సాక్షి, హైదరాబాద్: నగదు రవాణాపై ఎలాంటి పరిమితులు లేవని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి (సీఈఓ) రజత్ కుమార్ పేర్కొన్నారు. రవాణా చేసే వారి దగ్గర సరైన పత్రాలు, లెక్కలుంటే సరిపోతుం దని ఆయన స్పష్టం చేశారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు దాదాపు రూ.55 కోట్లు సీజ్ చేసినట్లు చెప్పారు. ఇందులో రూ.17.55 కోట్లు ఐటీ, 36.67 కోట్లు పోలీసులు సీజ్ చేశారన్నారు. 2014 ఎన్నికల సీజ న్‌లో రూ.76 కోట్లు సీజ్ చేసినట్లు గుర్తు చేశారు. శుక్రవారం సచివాలయంలోని మీడియా పాయింట్ వద్ద సీఈఓ రజత్ కుమార్ మీడియా సమావేశంలో మాట్లాడారు.
ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనకు సంబంధించి ఇప్పటివరకు 82 కేసులు నమోదు చేశామని, వీటిలో 33 కేసులు హైదరాబాద్‌లో నమోదైనట్లు వివరించారు. మొత్తం కేసుల్లో 51 కేసులకు సంబంధించి పూర్తి స్థాయి సమాచారం రావాల్సి ఉందన్నారు. ఫోన్ ట్యాపింగ్‌పై వస్తున్న ఫిర్యాదులపై డీజీపీతో చర్చించానని, ఎవరి ఫోన్లనూ ట్యాప్ చేయలేదని ఆయన స్పష్టం చేశారన్నారు. ఏపీ ఇంటెలిజెన్స్ పోలీసులు ఇక్కడ డబ్బులు పంపిణీ చేస్తున్నారనే ఫిర్యాదుపై స్పందించి వివరాలు తెలుసుకున్నామని, ఎక్కడా డబ్బు సీజ్ చేయలేదని ఇరు రాష్ట్రాల డీజీపీలు వివరణ ఇచ్చినట్లు తెలిపారు.
జనగామలో డబ్బులు పంచే విషయంలో కేసు నమోదు చేసినట్లు చెప్పారు. అంతర జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాల విషయంలో సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించామని, పాత జిల్లాలను పరిగణనలోకి తీసుకుంటే ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కావడం లేదన్నారు. ఆ మేరకు సిబ్బందికి విధులు కేటా యిస్తున్నట్లు చెప్పారు. అసెంబ్లీ నియోజకవర్గాలపై పూర్తిగా జిల్లా ఎన్నికల అధికారే బాధ్యత వహిస్తారని తెలిపారు. పోలీస్ కేటగిరీలో ఇబ్బందులు వస్తున్నాయని, దీంతో డీఎస్పీ స్థాయి అధికారిని నియోజకవర్గానికి బాధ్యతలు అప్పగిస్తే సరిపోతుందన్నారు.
హోంగార్డుల కోసం పొరుగు రాష్ట్రాల సాయం
రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణకు పోలీస్ సిబ్బంది కొరత వస్తోందని, ఈ నేపథ్యంలో 5 వేల హోంగార్డులు కావాలని తమిళనాడు, మహారాష్ట్ర, ఒడిశా, కర్ణాటక, కేరళ రాష్ట్రాల నుంచి పంపించాలని అడిగామని, త్వరలో దీనిపై ఈసీఐ నిర్ణయం తీసుకుం టుందని రజత్ కుమార్ తెలిపారు.
బ్యాంకర్లు, ఏటీఎం నిర్వాహకులు నగదు రవాణాకు సంబంధించి పూర్తి స్థాయి సమాచారాన్ని వెంట తెచ్చుకోవాలని సూచించారు. రాజకీయ పార్టీలు ఎన్నికల మేనిఫెస్టో లు విడుదల చేసే మూడు రోజుల ముందే తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో మూడు కాపీలను రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారికి సమర్పించాల్సి ఉంటుందన్నారు.
రాజకీయ పార్టీల కార్యక్రమాల్లో పాల్గొనవద్దు
రాజకీయ పార్టీలు నిర్వహించే కార్యక్రమాల్లో ప్రభు త్వ అధికారులు, ఉద్యోగులు పాల్గొనవద్దని, అలా పాల్గొన్నట్లు ఫిర్యాదులు వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీఈఓ తెలిపారు. ఐఏఎస్ అధికారి మురళి విషయం మా దృష్టికి వస్తే ఆయన వివరణ ఆధారంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ఎన్నికలు పూర్తయ్యే వరకు మద్యనిషేధం అమలు చేయాలని పలు రాజకీయ పార్టీలు కోరుతున్నాయని, కానీ అది మా పరిధి కాదన్నారు. మద్యం విక్రయాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలకు 20 శాతం ఆదాయం వస్తుందన్నారు. ఇప్పటివరకు దాదాపు రూ.3.31 కోట్ల విలువైన 1.45 లక్షల లీటర్ల మద్యం సీజ్ చేశామని తెలిపారు.
వ్యయం పెంచినా పరిమితులు..
ఎన్నికల వ్యయాన్ని కూడా పెంచినప్పటికీ పరిమితులు పెట్టామని రజత్ కుమార్ తెలిపారు. ఇప్పటివరకు సీజ్ చేసిన డబ్బంతా ఎన్నికల కోసం బయటకు వచ్చిందేమీ కాదన్నారు. సరైన ఆధారాలు చూపించి తీసుకెళ్లేవాళ్లు కూడా ఉన్నారని తెలిపారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం రేవంత్‌రెడ్డికి భద్రత కల్పించాలని డీజీపీకి సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment