సాక్షి, హైదరాబాద్: ఎన్నికల నామినేషన్ దాఖలు చేసిన నాటి నుంచే అభ్యర్థుల ఎన్నికల వ్యయాన్ని లెక్కించడం ప్రారంభమవుతుందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈవో) రజత్‌కుమార్ అన్నారు. నామినేషన్‌కు ముందు అభ్యర్థులు చేసిన వ్యయాన్ని పార్టీల ఖర్చుల ఖాతాల్లోకి వెళ్తుందని చెప్పారు. అభ్యర్థులు నామినేషన్ల దాఖలు తర్వాత ఏడు రోజుల్లోగా తమ నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించే స్టార్ క్యాంపెయినర్ల జాబితాలను సమర్పించాల్సి ఉం టుందని చెప్పారు. లేనిపక్షంలో స్టార్ క్యాంపెయినర్ల ప్రచార ఖర్చులను అభ్యర్థుల ఎన్నికల ఖర్చు కింద లెక్కిస్తామన్నారు.
రాష్ట్ర శాసనసభ సాధారణ ఎన్నికలకు సోమవారం ఉదయం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన నేపథ్యంలో సాయంత్రం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కులాలు, మతాల పేరుతో ఓట్లను అభ్యర్థించడం ఎన్నికల కోడ్ ఉల్లంఘన పరిధిలోకి వస్తుందన్నారు. కుల సంఘాలతో కొందరు మంత్రులు సమావేశమై ఓట్లను అభ్యర్థించడం సరైంది కాదని, ఇలాంటి కార్యక్రమాలు చేపట్టవద్దని రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేశారు. కులసంఘాలతో సమావేశమైన మంత్రులకు నోటీసులు జారీ చేశామన్నారు. పేదలకు అత్యవసర వైద్య సహాయం కోసం ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి నేరుగా ఆస్పత్రులకు చెక్కులు జారీ చేసేందుకు ఈసీ అనుమతిచ్చిందని తెలిపారు.
అయితే, చెక్కులతో ప్రచారం నిర్వహించడానికి వీలులేదన్నారు. ఎన్నికల కోడ్ అమల్లో భాగంగా ఇప్పటివరకు రూ.77.62 కోట్ల నగదు, రూ.5.98 కోట్ల విలువైన మద్యాన్ని జప్తు చేశామన్నారు. ఎన్నికల ప్రచార రాతలు, పోస్టర్లతో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను దుర్వినియోగం చేసినందుకు 4,07,234 కేసులు నమోదు చేశామని పేర్కొన్నారు. 4,030 బెల్టుషాపులను మూసివేయించామన్నారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు సంబంధించిన కేసుల్లో 3,154 మందిని అరెస్టు చేశామని చెప్పారు. డబ్బులను రవాణా చేసే వ్యక్తులతోపాటు బ్యాంకులు సైతం సరైన పత్రాలను కలిగి ఉండాల్సిందేనని, లేని పక్షంలో జప్తు చేస్తామని స్పష్టం చేశారు.
వ్యక్తిగత దూషణలు, ఆరోపణలపై నలుగురు నేతల నుంచి వివరణలు వచ్చాయన్నారు. అలాంటి ఆరోపణలు చేయలేదని కొందరు, భవిష్యత్తులో పునరావృతం చేయబోమని మరికొందరు వివరణ ఇచ్చారన్నారు. బందోబస్తు ఏర్పాట్ల కోసం 275 కంపెనీల కేంద్ర సాయుధ బలగాలను రాష్ట్రానికి కేటాయించారన్నారు. కేంద్ర బలగాలతోపాటు ఎన్నికల సిబ్బందికి నగదు రహిత వైద్యం అందించడానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. అత్యవసర వైద్యసేవల కోసం పోలింగ్ సిబ్బందిని తరలించేందుకు ఒక ఎయిర్ అంబులెన్స్‌ను అందుబాటులో ఉంచుతున్నామని వివరించారు.
ఆ అధికారం ఆర్వోలకు లేదు...
అభ్యర్థుల ఎన్నికల అఫిడవిట్లను పరిశీలించే అధికారం రిటర్నింగ్ అధికారులకు ఉండదని రజత్‌కుమార్ తెలిపారు. అఫిడవిట్లలో ఏదైనా సమాచారాన్ని పొందుపర్చకుండా ఖాళీగా ఉంచితే ఆ విషయాన్ని ఆర్వోలు అభ్యర్థులకు తెలియజేయాల్సి ఉంటుందన్నారు. అయితే, ఖాళీగా పెట్టారన్న కారణంతో నామినేషన్లను తిరస్కరించే అధికారం ఆర్వోలకు లేదని స్పష్టం చేశారు.
తాము ఎన్నికల్లో పోటీ చేయకుండా ఏ అభ్యర్థికి కూడా అనుమతి నిరాకరించలేమని, ఈ విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంటుందన్నారు. తప్పుడు అఫిడవిట్లు జారీ చేస్తే భవిష్యత్తులో చట్టపరచర్యలతోపాటు సుప్రీంకోర్టు ఆదేశాల ఉల్లంఘన కేసులను ఎదుర్కోవాల్సి ఉం టుందన్నారు. ఎన్నికల కోడ్ అమలును పర్యవేక్షిం చేందుకు కేంద్రం నుంచి 68 మంది ఐఏఎస్ అధికారులు సాధారణ పరిశీలకులుగా 19న వస్తున్నారన్నారు. ఆదాయపన్ను శాఖ నుంచి 53 మంది వ్యయ పరిశీలకులు, 10 మంది ఐపీఎస్ అధికారులు పోలీసు పరిశీలకులుగా వస్తారన్నారు.
1.16 లక్షల డూప్లికేట్ ఓట్ల తొలగింపు అసాధ్యం
సాంకేతిక కారణాలతో ఓటర్ల జాబితాలో పునరావృతమైన 1.16 లక్షల మంది ఓటర్ల పేర్లను శాసనసభ ఎన్నికలకు ముందు తొలగించడం సాధ్యంకాదని రజత్‌కుమార్ పేర్కొన్నారు. గత నెల 12న ప్రకటించిన తుది ఓటర్ల జాబితాలో దాదాపు 24 వేలమంది పేర్లు రెండు, మూడు, నాలుగు సార్లు పునరావృతమయ్యాయన్నారు. పునరావృతమైన ఓటర్ల తొలగింపునకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతించలేదన్నారు. ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని కమిషన్ సూచించిందని చెప్పారు. ఒకసారి ఓటర్ల తుదిజాబితాను ప్రచురించిన తర్వాత మార్పులు, చేర్పులు జరపడానికి వీలు లేకుండా కట్టుదిట్టమైన నిబంధనలున్నాయన్నారు.
పునరావృతమైన ఓటర్లను గుర్తించి ఎన్నికల్లో ఒకటి కంటే ఎక్కువ పర్యాయాలు ఓటుహక్కు వినియోగించుకోకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రాష్ట్ర ఓటర్ల సంఖ్య తాజాగా 2,76,29,610కు పెరిగిందన్నారు. ఇందులో 1,39,35,705 మంది పురుషులు, 1,36,91,290 మంది మహిళలు, 2,615 మంది ఇతరులున్నారని చెప్పారు. ఈ నెల 19న ఓటర్ల జాబితా రెండో అనుబంధాన్ని ప్రచురించేనాటికి గణాంకాల్లో స్వల్ప మార్పులు ఉండవచ్చన్నారు. 2014 శాసనసభ ఎన్నికల సమయంలో రాష్ట్రంలో 2.83 కోట్ల మంది ఓటర్లు ఉన్నారన్నారు. ఓటర్ల జాబితా విషయంలో తన మీద రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయన్న ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment