ఈవీఎంల హ్యాక్‌ అసాధ్యం | Rajat Kumar Says EVMs Hacking is Impossible At Workshop | Sakshi
Sakshi News home page

ఈవీఎంల హ్యాక్‌ అసాధ్యం

Published Sat, Mar 2 2019 3:09 AM | Last Updated on Sat, Mar 2 2019 3:57 AM

Rajat Kumar Says EVMs Hacking is Impossible At Workshop - Sakshi

సమావేశంలో మాట్లాడుతున్న రజత్‌కుమార్‌

సాక్షి, హైదరాబాద్‌: ఈవీఎంలను హ్యాక్‌ చేయడం అసాధ్యమని సీఈవో రజత్‌కుమార్‌ స్పష్టం చేశారు. ఓటింగ్‌ యంత్రాల పనితీరుపై అనుమానాలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. శుక్రవారం ఇక్కడ ‘లోక్‌సభ జనరల్‌ ఎలక్షన్స్‌– మీడియా మానిటరింగ్‌ అండ్‌ మీడియా మేనేజ్‌మెంట్‌’అనే అంశంపై నిర్వహించిన వర్క్‌షాప్‌లో ఆయన మాట్లాడారు. ఈసీ నిబంధనల ప్రకారంగా ఎన్నికల నిర్వహణ, ఫలితాల వెల్లడి అంశాలకే యంత్రాంగం పరిమితమవుతుందన్నారు. ఎన్నికల సమయంలో ఈసీ నియమించే ఎన్నికల పరిశీలకులు, ఎన్నికల వ్యయ పరిశీలకులు తమ పరిధిలోకి రారని, నేరుగా ఈసీకే వారు నివేదికలు అందజేస్తారని వివరించారు. ఎన్నికల సమయంలో ప్రింట్, ఎలక్ట్రానిక్‌ మీడియా అనుసరించాల్సిన పద్ధతుల గురించి జిల్లా ఎన్నికల అధికారులు దానకిషోర్‌(హైదరాబాద్‌), రోనాల్డ్‌రాస్‌(మహబూబ్‌నగర్‌), డీఎస్‌ లోకేష్‌కుమార్‌(రంగారెడ్డి), అదనపు ఎన్నికల ప్రధానాధికారి జ్యోతి బుద్ధప్రకాష్, జాయింట్‌ సీఈవోలు ఆమ్రపాలి, రవికిరణ్, పీఐబీ అడిషనల్‌ డైరెక్టర్‌ జనరల్‌ టీవీకే రెడ్డి వివరించారు.  

వీవీ ప్యాట్‌ స్లిప్స్‌కు ఐదేళ్ల భద్రత: రోనాల్డ్‌ రాస్‌  
వీవీప్యాట్‌ స్లిప్పులను ఐదేళ్లపాటు భద్రపరిచే పద్ధతి ఉందని మహబూబ్‌నగర్‌ డీఈవో రోనాల్డ్‌ రాస్‌ తెలిపారు. ఈవీఎంల సాంకేతికత, వాటి పనితీరు, భద్రతా ప్రమాణాల అంశాలను ఆయన పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు. లోక్‌సభ ఎన్నికలకు కొత్తగా వచ్చే ఎం3 ఈవీఎంలు సాంకేతికంగా పటిష్టంగా ఉన్నాయని తెలిపారు. పోలింగ్‌ రోజున క్యూలో ఉన్న వారందరికీ ఓటు వేసే సదుపాయం కల్పించే క్రమంలో అర్ధరాత్రి 12 దాటితే ఎం3 ఈవీఎం క్లోజింగ్‌ బటన్‌ ఆటోమేటిక్‌గా క్లోజ్‌ అవుతుందన్నారు. ఈవీఎంలను హ్యాక్‌ చేయడం అసాధ్యమని, దీనిపై ఈసీ బహిరంగ సవాల్‌ చేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. దానకిషోర్‌ మాట్లాడుతూ హైదరాబాద్‌లో విద్యావంతులు, ఉద్యోగులు ఓటు హక్కును వినియోగించుకునేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నా ఆశించిన మేరకు పోలింగ్‌ నమోదు కాకపోవడంపై విచారం వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బోగస్‌ ఓట్ల నమోదుకు సంబంధించి విచారణ అంశాలు పలు దశల్లో ఉన్నాయని తెలిపారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement