రజత్ కుమార్
హైదరాబాద్: ఏప్రిల్ 11న జరుగనున్న లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్‌తో పాటూ , ఫలితాలకు సంబంధించిన సమాచారాన్ని ప్రచురించడం, వ్యాప్తి చేయడంపై చట్ట ప్రకారం ఆంక్షలున్నాయని, వాటిని నిక్కచ్చిగా పాటించాలని తెలంగాణా ప్రధాన ఎన్నికల అధికారి డాక్టర్ రజత్ కుమార్ బుధవారం పత్రికా ప్రకటనలో తెలిపారు. ప్రజా ప్రాతినిధ్య చట్టం, 1951కి సంబంధించిన సెక్షన్ 126ఏ లోని సబ్ సెక్షన్(1),(2)ల కింద సంక్రమించిన అధికారాలను వినియోగించి ఎన్నికల కమిషన్(ఈసీ) ఏప్రిల్ 11న ఉదయం 7 నుంచి, మే 19న సాయంత్రం 6.30 గంటల వరకు ఈ ఆంక్షల్ని విధించిందని ఆయన చెప్పారు.
ఈ మధ్య కాలంలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాల్లో ఎటువంటి ఎగ్జిట్ పోల్స్ నిర్వహణ, ప్రచురణ లేదా సమాచారం వ్యాప్తి చేయకూడదని, ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కూడా ప్రకటించకూడదని ఆయన స్పష్టం చేశారు. పోలింగ్ ముగింపునకు నిర్ణయించిన సమయానికి ముందున్న 48 గంటల వ్యవధిలో, ఎటువంటి ఓపీనియన్ పోల్స్ ఫలితాలు లేదా మరే ఇతర పోల్ సర్వేలు, తదితర ఎన్నికల సమాచారం ప్రకటన, ప్రచురణ కూడా నిషిద్ధమని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment