నగరంలో లోక్‌సభ ఎన్నికల కోసం సిద్ధం చేస్తున్న సామగ్రి
సాక్షి, హైదరాబాద్: దేశభవిష్యత్తును నిర్ణయించే.. 2019 లోక్‌సభ ఎన్నికల తొలివిడతకు సర్వం సిద్ధమైంది. తెలంగాణలోని 17ఎంపీ స్థానాలు, ఆంధ్రప్రదేశ్‌లోని 25 లోక్‌సభ, 175 అసెంబ్లీ స్థానాలు సహా 20 రాష్ట్రాల పరిధిలోని మొత్తం 91 లోక్‌సభ స్థానాలకు గురువారం ఎన్నికలు నిర్వహించనున్నారు. తెలంగాణలోని 16 స్థానాలకు గురువారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. నిజామాబాద్‌లో రికార్డు స్థాయిలో 185 మంది అభ్యర్థులు బరిలో ఉండడంతో.. అక్కడ పోలింగ్‌కు ముందు మాక్ పోలింగ్ నిర్వహణకు గంట సమయం అదనంగా పట్టనుంది. దీంతో ఆ ఒక్క నియోజకవర్గంలో మాత్రం ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు పోలింగ్ జరగనుంది.
రాష్ట్రంలోని 5 లోక్‌సభ స్థానాల పరిధిలోని 13 నక్సల్స్ ప్రభావిత అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాత్రం ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు మాత్రమే పోలింగ్ జరగనుంది. మే 23న ఓట్లను లెక్కించి ఫలితాలను వెల్లడించనున్నారు. ప్రధాన రాజకీయ పార్టీలైన టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీలు రాష్ట్రంలోని అన్ని లోక్‌సభ స్థానాల నుంచి తమ అభ్యర్థులను పోటీలో నిలిపాయి. ఐదు స్థానాల్లో బీఎస్పీ, చెరో రెండేసి స్థానాల్లో సీపీఐ, సీపీఎం అభ్యర్థులు, ఒక స్థానం నుంచి మజ్లిస్ పోటీ చేస్తున్నాయి. మొత్తం 443 మంది అభ్యర్థులు బరిలో ఉండగా.. అందులో 25 మంది మహిళా అభ్యర్థులున్నారు.
గత డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి టీఆర్‌ఎస్ మంచి ఊపు మీదుంది. సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలే భారీ విజయాన్ని అందిస్తాయని ఆ పార్టీ అభ్యర్థులు ధీమాగా ఉన్నారు. రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాల్లో హైదరాబాద్ మినహా 16 స్థానాలను గెలుచుకుంటామని కేసీఆర్ చెబుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై వ్యతిరేకతతో పాటు పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన ‘న్యాయ్’పథకంపై కాంగ్రెస్ ఆశలు పెట్టుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ గాలి మళ్లీ వీస్తుందని.. ఆయన ఇమేజ్, విధానాలు ఎన్నికల్లో కలిసొస్తాయని బీజేపీ భావిస్తోంది. కాగా, హైదరాబాద్ లోక్‌సభ స్థానం నుంచి తన గెలుపు ఖాయమేనని మజ్లిస్ అధినేత, సిట్టింగ్ ఎంపీ అసదుద్దీన్ ధీమాతో ఉన్నారు.
2.97 కోట్ల మంది ఓటర్లు
17 లోక్‌సభ స్థానాల పరిధిలో మొత్తం 2,96,97,279 ఓటర్లుండగా అందులో 1,49,19,751 మంది పురుషులు, 1,47,76,024 మంది మహిళలు, 1504 మంది ఇతరులు కలిపి మంది సాధారణ ఓటర్లు ఉన్నారు. 11,320 మంది సర్వీసు ఓటర్లు కలిపి మొత్తం 2,97,08,599 మంది లోక్‌సభ ఎన్నికల్లో ఓటేయనున్నారు. ఓటర్లందరికీ ఫోటో ఓటరు గుర్తింపు కార్డులు జారీ చేశామని సీఈఓ వెల్లడించారు. 48 లక్షల మంది కొత్త ఓటర్లకు ఎపిక్ కార్డులు జారీ చేశామన్నారు. 77,365 బ్యాలెట్ యూనిట్లు, 41,051 కంట్రోల్ యూనిట్లు, 43,894 వీవీప్యాట్‌లను ఎన్నికల్లో వినియోగించబోతున్నారు.
ఎన్నికలకు సర్వం సిద్ధం
రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికలకు ఏర్పాట్లన్నీ పూర్తి చేశామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) రజత్‌కుమార్ ప్రకటించారు. ఎన్నికల సామగ్రితో ఎన్నికల సిబ్బంది బుధవారం రాత్రి నాటికి రాష్ట్రంలోని అన్ని పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారని వెల్లడించారు. గురువారం ఉదయం 5.30గంటలకు పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల ప్రిసైడింగ్ అధికారులు మాక్‌పోలింగ్ నిర్వహిస్తారని, ఎన్నికల ఏజెంట్లు తప్పనిసరిగా ఈ ప్రక్రియకు పాల్గొనాలన్నారు. లోక్‌సభ ఎన్నికల ఏర్పాట్లపై బుధవారం రాత్రి ఆయన విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు.
ఎన్నికల విధుల్లో 2.2లక్షల మంది అధికారులు, సిబ్బంది పాల్గొంటారన్నారు. 145 కంపెనీల కేంద్ర సాయుధ బలగాలతో పాటు 55వేల రాష్ట్ర పోలీసు సిబ్బంది, హోంగార్డులు ఎన్నికల బందోబస్తు నిర్వహిస్తారన్నారు. ఎన్నికల సిబ్బంది, భద్రత దళాలు కలుపుకుని మొత్తం 3లక్షల మంది ఉద్యోగులు ఎన్నికల విధుల్లో పాలుపంచుకోనున్నారన్నారు. మావోయిస్టుల మందుపాతరకు.. ఛత్తీస్‌గఢ్‌లో ఓ బీజేపీ ఎమ్మెల్యేతో పాటు ఐదుగురు భద్రతా సిబ్బంది మరణించిన నేపథ్యంలో రాష్ట్రంలో మావోయిస్టుల ప్రభావంపై పోలీసుశాఖతో సమీక్ష నిర్వహించామన్నారు. రాష్ట్రంలో మావోయిస్టుల ప్రభావం పెద్దగా లేదని, ఆందోళనపడాల్సిన అవసరం లేదని పోలీసు శాఖ స్పష్టం చేసిందన్నారు.
ఇందూరుపైనే అందరి దృష్టి!
నిజామాబాద్ లోక్‌సభ స్థానం నుంచి రికార్డు సంఖ్యలో 185 మంది అభ్యర్థులు పోటీ చేస్తుండడంతో అందరి దృష్టి అక్కడే ఉంది. అక్కడ ఎం–3 మోడల్ అధునాతన ఈవీఎంలను వినియోగిస్తున్నారు. 185 అభ్యర్థులు, ఒక నోటా ఆప్షన్‌కు బ్యాలెట్‌లో చోటు కల్పించడానికి ఒక్కో కంట్రోల్ యూనిట్‌కు 12 బ్యాలెట్ యూనిట్లతో పాటు వీవీ ప్యాట్ యంత్రాలను అనుసంధానం చేసి ఎన్నికలు నిర్వహించబోతున్నారు. దేశ చరిత్రలో నాలుగుకు మించి బ్యాలెట్ల యూనిట్లను వాడడం ఇదే తొలిసారి. ఇంత పెద్ద సంఖ్యలో ఈవీఎం యంత్రాలను సిద్ధం చేయడానికి 600 మంది ఇంజనీర్లు, అధికారులు 6 రోజులుగా రాత్రింబవళ్లు శ్రమించారని రజత్ కుమార్ తెలిపారు. ఇక్కడ ఈవీఎంలు సరిగ్గా పనిచేస్తాయా? లేదా? అన్నదానిపైనే సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
ప్లీజ్ వచ్చి ఓటేయండి!
ఓటు ప్రజాస్వామ్య హక్కు అని, ఓటు వేయడం ప్రతి పౌరుడి బాధ్యత అని రజత్‌కుమార్ పేర్కొన్నారు. ప్రతి పౌరుడు పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటేయాలని విజ్ఞప్తి చేశారు. ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా స్వేచ్ఛగా, ఆత్మప్రబోధం మేరకు ఓటు హక్కును వినియోగించాలని పిలుపునిచ్చారు.
కేవలం ఓటరు స్లిప్పుతో ఓటేయలేరు ..
కేవలం ఓటరు స్లిప్పుతో వచ్చి ఓటర్లు ఓటేయలేరని, కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన 13 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి ఉంటేనే ఓటేసేందుకు అనుమతిస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) రజత్‌కుమార్ స్పష్టం చేశారు. ఓటరు స్లిప్పు కేవలం ఆహ్వానపత్రం మాత్రమేనని, అదే ఓటరు గుర్తింపుకార్డు కాదన్నారు. ఓటరు వివరాలు, పోలింగ్ స్టేషన్ చిరునామా తెలపడమే ఓటరు స్లిప్పుల ఉద్దేశమన్నారు. ప్రతి ఓటరు తమ ఓటరు గుర్తింపు కార్డు (ఎపిక్ కార్డు) లేదా కింద పేర్కొన్న 12 రకాల గుర్తింపు కార్డులను ఎన్నికల కేంద్రానికి తీసుకొచ్చి ఓటు హక్కును వినియోగించుకోవచ్చని తెలిపారు. ఓటరు గుర్తింపు కార్డు ఉన్నంత మాత్రాన.. ఓటరు జాబితాలో పేరు లేకపోతే ఓటువేయలేరన్నారు. ప్రతి ఓటరు జాబితాలో తమ పేరు ఉందో లేదో తనిఖీ చేసుకుని పోలింగ్ కేంద్రానికి వెళ్లాలన్నారు.
వీటిలో ఏదైనా ఒక ధ్రువీకరణ కార్డును వెంట తీసుకెళ్లాలి
ఆధార్ కార్డు, పాస్‌పోర్టు, పాన్‌కార్డు, డ్రైవింగ్ లైసెన్స్
కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వాలు/ప్రభుత్వ రంగ సంస్థలు/ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలు జారీ చేసిన ఉద్యోగి ఫోటో గుర్తింపు కార్డు
బ్యాంకులు/తపాల కార్యాలయం జారీ చేసిన ఫోటో పాస్‌బుక్ , ఆర్జీఐ/ఎన్‌పీఆర్ జారీ చేసిన స్మార్ట్‌కార్డు
ఉపాధి హామీ జాబ్ కార్డు , కేంద్ర కార్మిక శాఖ జారీ చేసిన హెల్త్ ఇన్‌స్రూ?న్స్ స్మార్ట్ కార్డు
ఫోటో కలిగిన పింఛను డాక్యుమెంట్ , ఎన్నికల యంత్రాంగం జారీ చేసిన ఫోటో ఓటరు స్లిప్
ఎంపీలు/ఎమ్మెల్యే/ఎమ్మెల్సీలకు జారీ చేసిన అధికారిక గుర్తింపు కార్డులు
మీ పోలింగ్ కేంద్రం తెలుసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారా? ఈ కింది పేర్కొన్న ఏదైన ఓ పద్ధతి ద్వారా తెలుసుకోవచ్చు.
9223166166 నంబర్‌కు 'TS VOTE VOTER ID NO' నమూనాలో ఎస్సెమ్మెస్ పంపితే మీ మొబైల్ ఫోన్‌కు పోలింగ్ కేంద్రం చిరునామా రానుంది.
(ఉదాహరణకు 'TS VOTE AB-C1234567').
– 1950 నంబర్‌కు 'ECI VOTERID NO' నమూనాలో ఎస్సెమ్మెస్ పంపితే పోలింగ్ కేంద్రం తెలుసుకోవచ్చు. (ECI ABC1234567)
– స్మార్ట్ ఫోన్‌లో నా ఓట్ (Naa Vote) యాప్‌ను డౌన్‌లోడ్ చేసుని లొకేషన్ చెక్ చేసుకోవచ్చు.
– 1950 టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేసిన తెలుసుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment