ఈ ఏడాదే ఎన్నికలు! | State Chief Electoral Officer Rajat Kumar about elections | Sakshi
Sakshi News home page

ఈ ఏడాదే ఎన్నికలు!

Published Fri, Sep 28 2018 3:02 AM | Last Updated on Thu, Jul 11 2019 8:26 PM

State Chief Electoral Officer Rajat Kumar about elections - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర శాసనసభ రద్దయిన నేపథ్యంలో ఈ ఏడాదే (2018) అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌ కుమార్‌ స్పష్టం చేశారు. వచ్చే నెల 4వ తేదీలోగా ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాల(ఈవీఎం)ను, 8వ తేదీన ఓటర్ల జాబితాను సిద్ధం చేస్తామన్నారు.

మిగతా రాష్ట్రాల్లో మూడు నెలల సమయంలో ఎన్నికలకు ఏర్పాట్లు చేస్తారని, కాని ఇక్కడ అకస్మాత్తుగా రాష్ట్ర శాసనసభ రద్దు కావడంతో అతి తక్కువ సమయంలో ఎన్నికలకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఈ ఏర్పాట్లపై కేంద్ర ఎన్నికల సంఘం సంతృప్తి చెందితే ఎన్నికల నిర్వహణపై నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. ఎన్నికల తేదీలపై పత్రికల్లో వస్తున్న వివిధ కథనాల్లో వాస్తవం లేదని పేర్కొన్నారు. ఎన్నికల షెడ్యూల్‌పై ఇంకా ఎలాంటి నిర్ణయం జరగలేదని పునరుద్ఘాటించారు.

సచివాలయంలో గురువారం ఎలక్షన్‌ మీడియా సెల్‌ను ప్రారంభించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ముందస్తు ఎన్నికల నిర్వహణ కోసం ఈ నెల 10 నుంచి చేపట్టిన ఓటర్ల జాబితా రెండో ప్రత్యేక సవరణ కార్యక్రమం కింద కొత్త ఓటర్ల నమోదు, అభ్యంతరాల స్వీకరణకు ఈ నెల 25తో గడువు ముగిసిపోగా, ఈ వ్యవధిలో 13,15,234 దరఖాస్తులు, అభ్యంతరాలొచ్చాయన్నారు.రోజుకు లక్ష చొప్పున దరఖాస్తులొచ్చాయని, ఈ విషయంలో మంచి స్పందన లభించిందని సంతృప్తి వ్యక్తం చేశారు.

అంతకు చేపట్టిన సవరణ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 9వ తేదీ నాటికి 15,43,520 దరఖాస్తులు, అభ్యంతరాలొచ్చాయన్నారు. మొత్తం కలిపి దరఖాస్తులు, అభ్యంతరాల సంఖ్య 28,58,754కు పెరిగిందని, అందులో ఇప్పటి వరకు 12,04,654 దరఖాస్తులను స్వీకరించామని, 1,64,996 దరఖాస్తులను తిరస్కరించామని వివరించారు. మిగిలిన 14,89,104 దరఖాస్తులను షెడ్యూల్‌ ప్రకారం వచ్చే నెల 4లోగా పరిష్కరిస్తామని తెలిపారు.

ఈఆర్వో నెట్‌ సాఫ్ట్‌వేర్‌ ఆధారంగా 2,61,327 డూప్లికేట్‌ ఓటర్లను గుర్తించామని, క్షేత్ర స్థాయి పరిశీలన తర్వాత వాటిని తొలగిస్తామని చెప్పారు. 2,68,365 మంది చనిపోయిన ఓటర్లను గుర్తించామని, పరిశీలన అనంతరం ఇప్పటివరకు 77,499 మంది ఓటర్లను తొలగించామని అన్నారు. తక్కువ సమయమిచ్చినా ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్న జిల్లా కలెక్టర్లకు రజత్‌ కుమార్‌ ప్రత్యేక అభినందనలు తెలిపారు.  

తీరిన ముంపు మండలాల సమస్య..
రాష్ట్ర పునర్విభజన నేపథ్యంలో భద్రాద్రి జిల్లా నుంచి ఏపీలో విలీనమైన ఏడు ముంపు మండలాల డీలిమిటేషన్‌ సమస్య తీరిపోయిందని రజత్‌ కుమార్‌ వెల్లడించారు. ఈ మండలాలకు సంబంధించిన 1,22,335 మంది ఓటర్లను 2015లోనే ఏపీలోని రెండు శాసనసభ నియోజకవర్గాలకు బదిలీ చేశామన్నారు.

ఈ మేరకు ఏపీలోని ఈ రెండు శాసనసభ నియోజకవర్గాల పునర్విభజనకు ఏపీ ప్రభుత్వం గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేయడంతో రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణకు ముంపు మండలాల సమస్య పూర్తిగా పరిష్కారమైందన్నారు. రాష్ట్రంలో శాసనసభ నియోజకవర్గాల పునర్విభజన జరపాలని గతంలో చేసిన ప్రతిపాదనలను కేంద్ర ఎన్నికల సంఘం తిరస్కరించిందని, మళ్లీ కొత్త ప్రతిపాదనలేవీ చేయలేదని స్పష్టంచేశారు.  

ఈవీఎంలు వచ్చేశాయి..
ఈవీఎంల సంసిద్ధతపై పరిశీలన చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అధికారి అరుణ్‌ శర్మ రాష్ట్ర పర్యటనకు వస్తున్నారని రజత్‌ కుమార్‌ పేర్కొన్నారు. వచ్చే నెల 4 నాటికి ఈవీఎంలను ఎన్నికలకు సిద్ధం చేస్తామన్నారు. రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణకు అవసరమైన బ్యాలెట్, కంట్రోల్‌ యూనిట్లు వచ్చాయని అదనపు ఎన్నికల ప్రధాన అధికారి జ్యోతి బుద్ధప్రకాశ్‌ తెలిపారు. వీవీపాట్‌ యూనిట్లు 76 శాతం వచ్చాయన్నారు. ఈవీఎంల ప్రథమ స్థాయి పరీక్ష (ఎఫ్‌ఎల్‌సీ)లను గురువారం అన్ని జిల్లాల్లో ప్రారంభించామన్నారు. తొలిసారిగా వినియోగిస్తున్న వీవీపాట్‌ పట్ల ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement