సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని మూడు స్థానిక సంస్థ ల కోటా ఎమ్మెల్సీ స్థానాలకు జరిగే ఎన్నికల్లో ప్రస్తుత జెడ్పీటీసీ, ఎంపీటీసీలకే ఓటు హక్కు లభించనుం దని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) రజత్ కుమార్ తెలిపారు. ప్రస్తుత జెడ్పీటీసీ, ఎంపీటీసీల పదవీ కాలం జూలై 5తో ముగియనుందని పేర్కొన్నారు. దీనికి నెల రోజులకు ముందుగా (మే 31న) ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనుండటంతో ఓటు హక్కు వారికే లభిస్తుందని తెలిపారు. ఈ మేరకు పాత ఓటర్ల జాబితాతోనే స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు నిర్వహిస్తామని వెల్లడించారు. నల్లగొండ, రంగారెడ్డి, వరంగల్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల నోటిఫికేషన్‌ను కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం జారీ చేసింది. ఈ సందర్భంగా సీఈఓ విలేకరులతో మాట్లాడారు. నిబంధనల ప్రకారం ఏదైనా నియోజకవర్గం ఖాళీ అయితే, ఖాళీ అయిన తేదీ నుంచి 6 నెలల్లోగా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుందని తెలిపారు.
రంగారెడ్డి, నల్లగొండ, వరంగల్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ నియోజకవర్గాలు ఖాళీ అయి వరుసగా జూన్ 10, 16, 21 నాటికి ఆరు నెలల కాలం పూర్తవుతుందన్నారు. ఈ మూడు స్థానాలకు సంబంధించి న్యాయ స్థానాల్లో ఎలాంటి కేసులు లేకపోవడంతో ఆరు నెలల గడువులోగా ఎన్నికలు నిర్వహించేందుకు నోటిఫికేషన్ జారీ చేశామని చెప్పారు. దీంతో జూలై 5 వరకు పదవీ కాలం ఉన్న ప్రస్తుత ఎంపీటీసీ, జెడ్పీటీసీలే ఓటు హక్కు పొందుతారని తెలిపారు. రాష్ట్రంలో తాజాగా జరుగుతున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఫలితా లు మే 27న రానుండగా, గెలిచిన కొత్త సభ్యుల పదవీ కాలం జూలై 5 తర్వాత ప్రారంభం కానుండటంతో అంతకు ముందే జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో వారికి ఓటు హక్కు కల్పించే ఆస్కారం లేదన్నారు.
మిగతా స్థానాలకు త్వరలో ఎన్నికలు..
ఉమ్మడి వరంగల్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిసే వరకు ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉంటుందని సీఈఓ తెలిపారు. రిటర్నింగ్ అధికారుల సూచనల మేరకు పోలింగ్ కేంద్రాల ఏర్పాటుపై నిర్ణయం తీసుకుంటామన్నారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేసే స్థానిక సంస్థల ప్రతినిధులపై కోర్టు కేసులున్నా.. వారు ఓటేసేందుకు అర్హులేనన్నారు. ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు సైతం త్వరలో ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment