొలగింపులపై నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈ ఓట్లలో దాదాపు 50 నుంచి 60 శాతం వరకు డూప్లికేట్ ఓటర్లుండే అవకాశముందన్నారు. సుమారు 1.20 లక్షల చనిపోయిన ఓటర్లను గుర్తించామని, వీటి తొలగింపు కోసం సంబంధికులకు నోటిసులు జారీ చేశామని చెప్పారు.
ప్రతి బూత్‌లోనూ ఈవీఎంల పరీక్షలు
రాష్ట్రంలో 19,044 పోలింగ్ కేంద్రాలున్నాయని.. 32,574 మంది బీఎల్‌వోలను నియమించామని, ఎక్కడా ఖాళీలు లేవని రజత్ కుమార్ తెలిపారు. 23 జిల్లాలకు ఇప్పటికే ఈవీఎంలు పూర్తి స్థాయిలో చేరాయని, మిగిలిన జిల్లాలకు మరో రెండ్రోజుల్లో చేరుతాయని తెలిపారు. 52,100కు గాను 30,470 బ్యాలెటింగ్ యూనిట్లు.. 44,000లకు గాను 18630 వీవీపాట్‌లు, 40,700 కంట్రోల్ యూనిట్లకు గాను 30,840 ఇప్పటికే చేరాయన్నారు.
బూత్ స్థాయిలో ఈవీఎంలను పరీక్షించేందుకు 170 మంది ఇంజనీర్లను నియమించామని చెప్పారు. రాజకీయ పార్టీల సమక్షంలో ఈవీఎంల పనితీరుపై ప్రథమ స్థాయి పరీక్షలు నిర్వహించనున్నామని.. ప్రతి బూత్‌లో పార్టీలు, ప్రజల సమక్షంలో ఈవీఎంలకు పరీక్షలు జరుపుతామని, ఎవరైనా మాక్ పోలింగ్‌లో పాల్గొని అనుమానాలు నివృత్తి చేసుకోవచ్చని వివరించారు.
ఎన్నికల నిర్వహణపై శిక్షణ కోసం 120 మంది మాస్టర్ ట్రైనర్లను ఢిల్లీ పంపామని, వారు తిరిగొచ్చి ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు శిక్షణ ఇస్తారని చెప్పారు. ఒకేరకమైన ఎన్నికల చిహ్నం కేటాయించాలని కొన్ని పార్టీలు ఇప్పటికే కార్యాలయాన్ని సంప్రదించాయని, సినీ నటుడు పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ ఇంతవరకు ఇలాంటి అభ్యర్థన చేయలేదని ఓ ప్రశ్నకు బదులిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment