సాక్షి, హైదరాబాద్ : ఈవీఎంలలో సాంకేతిక వినియోగంపై రాజకీయ పార్టీలకు ఎలాంటి ఆందోళన అవసరం లేదని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ మరోసారి స్పష్టం చేశారు. ఇప్పటికే 85 శాతంపైగా ఈవీఎంల తనిఖీ పూర్తయిందని, ఈ నెల 4లోగా అన్ని జిల్లాల్లో తనిఖీలు పూర్తవుతాయని వెల్లడించారు. ఈసారి ఎన్నికల్లో ఈవీఎంలతోపాటు కొత్తగా వీవీపాట్ యంత్రాలను వినియోగిస్తున్న నేపథ్యంలో ఓటర్లకు అవగాహన కల్పించేందుకు రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో రాష్ట్ర స్థాయి మాక్ పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
ఆ కేంద్రాన్ని లాంఛనంగా ప్రారంభించిన రజత్ కుమార్.. ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని రకాలుగా సిద్ధమైనట్లు తెలిపారు. వీవీప్యాట్ యంత్రాల పనితీరు, సాంకేతిక సమస్యలు-పరిష్కారాలను వివరించారు. దేశంలో ఎంతో నమ్మకమైన బీహెచ్ఈఎల్, ఈసీఐఎల్ వంటి సంస్థలు వీవీప్యాట్ లను తయారు చేశాయని, ఎన్నికల్లో వినియోగించే సాంకేతికతపై తమకు పూర్తి విశ్వాసం ఉందని రజత్ కుమార్ తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో 10 మొబైల్ వాహనాల ద్వారా వీవీపాట్ యంత్రాలపై ప్రజలకు అవగాహన కల్పించనున్నట్లు చెప్పారు. అలాగే కేంద్ర ఎన్నికల సంఘం సీ-విజిల్ అనే ప్రత్యేక యాప్ ను రూపొందించిందని, ఎన్నికల సమయంలో ప్రజలు అందులో అక్రమాలపై నేరుగా ఫిర్యాదు చేయవచ్చని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment