
సాక్షి, హైదరాబాద్: ఓటు వేయడంలో నిర్లిప్తత ప్రదర్శించే యువత రేపు ప్రభుత్వం తమ ఆకాంక్షలను పట్టించుకోవడం లేదని ఎలా ప్రశ్నించగలదని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ ప్రశ్నించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాణిజ్య, పరిశ్రమల సమాఖ్య(ఫ్యాప్సీ) సోమవారం హైదరాబాద్‌లో నిర్వహించిన ఒక సదస్సులో మాట్లాడారు. ‘అక్కడి దాకా ఎందుకు... ఓటువేయని వాణిజ్య, వ్యాపార వర్గాలవారు నైతికంగా ప్రభుత్వాల నుండి సానుకూల విధానాలను ఎలా ఆశించగలరో చెప్పండి’అని ప్రశ్నించారు. ‘ఒక ఉత్తరాది రాష్ట్రంలో ఒక అభ్యర్థి కేవలం ఒక్క ఓటు తేడాతో గెలిచి, తరువాత కేంద్రమంత్రి కూడా అయ్యారు. అంటే, ఈ దేశ ప్రజల తలరాతను రాసే నిర్ణయాలు తీసుకునే యంత్రాంగంలో ఒక భాగమయ్యారు. ఒక్క ఓటు కూడా విలువైనదే.
అందుకే యువతీయువకులను, వ్యాపారులను, పారిశ్రామికవేత్తలను ... అన్నివర్గాలను తప్పనిసరిగా ఓటేయండని ప్రాధేయపడుతున్నాం. కుంటిసాకులు చెప్పి పట్టణ, నగరాల్లోని ఎగువ మధ్య తరగతివారు, చదువుకున్నవారు, సంపన్న వర్గాలవారు ఓటింగ్‌కు దూరంగా ఉంటున్నారు. ఇది మంచి పరిణామం కాదు. మీరు వేసే ఓటు అందరి బాగు కోసం ఉద్దేశించినది. యువతగా భవిష్యత్తులో ఎక్కువపాత్ర మీదే కదా, మీ నుంచే కొత్త తరం నాయకులు, ఆదర్శ నాయకులు పుట్టుకు రావాలి కదా !’’అని అన్నారు. ‘‘మీలో ఎంత మందికి ఓటు ఉంది, చేతులెత్తండి.’’అన్నప్పుడు కొద్దిమంది మాత్రమే చేతులెత్తడంతో ఆయన కొంత నిరుత్సాహపడ్డారు.
జనవరిలో ఓటు నమోదు చేసుకోవచ్చు...
‘కొత్తవారికి ఓటు హక్కు నమోదు చేయడానికి ఎంతో కృషి చేశాం. ఎన్నోసార్లు విజ్ఞప్తి చేశాం. గడువులు కూడా పొడిగిస్తూ ఎన్నోసార్లు అవకాశం కల్పించాం. ఫరవాలేదు. ఇప్పటికయినా మించి పోయిందేమీ లేదు. వచ్చే జనవరిలో ఓటర్ల జాబితా సవరణ జరిగినప్పుడు తప్పనిసరిగా ఓటరుగా నమోదుకండి. గత సెప్టెంబర్ 6 నుంచి నవంబర్ 19వ తేదీల మధ్య దాదాపు 20 లక్షల మంది కొత్త ఓటర్లుగా నమోదయ్యారు. వీరు రేపు ఎన్నికల ఫలితాలను తారుమారు చేయగలరు కూడా. ప్రజాస్వామ్యం పదికాలాలపాటు పరిఢవిల్లాలంటే ఇటువంటి మార్పు, ఈ చైతన్యం పెద్దఎత్తున రావాలి.’’అని రజత్‌కుమార్ ఉద్బోధించారు.
పోటీలో ఉన్న అభ్యర్థులెవరూ నచ్చకపోతే ‘నోటా’బటన్ అయినా నొక్కితే, మీ నియోజకవర్గ అభ్యర్థికి మెజారిటీ తగ్గి, తన మీద ప్రజల విశ్వాసం తగ్గిపోతున్నదని తెలుసుకుని జాగ్రత్తపడతారని, బాధ్యతగా వ్యవహరిస్తారని పేర్కొన్నారు. అభ్యర్థుల్లో కూడా మంచివారిని వడగట్టడం కోసం, వారెటువంటివారో ఓటర్లు తెలుసుకోవడం కోసం నేరచరిత్ర ఉన్న అభ్యర్థులు తప్పనిసరిగా పత్రికల్లో, వార్తా చానల్‌లో ఒకటికి మూడుసార్లు బాగా కనిపించేలా ప్రకటనలు ఇవ్వాలని ఆదేశించామని ఆయన వివరించారు. కార్యక్రమంలో సమాఖ్య అధ్యక్షుడు సి.ఎ.అరుణ్ లుహరుకా, ఉపాధ్యక్షుడు రమాకాంత్ తదితరులు పాల్గొన్నారు.