
హైదరాబాద్: ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయ డం అసాధ్యమని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి(సీఈవో) రజత్‌కుమార్ స్పష్టంచేశారు. సాంకేతికంగా ఎంతో కట్టుదిట్టమైన భద్రతతో ఈవీఎంలను రూపొందించారన్నారు. అణుబాంబు వేసినా ఈవీఎంలు భద్రంగా ఉంటా యని తెలిపారు. బుధవారం హోటల్ టూరిజం ప్లాజాలో ఎన్నికల ప్రక్రియ విధానంపై ‘రేడియో జాకీలకు’అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రజత్‌కుమార్ మాట్లాడుతూ.. ప్రజలు రేడియో కార్యక్రమాలను ఆదరిస్తున్నారని, దీంతో రేడియో జాకీలుగా విధులు నిర్వహిస్తున్నవారు ఓటర్లను చైతన్యపరిచి ఓటరుగా తమ పేర్లను నమోదు చేసుకుని, ఓటుహక్కు ను వినియోగించుకునేలా చూడాలన్నారు. ప్రతి ఒక్కరూ ఓటరుగా ఎలా నమోదు కావాలి.. ఓటరు జాబితాలో పేర్లు, చిరునామాల్లో తప్పులు ఉంటే వాటిని ఎలా సరిచేసుకోవాలి వంటి పలు అంశాలపై ఓటర్లకు అవగాహన కల్పించాలని కోరారు.
అర్బన్‌లో పోలింగ్ తక్కువ..
హైదరాబాద్‌లో పోలింగ్ శాతం తగ్గిందని, దానిని పెంచేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు రజత్ కుమార్ చెప్పారు. నక్సలైట్ల ప్రభావం అధికంగా ఉన్న ఛత్తీస్‌గఢ్‌లో 76 శాతం పోలింగ్ నమోదు అయిందని, తెలంగాణలో మాత్రం 73.4 శాతమే నమోదు అయిందన్నారు. అర్బన్ ప్రాంతాల్లోనూ పోలింగ్ శాతం పెరగాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి ఒక్కరూ ఓటుహక్కును వినియోగించుకోవడం తమ బాధ్యతగా భావించాలన్నారు. అనంతరం జీహెచ్‌ఎంసీ అడిషనల్ కమిషనర్ ముషారఫ్ ఈవీఎంలు, వీవీప్యాట్‌ల పనితీరును రేడియో జాకీలకు వివరించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ సీఈఓలు అమ్రపాలి, రవికిరణ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment