ఈవీఎంలపై అనుమానాలు బలపర్చిన హర్యానా ఫలితాలు! | KSR comments on the doubts about EVMs, which have strengthened the results in Haryana | Sakshi
Sakshi News home page

ఈవీఎంలపై అనుమానాలు బలపర్చిన హర్యానా ఫలితాలు!

Published Thu, Oct 10 2024 12:16 PM | Last Updated on Thu, Oct 10 2024 1:11 PM

KSR comments on the doubts about EVMs, which have strengthened the results in Haryana

ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మెషీన్లు (ఈవీఎం)లపై మళ్లీ చర్చ మొదలైంది. హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తారుమారు కావడంతో కాంగ్రెస్‌ పార్టీ ఈవీఎంల ట్యాంపరింగ్‌ అంశాన్ని మళ్లీ తెరపైకి తెచ్చింది. ఈ ఫలితాలను అంగీకరించేది లేదని ఆ పార్టీ సీనియర్‌ నేత జైరామ్‌ రమేశ్‌ ఇప్పటికే స్పష్టం చేసిన విషయం తెలిసిందే. పార్టీ వైఖరికి తగ్గట్టుగానే కాంగ్రెస్‌ శ్రేణులు దేశవ్యాప్తంగా ఈవీఎంలపై తమ వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నాయి. హర్యానా ఎన్నికల సందర్భంగా ఈవీఎంల బ్యాటరీ ఛార్జింగ్‌లో కనిపించిన తేడాను విసృ‍్తతంగా ప్రచారం చేస్తున్నారు వీరు. కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించిన చోట్ల ఈవీఎంల బ్యాటరీ ఛార్జ్‌ 70 శాతం మాత్రమే ఉంటే.. బీజేపీ గెలిచిన స్థానాల్లో 99 శాతం ఉండటం ఎలా సాధ్యమని కాంగ్రెస్‌ పార్టీ ప్రశ్నిస్తోంది. ఇదే విషయాన్ని కేరళ కాంగ్రెస్ నేతలు సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

హిస్సార్, మహేంద్ర ఘడ్, పానిపట్ జిల్లాలలో ఈవీఎం బ్యాటరీల ఛార్జింగ్‌ 99 శాతం ఉందని కాంగ్రెస్ గుర్తించింది. అంటే ఇక్కడ ఈవీఎంల టాంపరింగ్ జరిగిందన్న అభియోగాన్ని మోపుతున్నారు. నౌమాల్ అనే శాసనసభ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి నరేంద్ర సింగ్ ఈవీఎంల బాటరీ ఛార్జింగ్‌పై అభ్యంతరం చెబుతూ రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు కూడా. తొమ్మిది ఓటింగ్ యంత్రాల నెంబర్లు  ఇస్తూ, వాటిలో బ్యాటరీ ఛార్జింగ్‌ 99 శాతం ఎలా ఉందంటూ ప్రశ్నించారు. దీనిని బట్టి ఎంపిక చేసుకున్న కొన్ని పోలింగ్‌ కేంద్రాల్లో టాంపరింగ్ జరిగిందన్న అనుమానాన్ని కాంగ్రెస్ నేతలు వ్యక్తం చేస్తున్నారు. ఇలా జరిగి ఉంటే ప్రజాస్వామ్యానికి అది పెను ప్రమాదమే అవుతుంది. ఎన్నికలు ఒక ఫార్స్‌ గా మిగిలిపోతాయి.

ఎన్నికల కమిషన్ ఇప్పటికే  పూర్తిగా బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందన్న విమర్శలకు గురి అవుతోంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్ సంచలన ట్వీట్ చేశారు. ఏపీలో మాదిరే హర్యానాలో కూడా ఎన్నికల ఫలితం ప్రజలను గందరగోళంలో పడేసిందని వ్యాఖ్యానించారు. అమెరికాతో సహా పలు ప్రజాస్వామ్య దేశాలలో ఈవీఎంలు వాడడం లేదని, పేపర్ బాలెట్‌నే వాడుతున్నారని, దేశంలోనూ పేపర్ బాలెట్ రావాలని ఆయన సూచించారు. ఈ విషయంలో ఆయన దేశానికి మార్గదర్శకత్వం వహించారని అనుకోవాలి.

ఏపీలో ఈవీఎంల టాంపరింగ్‌పై ఇప్పటికే పలు ఆరోపణలు వచ్చాయి. ఆశ్చర్యకరంగా ఈ ఆరోపణలు, అనుమానాలను నివృత్తి చేయాల్సిన కేంద్ర  ఎన్నికల సంఘం, రాష్ట్రంలోని ఎన్నికల అధికారులు కాని ఎలాంటి ప్రయత్నమూ చేయలేదు. పైగా మాక్‌ ఓటింగ్‌ చేస్తామంటూ ప్రజల్లో అనుమానాలు మరింత బలపడేలా వ్యవహరించారు. ఉదాహరణకు ఒంగోలు శాసనసభ నియోజకవర్గంలో కొన్ని పోలింగ్‌ కేంద్రాల్లోని ఈవీఎంల డేటానున వీవీప్యాట్‌ స్లిప్‌లతో పోల్చి చూపాలని వైసీపీ అభ్యర్థి బాలినేని శ్రీనివాస రెడ్డి ఎన్నికల సంఘాన్ని కోరారు. ఇందుకు అవసరమైన ఛార్జీలను కూడా చెల్లించారు. కానీ ఈ పని చేయాల్సిన ఎన్నికల అధికారులు ఆ పిటిషన్‌ను ఉపసంహరించుకునేలా చేసేందుకు ప్రయత్నించారు. అభ్యర్థి అంగీకరించక పోవడంతో కొత్త డ్రామాకు తెరలేపుతూ.. వీవీప్యాట్‌ స్లిప్‌లు లెక్కించబోమని నమూనా ఈవీఎంలో మాక్‌ పోలింగ్‌ జరుపుతామని ప్రతిపాదించారు. ఇందుకు వైసీపీ అభ్యర్థి ససేమిరా అన్నారు. హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ వాదోపవాదాలు జరిగాయి. తీర్పు రిజర్వులో ఉంది. చిత్రంగా రెండు నెలలు అయినా తీర్పు వెలువడలేదు. ఈ పరిణామాలన్నీ  ప్రజల సందేహాలకు మరింత బలం చేకూర్చాయి.

విజయనగరం జిల్లాలో వైసీపీ ఎంపీ అభ్యర్ధి చంద్రశేఖర్, గజపతినగరం అసెంబ్లీ అభ్యర్థి అప్పల నరసయ్యలు కూడా బాలినేని మాదిరిగానే ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేశారు. కానీ ఫలితం మాత్రం తేల లేదు. అధికారులు వీవీప్యాట్‌ స్లిప్‌లు లెక్కించబోమని భీష్మించుకున్నారు. మరోవైపు పోలింగ్‌ జరిగిన రెండు నెలలైనా ఈవీఎంల బ్యాటరీ ఛార్జింగ్‌ 99 శాతం ఉండటంపై వివరణ ఇవ్వాల్సిన భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ (బెల్‌) అధికారులు తమకు ఎన్నికల సంఘం నుంచి ఎలాంటి ఆదేశాలు లేవంటూ తప్పించుకున్నారు. ఈ విషయాలన్నీ ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లోనూ ఈవీఎంల ఏదో మతలబు ఉందని చాలామంది అభిప్రాయపడే స్థితికి కారణమైంది. ఈ నేపథ్యంలోనే వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తెలుగుదేశం పార్టీ ఈవీఎంల మోసానికి పాల్పడిందన్న ఆరోపణలు చేశారు. అందుకు తగ్గ ఉదాహరణలూ ఇచ్చారు. ఈ సందేహాలన్నింటిపై

ఎన్నికల సంఘం తగిన వివరణ ఇచ్చి ఉంటే అనుమానాలు బలపడకపోవును. ఇంకోపక్క వీవీప్యాట్‌ స్లిప్‌లను పోలింగ్‌ తరువాత 45 రోజుల పాటు భద్రపరచాలన్న సుప్రీంకోర్టు మార్గదర్శకాలను కూడా కాదని ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల అధికారులు పది రోజులకే స్లిప్‌లు దగ్ధం చేయాలని రిటర్నింగ్‌ అధికారులకు ఆదేశాలు ఇవ్వడం కూడా వివాదాస్పదమైంది.

వీవీప్యాట్‌ స్లిప్‌లు ఉండీ ప్రయోజనం ఏమిటి?
లెక్కించనప్పుడు వివిపాట్ స్లిప్‌ల రూపంలో ఒక వ్యవస్థను ఎందుకు ఏర్పాటు చేసినట్లు అన్న ప్రశ్నలిప్పుడు వస్తున్నాయి. ఈ వ్యవహారంలో ఎన్నికల సంఘం మొండిగా వ్యవహరిస్తూ జవాబిచ్చేందుకు నిరాకరించడం ఎంత వరకూ సబబు?

హర్యానా అసెంబ్లీ ఎన్నికల విషయానికి వస్తే ఎగ్జిట్‌ పోల్స్‌ అన్నీ కాంగ్రెస్‌దే విజయమని ఢంకా భజాయించి మరీ చెప్పాయి. ఒక్కటంటే ఒక్క ఎగ్జిట్‌ పోల్‌ కూడా బీజేపీ అధికారంలోకి వస్తుందని చూచాయగా కూడా చెప్పలేదు. బీజేపీకి మద్దతిచ్చే జాతీయ ఛానళ్లు కూడా ఇదే మాట చెప్పాలి. అయితే అందరి అంచనాలను తల్లకిందులు చేస్తూ ఫలితాలు బీజేపీకి అనుకాలంగా రావడం గమనార్హం.

కౌంటింగ్ మొదలైన తరువాత గంటన్నర పాటు కాంగ్రెస్ పార్టీ 20 నియోజకవర్గాల్లో మెజార్టీలో ఉన్నట్లు వార్తలొచ్చాయి. కానీ ఆ తరువాత బీజేపీ చాలా నాటకీయంగా పుంజకోవడమే కాకుండా.. మెజార్టీ మార్కును దాటేసింది కూడా. కౌంటింగ్‌ సందర్భంగా ఆయా రౌండ్ల ఫలితాల వెల్లడి విషయంలోనూ ఎన్నికల సంఘం చాలా ఆలస్యం చేసిందని, దీని వెనుక కూడా కుట్ర ఉందని కాంగ్రెస్‌ అనుమానిస్తోంది.

ప్రజలు నిజంగానే ఓటేసి బీజేపీని గెలిపించి ఉంటే అభ్యంతరమేమీ ఉండదు కానీ.. ఏదైనా అవకతవకలు జరిగి ఉంటే మాత్రం అది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినట్లే అవుతుంది. ఏపీలో ఇదే తరహా పరిణామాలు జరిగినప్పుడు రాహుల్ గాంధీ వంటివారు స్పందించి ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించి ఉంటే కాంగ్రెస్‌ పార్టీ నైతికంగా వ్యవహరించినట్లు అయ్యేది. తాజా పరిణామాలతో తన వాదనను బలంగా వినిపించే అవకాశమూ దక్కేది. అప్పట్లో సందీప్  దీక్షిత్ అనే కాంగ్రెస్ నేత ఏపీలో ఓట్ల శాతం పెరిగిన వైనం, ఈవీఎం ల తీరుపై విమర్శలు చేసినా, వాటికి ఈసీ స్పందించలేదు.  ఇంకా పెద్ద స్థాయి నేతలు మాట్లాడి ఉండాల్సింది.

ట్యాంపరింగ్‌ సాధ్యమేనా?
సాంకేతిక పరిజ్ఞానం పెరిగిపోయిన నేపథ్యంలో ఈవీఎంల టాంపరింగ్ పెద్ద విషయం కాదని నిపుణులు చెబుతున్నారు. ఇందుకు అవకాశం ఇవ్వకుండా చూడాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిది. కానీ ఈసీ స్వతంత్రంగా వ్యవహరించడం మానేసి, కేంద్రంలో ఉన్న పార్టీకి తొత్తుగా పనిచేస్తోందన్న విమర్శలు  ఎదుర్కుంటోంది. టాంపరింగ్ అవకాశం ఉంటే జమ్ము-కాశ్వీర్ లో కూడా జరిగేది కదా అని కొందరు వాదిస్తున్నారు. అందులో  కొంత వాస్తవం ఉన్నప్పటికీ, అన్ని చోట్ల చేయాలని లేదు. ప్రస్తుతం అది కేంద్ర పాలిత ప్రాంతం కనుక కేంద్ర పెత్తనం అక్కడ ఎలాగూ సాగుతుంది. కానీ ఉత్తర భారత దేశం మధ్యలో ఉండే హర్యానాలో బీజేపీ ఓటమి పాలైతే దాని ప్రభావం పరిసర రాష్ట్రాలపై కూడా పడే అవకాశం ఉందని భయపడి ఉండవచ్చని, అందుకే  సెలెక్టివ్‌గా టాంపరింగ్ జరిగి ఉంటుందన్నది కాంగ్రెస్ నేతల వాదనగా ఉంది.

2009 ముందు వరకు  ఈవీఎంలపై ఆరోపణలు పెద్దగా రాలేదు. 2009లో తొలిసారి టీడీపీ అధినేత చంద్రబాబు  నాయుడు  ఆరోపణలు చేయడమే కాకుండా, టాంపరింగ్ ఎలా చేయవచ్చో, కొందరు నిపుణుల ద్వారా ప్రదర్శన కూడా ఏర్పాటు చేశారు. 2014లో ఆయన విభజిత ఏపీలో గెలిచిన తరువాత మాత్రం దీని ప్రస్తావనే చేయలేదు. 2019లో ఓటమి తర్వాత ఈవీఎంలపై కోర్టుకు వెళ్లిన వారిలో ఈయన కూడా ఉన్నారు.ఆ క్రమంలోనే సుప్రీం కోర్టు వీవీప్యాట్‌ స్లిప్ లపై మార్గదర్శకాలు  ఇచ్చింది. అయినా సరే ఎన్నికల అధికారులు వాటిని పట్టించుకోకపోవడం విశేషం. 2024లో టీడీపీ కూటమి మళ్లీ అధికారంలోకి  రావడంతో చంద్రబాబు కాని, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాని ఈవీఎంల టాంపరింగ్ ఊసే ఎత్తలేదు. పలు ఆరోపణలు వస్తున్నా, వారు కిమ్మనకపోవడం కూడా ఆసక్తికరంగానే ఉంది. ప్రజలలో అనుమానాలు  మరింత బలపడ్డాయని చెప్పవచ్చు.

ఈసీ ప్రజల సంశయాలు తీర్చకుండా ఇప్పటిలాగానే వ్యవహరిస్తే దేశంలో  ఎవరూ ఎన్నికలను నమ్మని పరిస్థితి వస్తుంది. ప్రజాభిప్రాయాన్ని వమ్ము  చేస్తున్నారని రాజకీయ పార్టీలు ఆరోపిస్తాయి. భవిష్యత్తులో జరిగే వివిధ రాష్ట్రాల ఎన్నికలలో ఈ సమస్య మళ్లీ ముందుకు రావచ్చు. 2029 లోక సభ ఎన్నికలు బాలెట్ పత్రాలతో జరగాలన్న డిమాండ్ పెరుగుతోంది. అందుకు కేంద్రం అంగీకరించకపోతే ప్రతిపక్షాలు ఎన్నికలను బహిష్కరించే అవకాశం ఉంటుందా అన్నది అప్పుడే చెప్పలేం. బ్యాలెట్‌ పత్రాల పద్దతి ఉంటే రిగ్గింగ్ జరగదా?  జరగదని చెప్పజాలం.

1972 లో పశ్చిమబెంగాల్ లో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా రిగ్గింగ్ చేసిందని ఆరోపిస్తూ సీపీఎం ఎన్నికలను బహిష్కరించింది. ఆ తర్వాత 1978 ఎన్నికలలో ఆ పార్టీ అధికారంలోకి రాగలిగింది.ఇప్పుడు సీసీటీవీల వ్యవస్థ వచ్చింది కనుక బ్యాలెట్  పత్రాల రిగ్గింగ్‌ను కొంతమేర నిరోధించవచ్చు. ఈవీఎంల వ్యవస్థ వల్ల సులువుగా ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్నా, వాటిని మానిప్యులేట్  చేస్తున్నారని జనం నమ్మితే మాత్రం ఈవీఎంలు అత్యంత ప్రమాదకరంగా మారినట్లు అవుతుంది. ఏది ఏమైనా ఈవీఎంల టాంపరింగ్ కు అవకాశం లేని టెక్నాలజీని వాడాలి. లేదా బాలెట్ పత్రాల ద్వారా ఎన్నికలు నిర్వహించడమే మంచిది కావచ్చు. 


కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement