ఎక్కడా రీ పోలింగ్‌ లేదు  | There is no re-polling says Rajat Kumar | Sakshi
Sakshi News home page

ఎక్కడా రీ పోలింగ్‌ లేదు 

Published Sun, Dec 9 2018 2:57 AM | Last Updated on Sun, Dec 9 2018 5:42 AM

There is no re-polling says Rajat Kumar - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో భాగంగా అన్ని నియోజకవర్గాల పరిధిలో పోలింగ్‌ ప్రక్రియ విజయవంతంగా ముగిసిందని, ఎక్కడా రీ పోలింగ్‌ నిర్వహించడానికి సిఫారసు చేయడం లేదని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) రజత్‌ కుమార్‌ స్పష్టం చేశారు. రాష్ట్ర శాసనసభకు శుక్రవారం జరిగిన ఎన్నికల్లో 73.20 శాతం పోలింగ్‌ నమోదైందని, 2014 శాసనసభ ఎన్నికల (69.5 శాతం)తో పోలిస్తే ఈసారి పోలింగ్‌ పెరిగిందని రజత్‌ కుమార్‌ ఆనందం వ్యక్తం చేశారు. ఓటర్ల స్పందన ఆరోగ్యకరంగా ఉందని, పోలింగ్‌ శాతం పెంచినందుకు అందరికీ ఫుల్‌ థ్యాంక్స్‌ అని పేర్కొన్నారు. కార్వాన్‌ నియోజకవర్గంలో పోలింగ్‌ ప్రక్రియకు సంబంధించి పోలింగ్‌ కేంద్రాల ప్రిసైడింగ్‌ అధికారులు స్థానిక రిటర్నింగ్‌ అధికారికి సమర్పించిన పత్రాల్లో కొన్ని తొలుత కనిపించలేదని, కాసేపు వెతికాక లభించాయన్నారు. ఆ పత్రాలెక్కడా పోలేదని, వేరే పత్రాల్లో కలసిపోయినట్లు గుర్తించామన్నారు. ఈ నేపథ్యంలో కార్వాన్‌లో రీ పోలింగ్‌ నిర్వహించాల్సిన అవసరం లేదని నిర్ణయించామన్నారు. ఇందుకు కేంద్ర ఎన్నికల సంఘం సైతం సమ్మతి తెలిపిందన్నారు. రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు సంబంధించిన నియోజకవర్గాలవారీ పోలింగ్‌ శాతాన్ని శనివారం రాత్రి హైదరాబాద్‌లో ఆయన విలేకరులకు విడుదల చేసి మాట్లాడారు. కార్వాన్‌లో రీ పోలింగ్‌ నిర్వహించాలని రాజకీయ పార్టీల నుంచి వచ్చిన డిమాండ్లను ఆయన తోసిపుచ్చారు. కాగా, ఎక్కడా రీ–పోలింగ్‌ నిర్వహించకుండా ఎన్నికలు జరగడం ఇదే తొలిసారి అని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. 

పోలింగ్‌ ప్రకటనపై ఆలస్యం ఎందుకంటే.. 
పోలింగ్‌ ప్రక్రియకు సంబంధించిన తుది నివేదిక తనకు అందేసరికి శనివారం తెల్లవారుజామున 3.40 గంటలు అయిందని రజత్‌ కుమార్‌ తెలిపారు. పోలింగ్‌ ప్రక్రియ ముగిసే సరికి శుక్రవారం సాయంత్రం 6 గంటలైందని, ఆ తర్వాత ప్రిసైడింగ్‌ అధికారులు కట్టుదిట్టమైన భద్రత నడుమ ఈవీఎంలతోపాటు పోలింగ్‌ ప్రక్రియకు సంబంధించిన రెండు నివేదికలను సంబంధిత నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారికి అప్పగించే సరికి రాత్రి 7.30 గంటలైందన్నారు. రిటర్నింగ్‌ అధికారులు ఒక్కో ప్రిసైడింగ్‌ అధికారి నుంచి నివేదికలు స్వీకరించి పరిశీలించి, అవి సరిగ్గా ఉన్నాయని నిర్ధారించుకునేందుకు ఎక్కువ సమయం పట్టిందన్నారు. ఒక్కో నియోజకవర్గంలో కనీసం 300 పోలింగ్‌ కేంద్రాలున్నాయని, మేడ్చెల్‌లో అత్యధికంగా 514 పోలింగ్‌ కేంద్రాలున్నాయన్నారు. రిటర్నింగ్‌ అధికారులు 75 కాలమ్‌ల నివేదికను తయారు చేసి తమకు సమర్పించాల్సి ఉంటుందన్నారు. ఎన్నికల పరిశీలకుల సమక్షంలో ఈ ప్రక్రియ జరుగుతుందన్నారు. అందుకే పోలింగ్‌ శాతాలను వెల్లడించడంలో ఆలస్యమైందన్నారు. 

స్ట్రాంగ్‌ రూమ్స్‌ వద్ద పార్టీల కాపలా..
కట్టుదిట్టమైన భద్రత, సీసీటీవీ కెమెరాల నిఘాలో ఈవీఎంలను స్ట్రాంగ్‌ రూమ్స్‌లో భద్రపరిచామని రజత్‌ కుమార్‌ తెలిపారు. ఎన్నికల్లో వినియోగించిన, వినియోగించని ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్‌ రూమ్స్‌ దగ్గర రాజకీయ పార్టీల ప్రతినిధులు కాపలా ఏర్పాటు చేసుకునేందుకు అనుమతిస్తామన్నారు. ఈవీఎంల భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ రాజకీయ పార్టీల నుంచి ఈ మేరకు విజ్ఞప్తులు వచ్చాయని, వారిని ఆహ్వానిస్తున్నామన్నారు. ఈ మేరకు అనుమతించాలని కోరుతూ జిల్లా ఎన్నికల అధికారులకు ఆదేశిస్తామన్నారు. ఎన్నికల్లో గెలుపుపై ధీమా లేని అభ్యర్థులే తరుచుగా ఈవీఎంల విషయంలో భయాందోళనలు వ్యక్తం చేస్తుంటారని రజత్‌ కుమార్‌ వ్యాఖ్యానించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement