గజ్వేల్ రూరల్: రాష్ట్రంలోని నదులు, రిజర్వాయర్లు, ప్రధాన కాలువలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించి పరిస్థితులను తెలుసుకునేందుకు ఇరిగేషన్ శాఖ డేటా సపోర్టింగ్ సిస్టంను తయారు చేసిందని.. ఇందులో భాగంగా కాళేశ్వరం ప్రాజెక్టు పర్యవేక్షణ కోసం గజ్వేల్, కరీంనగర్‌లలో కమాండ్ కంట్రోల్ కేంద్రాలను ఏర్పాటు చేశామని రాష్ట్ర నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్‌కుమార్ తెలిపారు.
శనివారం ఆయన గజ్వేల్ పట్టణంలోని కాళేశ్వరం ఎస్‌ఈ కార్యాలయంలో కమాండ్ కంట్రోలింగ్ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్‌ఈలు, ఈఈలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో పలు జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో నదులు, ప్రాజెక్టుల్లోకి భారీగా వరదనీరు చేరుతున్నప్పటికీ పరిస్థితులు అదుపులోనే ఉన్నాయన్నారు.
కమాండ్ కంట్రోల్ కేంద్రాల ద్వారా వరదలు వచ్చినపుడే కాకుండా సాధారణ సమయాల్లోనూ నదులు, ప్రాజెక్టుల సామర్థ్యం, నీటి ప్రవాహ వేగం పరిశీలన, నీటి నిల్వలు, కాలువల కింద ఎంత నీటి అవసరమున్నదనే విషయాలను లెక్కగట్టి నీరు విడుదల చేసే అవకాశముంటుందన్నారు. వరదల జరిగిన నష్టం పునరావృతం కాకుండా ప్రభుత్వం పటిష్టచర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఇటీవల వరదల వల్ల లక్ష్మీ పంప్‌హౌస్‌లోకి వచ్చిన నీటిని తొలగించే పనులు జరుగుతున్నాయని చెప్పారు. ఆయా ప్రాజెక్టుల వద్ద అవసరమైన చర్యలు చేపట్టేందుకు అధికారులంతా అప్రమత్తతతో ఉన్నట్లు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment