కోడ్‌ కూసింది! | EC May Enforce Model Code Right After Dissolution of House | Sakshi
Sakshi News home page

కోడ్‌ కూసింది!

Published Fri, Sep 28 2018 2:04 AM | Last Updated on Fri, Sep 28 2018 10:25 AM

EC May Enforce Model Code Right After Dissolution of House - Sakshi

విలేకరులతో మాట్లాడుతున్న రజత్‌కుమార్‌. చిత్రంలో బుద్ధప్రకాశ్, ఆమ్రపాలి

సాక్షి, హైదరాబాద్‌/న్యూఢిల్లీ: రాష్ట్రంలో ముం దస్తు ఎన్నికల కోడ్‌ కూసింది. శాసనసభ రద్దయి న నేపథ్యంలో ఆపద్ధర్మ ప్రభుత్వంపై ఎన్నికల ప్రవర్తనా నియమావళిలోని 7వ భాగం (మొత్తం 8 భాగాలకుగాను) అమల్లోకి వచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులు, కేంద్ర కేబినెట్‌ కార్యదర్శికి కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కార్యదర్శి నరేంద్ర ఎన్‌. బెటోలియా గురువారం లేఖ రాశారు. గడువుకు ముందే శాసనసభ రద్దయిన నేపథ్యంలో ఆపద్ధర్మ ప్రభుత్వాలను నియమించిన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా, పకడ్బందీగా ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని విధించాలని నిర్ణయించినట్లు కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది.

ఆపద్ధర్మ ప్రభుత్వం రోజువారీ పాలనకే కట్టుబడి ఉండాలని, విధానపర నిర్ణయాలు తీసుకోకుండా నియంత్రణ పాటించాలని 1994లో సుప్రీంకోర్టు ఎస్‌ఆర్‌. బొమ్మాయ్‌ కేసులో ఇచ్చిన తీర్పు ఆధారంగా ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌ కుమార్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. గురువారం సచివాలయంలో ఆయన ఎలక్షన్‌ మీడియా సెల్‌ను ప్రారంభించారు. అనంతరం అదనపు సీఈవో జ్యోతి బుద్ధప్రకాశ్, జాయింట్‌ సీఈఓ కాటా అమ్రపాలితో కలసి విలేకరులతో మాట్లాడారు.

కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలకు వర్తించే ఎన్నికల ప్రవర్తనా నియమావళిలోని 7వ భాగం మాత్ర మే రాష్ట్రంలో ప్రస్తుతం అమల్లోకి వచ్చిందని, కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించిన మరుక్షణమే రాష్ట్రంలో పూర్తిస్థాయిలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వస్తుందన్నారు. ఎన్నికల ప్రచార కార్యక్రమాల కు మంత్రులు అధికారిక వాహనాలు, ఇతర ప్రభుత్వ వనరులను వినియోగించరాదన్నారు.

లేఖలోని ముఖ్యాంశాలు..
రాష్ట్ర శాసనసభ రద్దయిన తర్వాత పాలనా పగ్గాలు స్వీకరించే ఆపద్ధర్మ ప్రభుత్వంపై తక్షణమే ఎన్నికల ప్రవర్తనా నియమావళిలోని 7వ భాగం అమల్లోకి వస్తుంది. ఎన్నికలు ముగిసి కొత్త శాసనసభ కొలువు తీరే వరకు ఇది కొనసాగుతుంది.
 రాష్ట్ర ప్రభుత్వంతోపాటు రాష్ట్రానికి సంబంధించిన విషయాల్లో కేంద్ర ప్రభుత్వానికి సైతం ఈ నియమావళిలోని 7వ భాగం వర్తిస్తుంది.
   రాష్ట్రంలోని ఆపద్ధర్మ ప్రభుత్వంతోపాటు రాష్ట్రానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కూడా కొత్త పథకాలు, ప్రాజెక్టులు, ఇతరాత్రలను ప్రకటించరాదు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిలోని 7వ భాగంలో నిషేధించిన ఏ కార్యక్రమాలనూ చేపట్టరాదు.
కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రంలోని ఆపద్ధర్మ ప్రభుత్వ మంత్రులు, అధికారంలో ఉన్న ఇతరులు ప్రభుత్వ వనరులను అనధికారిక కార్యక్రమాలకు వినియోగించరాదు. అధికారిక పర్యటనలతోపాటు నిర్వహించే ఎన్నికల ప్రచార కార్యక్రమాలకు ప్రభుత్వ వనరులను వాడరాదు.

ఏకగ్రీవ తీర్మానాలపై కఠిన చర్యలు..
ఎన్నికల్లో తమ పార్టీకి ఓటేస్తామని ఏకగ్రీవ తీర్మానం చేస్తే రూ. 5 లక్షల ముడుపులిస్తామని కొంత మంది నేతలు ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నట్లు వెలుగులోకి వచ్చిన వీడియో ఫుటేజీలపై రజత్‌ కుమార్‌ తీవ్రంగా స్పందించారు. ఇలాంటి కేసుల విషయంలో కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోలీసు, ఎక్సైజ్, ఆదాయపన్ను శాఖలతో కలసి రాష్ట్రంలో డబ్బు, మద్యం పంపిణీపై నిరంతర నిఘా పెట్టామన్నారు. ప్రభుత్వ పథకాలకు ప్రచారం కల్పించేందుకు రాష్ట్ర సమాచార, ప్రజాసంబంధాలశాఖ హైదరాబాద్‌వ్యాప్తంగా హోర్డింగ్‌లు ఏర్పాటు చేసే సమయానికి ఎన్నికల కోడ్‌ అమల్లోకి రాలేదని, ఈ నేపథ్యంలో వాటికి కోడ్‌ వర్తించదన్నారు.

రాష్ట్రంలో ఇప్పటికే అమల్లో ఉన్న పథకాలు, కార్యక్రమాలపై ఎలాంటి ప్రభావం ఉండదన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి పరిధిలోకి రైతు బీమా, బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాలు వస్తాయో లేవో పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని విలేకరులు ఆడిన ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. హైదరాబాద్‌లో మాజీ ప్రధాని వాజ్‌పేయి స్మారక భవనం ఏర్పాటుకు ఎకరా స్థలం కేటాయిస్తామని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌ గురువారం శాసన మండలిలో చేసిన ప్రకటన ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కిందకు వస్తుందో రాదో పరిశీలిస్తామన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement