command control
-
సీసీ కెమెరా ఉంటేనే నిర్మాణ అనుమతులు! రాచకొండ పోలీసుల ఆలోచన
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భవన నిర్మాణ అనుమతుల మంజూరులో కొత్త నిబంధన అమల్లోకి రానుంది. సీసీ టీవీ (క్లోజ్డ్ సర్క్యూట్ టెలివిజన్) కెమెరా ఏర్పాటు చేస్తేనే భవనాలు, వాణిజ్య సముదాయాలకు అనుమతుల జారీకి రంగం సిద్ధ మవుతోంది. నేరాల నియంత్రణ, నేరస్తుల గుర్తింపులో సీసీ కెమెరాలు కీలకంగా మారిన నేపథ్యంలో.. వాటి ఏర్పాటును భవన నిర్మాణ అనుమ తులలో భాగం చేస్తే మేలని రాచకొండ పోలీసు ఉన్నతాధికారులు ఆలోచనకు వచ్చారు. ఈ మేరకు నిబంధనలను అమల్లోకి తేవాలంటూ రాష్ట్ర పురపాలకశాఖకు లేఖ రాసినట్టు తెలిసింది. ఇవేగాకుండా పెట్రోల్ బంకులు, విద్యా సంస్థలు, ఆస్పత్రులు, బ్యాంకులు, వ్యాపార సముదాయాలు, ఐదు లేదా అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉండే కార్యాలయాల వద్ద కూడా సీసీ కెమెరాల ఏర్పాటును తప్పనిసరి చేయాలని కోరింది. ఇప్పటికే మహారాష్ట్ర, అస్సాం వంటి రాష్ట్రాల్లో ఉన్న ఈ విధానాన్ని అధ్యయనం చేసి.. తుది నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం. భారం తక్కువ.. భద్రత ఎక్కువ.. ఇప్పటివరకు గేటెడ్ కమ్యూనిటీలు, భారీ భవనాలు, కాలనీలలో నివాసితుల అసోసియేషన్లే సొంతంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకుంటున్నాయి. కానీ అంతటా ఈ విధానాన్ని తప్పనిసరి చేయాలని, ఆ తర్వాతే జీహెచ్ఎంసీ/హెచ్ఎండీఏ/డీటీసీపీలు నిర్మాణ అనుమతులు ఇవ్వాలని రాచకొండ పోలీసు ఉన్నతాధికారులు సూచించినట్టు తెలిసింది. భారీ ఖర్చుతో అపార్ట్మెంట్లు, భవనాలను నిర్మించే డెవలపర్లకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేయటం పెద్ద భారమేమీ కాదని.. ఇదే సమయంలో మరింత భద్రత కూడా అని పోలీసు వర్గాలు చెప్తున్నాయి. కమాండ్ సెంటర్‌తో అనుసంధానంతో.. అంతర్రాష్ట్ర నిందితులు పలుచోట్ల తిష్ట వేసి చెయిన్ స్నాచింగ్‌లు, బ్యాంకులు, జ్యువెలరీ షాపుల లో దోపిడీలకు పాల్పడుతుండటం, అనుమానాస్పద హత్యలు, ఇతర నేరాలు చేస్తుండటం పెరిగిపోతోంది. ఈ క్రమంలో నేరాల నియంత్రణ, మరింత భద్రత కోసం సీసీ కెమెరాలన్నింటినీ ‘రాష్ట్ర పోలీస్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (టీఎస్‌పీఐసీసీసీ)’కు అనుసంధానించాలని పోలీసులు భావిస్తున్నారు. తద్వారా పాత నేరస్తుల కదలికలు, సున్నిత ప్రాంతాల్లో అనుమానాస్పద వ్యక్తుల సంచారం, నేరాలకు పాల్పడినవారు ఎక్కడున్నారన్నదీ సీసీ కెమెరాల ద్వారా పోలీసులు తెలుసుకోగలుగుతారని చెప్తున్నారు. ఏదైనా సమస్య వచ్చినా, అనుమానాస్పదంగా అనిపించినా.. స్థానిక పోలీసులను, పెట్రోలింగ్ సిబ్బందిని అప్రమత్తం చేస్తారని వివరిస్తున్నారు. సీసీ కెమెరాలు ఎక్కడ ఏర్పాటు చేయాలంటే..? భవనాల ప్రహరీపై నలువైపులా, ప్రవేశ, నిష్క్రమణ ద్వారం, మెట్ల మార్గం, లిఫ్టు దగ్గర, పార్కింగ్ ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలి. అపార్ట్మెంట్లోని ప్రతీ అంతస్తు సీసీ కెమెరాలో రికార్డయ్యేలా చూసు కోవాలి. సీసీ కెమెరాలను ఇన్స్టాల్ చేసిన చోట్లను జీపీఎస్ లొకేషన్‌తో సహా స్థానిక పోలీసుస్టేషన్లో నమోదు చేయాలి. ఆ కెమెరాల ఫుటేజీ కనీసం 30 రోజులు నిల్వ ఉండేలా చూసుకోవాలి. కెమెరాల పనితీరు, నిర్వహణ బాధ్యత సంబంధిత భవన యజమానిదే. ప్రజల గోప్యతకు ఏ మాత్రం భంగం కలిగించకుండా పోలీసులు ఆయా సీసీటీవీ కెమెరాలను పర్యవేక్షిస్తారు. -
కాళేశ్వరం పర్యవేక్షణకు ‘కమాండ్ కంట్రోల్’
గజ్వేల్ రూరల్: రాష్ట్రంలోని నదులు, రిజర్వాయర్లు, ప్రధాన కాలువలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించి పరిస్థితులను తెలుసుకునేందుకు ఇరిగేషన్ శాఖ డేటా సపోర్టింగ్ సిస్టంను తయారు చేసిందని.. ఇందులో భాగంగా కాళేశ్వరం ప్రాజెక్టు పర్యవేక్షణ కోసం గజ్వేల్, కరీంనగర్‌లలో కమాండ్ కంట్రోల్ కేంద్రాలను ఏర్పాటు చేశామని రాష్ట్ర నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్‌కుమార్ తెలిపారు. శనివారం ఆయన గజ్వేల్ పట్టణంలోని కాళేశ్వరం ఎస్ఈ కార్యాలయంలో కమాండ్ కంట్రోలింగ్ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్ఈలు, ఈఈలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో పలు జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో నదులు, ప్రాజెక్టుల్లోకి భారీగా వరదనీరు చేరుతున్నప్పటికీ పరిస్థితులు అదుపులోనే ఉన్నాయన్నారు. కమాండ్ కంట్రోల్ కేంద్రాల ద్వారా వరదలు వచ్చినపుడే కాకుండా సాధారణ సమయాల్లోనూ నదులు, ప్రాజెక్టుల సామర్థ్యం, నీటి ప్రవాహ వేగం పరిశీలన, నీటి నిల్వలు, కాలువల కింద ఎంత నీటి అవసరమున్నదనే విషయాలను లెక్కగట్టి నీరు విడుదల చేసే అవకాశముంటుందన్నారు. వరదల జరిగిన నష్టం పునరావృతం కాకుండా ప్రభుత్వం పటిష్టచర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఇటీవల వరదల వల్ల లక్ష్మీ పంప్‌హౌస్‌లోకి వచ్చిన నీటిని తొలగించే పనులు జరుగుతున్నాయని చెప్పారు. ఆయా ప్రాజెక్టుల వద్ద అవసరమైన చర్యలు చేపట్టేందుకు అధికారులంతా అప్రమత్తతతో ఉన్నట్లు వివరించారు. -
కమాండ్ కంట్రోల్‌ను పరిశీలించిన డీజీపీ
తిరుపతి క్రైం: ఈస్ట్ పోలీస్‌స్టేషన్ మిద్దెపైనున్న కమాండ్ కంట్రోల్‌ను డీజీపీ సాంబశివరావు పనితీరును పరిశీలించారు. తిరుపతి చేరుకున్న ఆయనకు ఈస్ట్ సబ్ డివిజనల్ డీఎస్పీ మురళీకృష్ణా, సీఐ రాంకిషోర్ పుష్పగుచ్ఛంతో స్వాగతం పలికారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల నిమిత్తం తిరుమల, తిరుపతికి భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుందని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలూ జరగకుండా చూడాలని చెప్పారు. అవసరమైతే మరిన్ని ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించే వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ–చలానా ఆన్లైన్ విధానాన్ని పరిశీలించాలని సూచించారు. కమాండ్ కంట్రోల్ రూంలో సీసీ కెమెరాల ద్వారా పరిష్కరించిన కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. దీనిపై తగు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఫొటోగ్యాలరీని పరిశీలించి, చక్కగా ఉందని అభినందించారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ ఐజీ శ్రీధర్‌రావు, అనంతపురం రేంజ్ డీఐజీ ప్రభాకర్‌రావు, అర్బన్ జిల్లా ఎస్పీ జయలక్ష్మి, ఈస్ట్ డీఎస్పీ మురళీకృష్ణ, ట్రాఫిక్ డీఎస్పీ దిలీప్ కిరణ్, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు. -
కమాండ్ కంట్రోల్ సెంటర్లో ‘హరితహారం’
నాగార్జునసాగర్ : జలాశయతీరంలోని హిల్‌కాలనీలో నిర్మించిన కమాండ్ కంట్రోల్ సెంటర్లో హరితహారంలో భాగంగా సోమవారం జిల్లా ఎస్పీ ప్రకాశ్‌రెడ్డి మొక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎంతో విశాలంగా ఉన్న ఈకంట్రోల్ సెంటర్లో విరివిగా మొక్కలు నాటి వాటిని పెంచాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో యాదగిరిగుట్ట డీఎస్పీ ఎస్.మోహన్‌రెడ్డి, సీఐ శివరాంరెడ్డి, ఎస్బీ హెడ్‌కానిస్టేబుల్ వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.