సాక్షి, తాడేపల్లిగూడెం : తాడేపల్లిగూడెం తాలూకా ఆఫీస్ సెంటర్. పట్టణానికి పెద్ద ల్యాండ్ మార్కు. ఎన్నికలొస్తే చాలు. ఇక్కడ సందడే సందడి. తెలుగుతమ్ముళ్ల బెట్టింగులు, సవాళ్లతో ఈ సెంటర్ హోరెత్తేది. పందేలు కాసే వారు ఎవరున్నారు? ఎంతకైనా రెడీ అని చాలెంజ్ చేస్తూ నోట్ల కట్టలతో కలియతిరిగేవారు. బైకులు కొని అమ్మే సంస్థకు చెందిన ఒక వ్యక్తి తాలూకా జనాలు సార్వత్రిక ఎన్నికలైనా, స్థానిక ఎన్నికలైనా పందేల కోసం పచార్లు చేసేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ఈ ఎన్నికల్లో పోలింగ్‌కు ముందు ఇలాంటి సందడి కనిపించినా..
ప్రసుత్తం ష్.. గప్‌చుప్ అన్న విధంగా వాతావరణం మారింది. తొడకొట్టి సవాల్ విసిరేవారు దరిదాపుల్లో కనిపించడంలేదు. ఇది ఒక్క తాడేపల్లిగూడెంలోనే కాదు. జిల్లా అంతా ఇదే పరిస్థితి. పందేల జోరు వైఎస్సార్ సీపీ హాట్ ఫేవరేట్‌గా సాగుతోంది. ఒకటికి రెండు, ఒకటికి మూడు అన్నవిధంగా వైఎఎస్సార్ సీపీ విజయం కేంద్రంగా పందేలు కాస్తున్నారు. వైఎస్సార్ సీపీ గెలిస్తే రూ.లక్ష, ప్రత్యర్థి గెలిస్తే రూ.రెండు, మూడులక్షలు ఇచ్చేలా పందేలు సాగుతున్నాయి. జిల్లాలో ఈ తరహా పందాలు ఉంగుటూరు నియోజకవర్గం నుంచి ప్రారంభమైనట్టుగా చెబుతున్నారు. ప్రస్తుతం జిల్లాలో హాట్ సీట్‌గా ఉంగుటూరు నియోజకవర్గం ఉంది. ఇక్కడ వైఎస్సార్ సీపీ ఘన విజయం సాధిస్తుందనే మాట అన్ని పార్టీల నుంచీ వినిపిస్తోంది.
వైఎస్సార్ సీపీకి 10–12
పోలింగ్ జరిగాక జిల్లాలో పరిస్థితి పూర్తిగా మారిందని సమాచారం. వైఎస్సార్ సీపీ గెలిచే సీట్లపై పందేలు జోరందుకున్నాయి. ఆ పార్టీ 10 నుంచి 12 సీట్ల దాకా సాధిస్తుందని పందేలు జరుగుతున్నాయి. ఇతర పార్టీలకు మూడు సీట్లు వస్తాయని బెట్టింగులు జరుగుతున్నాయి. పోలింగ్ తర్వాత వైఎస్సార్ సీపీ విజయావకాశాలు క్లియర్ క్లిస్టల్‌గా కనపడుతుండటంతో ఈ మేరకు పందేల క్రమం మారిందని సమాచారం.
ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాక మరింత జోరు
ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాక పందేల జోరు మరింత పెరిగింది. నియోజకవర్గాల వారీగా అభ్యర్థుల బలాలను అనుసరించి పోలైన ఓట్లలో ఎంత శాతం ఓట్లు ఏయే అభ్యర్థులు సాధిస్తారనే విషయాలపైనా పందేలు జరుగుతున్నాయి. గ్రామాలవారీగా, బూత్‌ల వారీగా కూడా పందేలు జరుగుతున్నాయంటే బెట్టింగుల జోరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఐపీఎల్ సీజన్‌లో ఎన్నికల పందేలు కాస్త తగ్గినట్టుగా కనిపించాయి. రెండు రోజుల నుంచి ఎగ్జిట్‌పోల్స్ ఫలితాలు వెలువడ్డాక ఈ జోరు మరింత పెరిగింది.
తెలుగు తమ్ముళ్లలో నిస్తేజం
ఎగ్జిట్ పోల్స్ తర్వాత తెలుగు తమ్ముళ్లలో నిస్తేజం పూర్తిగా అలుముకుంది. అంతకుముందు కూడా ఆచితూచి పందేలు వేసిన వారు ఇప్పుడు పూర్తిగా నోరెళ్లబెట్టేశారు. జూదాలను ప్రవృత్తిగా ఎంచుకున్న వారు కూడా ఇప్పుడు పందేలకు జంకుతున్నారు.
పవన్ కల్యాణ్‌పై మాత్రం పందేలు
కానీ పవన్ కల్యాణ్ భీమవరంలో గెలుస్తాడా.. ఓడిపోతారా అనేదానిపైనా , గాజువాకలో ఫలితం పవన్‌కు అనుకూలమా , ప్రతికూలమా .. జనసేనకు సీట్లు ఎన్ని వస్తాయి. ఒకటి నుంచి ఐదు. ఐదు నుంచి 20 అంటూ మాత్రం తెలుగుతమ్ముళ్లు పందేలు కాస్తున్నట్టు సమాచారం. వీటివిషయంలో జిల్లాలోని తమ్ముళ్లు ఎక్కువగా తూర్పు గోదావరి జిల్లా వాసులతో అధికంగా పందేలు కాస్తున్నట్టు తెలుస్తోంది. టీడీపి ఓటింగ్‌తోపాటు. జనసేన అభ్యర్థులకు జిల్లాలోని రెండు మూడు నియోజకవర్గాలలో పడే ఓట్ల శాతంపైనా జోరుగా పందేలు సాగుతున్నాయి.
గ్రామాల్లో ఆధిక్యతలపైనా పందేలు
నియోజకవర్గాలలో విజయాలపై కాకుండా గ్రామాల్లో ఆధిక్యతలపైనా పందేలు జోరు అందుకున్నాయి. గత ఎన్నికల్లో టీడీపీకి తిరుగులేని ఆధిక్యం తెచ్చిపెట్టిన గ్రామాల్లో , మండలాల్లో మెజార్టీలపైనా పందేలు సాగుతున్నాయి. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో పెదతాడేపల్లి గ్రామంలోని బూత్‌లలో టీడీపీకి 1200 ఓట్ల టీడీపికి ఆధిక్యం వస్తుందని, కాదు ఆధిక్యత తగ్గుతుందనే దానిపై పందేలు కాసినట్టు సమాచారం.
ఓటుకు లక్ష !
ఇదిలా ఉంటే జిల్లాలో ఒక గ్రామంలో వైఎసాŠస్‌ర్ సీపీకి లభించే మెజార్టీ ప్రతీ ఓటుకు రూ.లక్ష ఇచ్చేలా విచిత్ర పందెం ఒకటి జరిగినట్టు ప్రచారం ఉంది. ఎన్ని ఓట్లు ఆ గ్రామంలో వైఎస్సార్ సీపీకి ఆధిక్యం వస్తే అన్ని లక్షల రూపాయలు అవతలవ్యక్తి ముట్టజెప్పాల్సిందే.
రాష్ట్రంలో 100–120 వరకూ పందేలు
రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీకి వచ్చే సీట్లు సెంచరీ దాటుతాయని, 120 వస్తాయని పందేలు జరుగుతున్నాయి. 120 కంటే తక్కువ అంటే 119 వచ్చినా, ఇవతలి పక్షానికి సొమ్ములు చెల్లించేలా కూడా విచిత్ర పందేలు సాగుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment