సాక్షి, హైదరాబాద్: ఉగ్రవాదం, వామపక్ష తీవ్రవాదం నిర్మూలన ఆపరేషన్లలో భాగమైన ఏపీ పోలీసు సిబ్బంది తెలంగాణలో సంచరించడం చట్ట వ్యతిరేకం కాదని ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ స్పష్టం చేశారు. ఒకవేళ విధులతో సంబంధం లేకుండా ఏవైనా చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లు ఆధారాలుంటే వారిపై చర్యలు తీసుకోవచ్చని పేర్కొన్నారు. తెలంగాణ శాసనసభ ఎన్నికల నేపథ్యంలో జగిత్యాల జిల్లా ధర్మపురి, మంచిర్యాలలో ఏపీ ఇంటెలిజెన్స్ సిబ్బంది సర్వే నిర్వహిస్తూ పట్టుబడిన ఉదంతాలపై వివరణ కోరుతూ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి (సీఈఓ) రజత్‌కుమార్ జారీ చేసిన నోటీసులకు ఏపీ డీజీపీ సమాధానమిచ్చారు.
ఈ ఘటనలపై విచారణ జరిపించామని, ధర్మపురి, మంచిర్యాలలో పట్టుబడింది తమ రాష్ట్ర ఇంటెలిజెన్స్ సిబ్బందేనని తెలిపారు. తమ రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగం కానిస్టేబుళ్లను వామపక్ష తీవ్రవాదానికి సంబంధించిన రహస్య పనిపై నియమించామన్నారు. ఈ కానిస్టేబుళ్లు డబ్బులు పంచుతూ పట్టుబడ్డారని వచ్చిన ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదని, వారి వద్ద డబ్బు కూడా లేదని వెల్లడించారు. వారిని స్థానికులు చట్ట విరుద్ధంగా అటకాయిస్తే వారే స్థానిక పోలీసుల జోక్యాన్ని కోరారని తెలిపారు. విచారణ తర్వాత ఎలాంటి తప్పు కనిపించకపోవడంతో పోలీసులు వారిని విడిచిపెట్టారన్నారు. ఏపీ ప్రభుత్వానికి చెందిన ముఖ్యమైన వ్యక్తులు, ఆస్తుల పరిరక్షణ కోసం తమ రాష్ట్ర పోలీసు శాఖకు సంబంధించిన పలు విభాగాలు హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్నాయని, ఉగ్రవాదం, వామపక్ష తీవ్రవాదం నిర్మూలనకు తమ విభాగాలను దేశంలోని వివిధ ప్రాంతాల్లో సైతం మోహరించామన్నారు.
ఎన్నికల సర్వే కోసమే..: రాష్ట్ర డీజీపీ
శాసనసభ ఎన్నికల దృష్ట్యా ఏపీ ఇంటెలిజెన్స్ సిబ్బంది ధర్మపురి నియోజకవర్గంలో మహాకూటమి అభ్యర్థుల గెలుపోటమలపై సర్వే నిర్వహిస్తూ పట్టుబడ్డారని తమ విచారణలో తేలిందని తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డి తెలిపారు. ఏపీ ఇంటెలిజెన్స్ సిబ్బంది పట్టుబడిన ఉదంతంపై సీఈఓ రజత్‌కుమార్‌కు ఆయన నివేదిక సమర్పించారు. పట్టుబడిన సిబ్బంది వద్ద గుర్తింపు కార్డులు లేవని, వారి ఫోన్ నంబర్లు ఏపీ అదనపు డీజీపీ పేరు మీద రిజిస్టరై ఉన్నాయని వెల్లడించారు. వారి వద్ద నుంచి ఎలాంటి నగదును స్వాధీనం చేసుకోలేదన్నారు.
ధర్మపురి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి జాడి బాల్‌రెడ్డి స్థానిక టీటీడీ సత్రంలో ఆరు మందికి వసతి కల్పించారని, మూడు బైకులను సైతం సమకూర్చారని తదుపరి విచారణలో తేలిందని డీజీపీ మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. మహాకూటమి తరఫున ధర్మపురిలో పోటీ చేసేందుకు టికెట్లు ఇస్తే టీడీపీ ఇన్‌చార్జి బాల్‌రెడ్డి, కాంగ్రెస్ ఇన్‌చార్జి లక్ష్మణ్‌కుమార్‌ల గెలుపునకు ఉన్న అవకాశాలపై సర్వే చేసేందుకే ముగ్గురు ఏపీ ఇంటెలిజెన్స్ సిబ్బంది వచ్చినట్లు డీజీపీ మహేందర్‌రెడ్డి తేల్చారు. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు డబ్బులు పంచిపెట్టినట్లు ఏ ఆధారాలు లభించలేదన్నారు.
ఈసీ చర్యలెంటో?
రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో మహాకూటమి అభ్యర్థులకు అనుకూలంగా ఓటర్లను ప్రభావితం చేసేందుకు ఏపీ ఇంటెలిజెన్స్ సిబ్బంది డబ్బులు పంచిపెడుతూ పట్టుబడ్డారని టీఆర్‌ఎస్ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడంతో ఈసీ రెండు రాష్ట్రాల డీజీపీల నుంచి నివేదికలు తెప్పించుకుంది. ఏపీ ఇంటెలిజెన్స్ సిబ్బంది సర్వే జరుపుతూ పట్టుబడ్డారని తెలంగాణ డీజీపీ నివేదిక ఇచ్చిన నేపథ్యంలో ఎన్నికల సంఘం తీసుకోనున్న చర్యలపై ఆసక్తి నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment