సాక్షి, హైదరాబాద్ : మిగతా రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో ఎన్నికల నిర్వహణకు అన్ని అంశాలు అనుకూలంగా ఉన్నాయని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి రజత్ కుమార్ అన్నారు. సోమవారం మీడియాతో ఆయన చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఓటరు నమోదు కార్యక్రమం గురించి మాట్లాడుతూ.. నియోజకవర్గాల వారీగా 13 శాతం కొత్త ఓటర్లు పెరిగారని తెలిపారు. ఫామ్ 6 ద్వారా 19.5 లక్షల కొత్త ఓటర్లు అప్లై చేశారని, వారిలో 1.5 లక్షల ఓటర్ల దరఖాస్తులను తిరస్కరించామని పేర్కొన్నారు. ప్రతీ నియోజకవర్గంలో కొత్త ఓటర్ల సంఖ్య పెరుగగా భద్రాచలంలో 40 శాతం, అశ్వారావుపేటలో 21 శాతం ఓటర్లు తగ్గారని రజత్ కుమార్ వెల్లడించారు.
పారదర్శకంగా పనిచేస్తున్నాం..
ఎన్నికల కమిషన్ పారదర్శకంగా పని చేస్తోందని రజత్ కుమార్ అన్నారు. రైతుబంధు పథకం, బతుకమ్మ చీరల పంపిణీ గురించి వివిధ పార్టీల నుంచి ఎన్నికల సంఘానికి అభ్యంతరాలు కూడిన ఫిర్యాదులు అందాయని, వీటిని కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించామని పేర్కొన్నారు. రైతుబంధు చెక్కులు, బతుకమ్మ చీరల పంపిణీలు రెగ్యులర్ పథకాలు గనుక వాటిపై ఎటువంటి నిబంధనలు లేవని స్పష్టం చేశారు. ఇఆర్వో నెట్ చాలా స్పీడ్ గా పనిచేస్తుందన్న రజత్ కుమార్..అవసరమనుకుంటే 100 అదనపు పోలింగ్ స్టేషన్లకు ఈవీఎంలు ఇచ్చేందుకు భెల్ కంపెనీ సిద్ధంగా ఉందన్నారు. వీటిలో 40 శాతం కొత్తవి, 60 శాతం పాత అప్లికేషన్లు ఉన్నాయని తెలిపారు.
దివ్యాంగులకు సౌకర్యాలు కల్పిస్తాం..
రాష్ట్రంలో 4.16 లక్షల దివ్యాంగ ఓటర్లు ఉన్నారని రజత్ కుమార్ పేర్కొన్నారు. వారి కోసం తెలుగులో బోర్డ్స్ పెట్టడం, రవాణా, క్యూలో నిలబడే అవసరం లేకుండా చూడటం వంటి ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తామన్నారు. కళ్ళు లేనివారికి బ్రెయిలీ లిపిలో కూడా ఓటర్ కార్డులు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నామన్నారు. ఇక శాంతి భద్రతల కోసం కేంద్ర ఎన్నికల కమిషన్ అడిషనల్ డీజీని అపాయింట్ చేసిందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment