సాక్షి, హైదరాబాద్: ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను తెలంగాణ ద్రోహి నంబర్1గా తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అభివర్ణించారు. బందిపోటు దొంగలు, గజదొంగలు కూడా లూటీ చేయలేని విధంగా కేసీఆర్ కుటుంబ సభ్యులు రాష్ట్రాన్ని లూటీ చేశారని ఆయన ధ్వజమెత్తారు. సోమవారం గాంధీభవన్‌లో జరిగిన టీపీసీసీ ముఖ్య నేతల అత్యవసర సమావేశం అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. సెంటిమెంట్ ముసుగులో ఎలాంటి అడ్డదారిలోనైనా మళ్లీ అధికారంలోకి వచ్చి దోచుకోవాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
ప్రాజెక్టుల పేరుతో అడ్డగోలుగా దోచుకున్న సొమ్మును ఇప్పటికే విపరీతంగా పంచుతున్నాడన్న ఆధారాలు, సంకేతాలు తమకున్నాయని, ఇతర పార్టీల నేతలను కొనుగోలు చేసేందుకు దిగజారి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. దళితులు, గిరిజనులను దగా చేసినందుకు... ప్రజల సొమ్ముతో విలాస జీవితం గడుపుతూ ఆ ప్రజలనే తొక్కేసిన తెలంగాణ ద్రోహి నంబర్ 1.. కేసీఆర్ అని అన్నారు. రాష్ట్ర ప్రజలను మోసం చేసినందుకు ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ విషయాలన్నింటినీ ప్రజల్లోకి తీసుకెళ్తామని, కేసీఆర్ హఠావో.. తెలంగాణ బచావో.. అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్తామని చెప్పారు.
చర్యలెందుకు తీసుకోవడం లేదు...
రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్ నిష్పాక్షికతపై అనుమానాలున్నాయని ఉత్తమ్ వ్యాఖ్యానించారు. ఎన్నికల నియమావళిని ఆపద్ధర్మ ప్రభుత్వం యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఈ విషయంపై ఇప్పటికే ఎన్నికల ప్రధానాధికారిని కలిశామని, ఒకట్రెండు రోజుల్లో స్పందన రాకపోతే కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలుస్తామని, అప్పటికీ మార్పు రాకపోతే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు.
కేసీఆర్, కేటీఆర్ ఈవీఎంల ట్యాంపరింగ్ చేస్తారనే అనుమానాలు కూడా తమకున్నాయని చె ప్పారు. కొన్ని వార్తాపత్రికలు, టీవీల్లో కూడా ఒక పా ర్టీకి అనుకూలంగా, కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా కథనా లు వస్తున్నాయని, ఈ విషయాన్నీ ఈసీ దృష్టికి తీసు కెళ్తామని చెప్పారు. ఏఐసీసీ పిలుపు మేరకు మహాత్మాగాంధీ 150వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని వారం రోజుల పాటు జనసంపర్క్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఉత్తమ్ చెప్పారు.
టీఆర్‌ఎస్ వస్తే తెలంగాణ మిగలదు...
రాష్ట్రంలో పొరపాటున మళ్లీ టీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తే తెలంగాణ మిగలదని టీపీసీసీ ఎన్నికల పబ్లిసిటీ కమిటీ చైర్మన్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. అందుకే కేసీఆర్‌ను దింపాలన్న ఏకైక లక్ష్యంతోనే కాంగ్రెస్ పార్టీ కూటమి ఏర్పాటు ప్రయత్నాలు చేస్తోందన్నారు.
తమ కూటమి ఏర్పాట్లపై టీఆర్‌ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్ రోజూ విమర్శలు చేస్తున్నారని, రైతులను చంపిన పార్టీతో పొత్తు ఎలా పెట్టుకుంటారని ప్రశ్నించడానికి వారికి సిగ్గుండాలన్నారు. 2003లో తెలుగుదేశం పార్టీ రైతులను చంపితే 2009లో టీఆర్‌ఎస్ పొత్తు ఎలా పెట్టుకుం దని ప్రశ్నించారు. దీనిపై ప్రజలకు టీఆర్‌ఎస్ నేతలు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
ఆ చీరలు ఎక్కడివో కేటీఆర్ చెప్పాలి: బతుకమ్మ చీరలన్నీ సిరిసిల్లలోనే తయారు చేయిస్తున్నామని కేటీఆర్ పదేపదే చెపుతున్న మాటలు అబద్ధాలని తేలిపోయిందని మండలిలో విపక్ష నేత షబ్బీర్ అలీ అన్నారు. సోమవారం మహారాష్ట్ర నుంచి చీరలు తీసుకుని వస్తున్న లారీ కామారెడ్డి వద్ద బోల్తా కొట్టిందని, అక్కడి నుంచి చీరలు గచ్చిబౌలికి తీసుకెళ్తున్నట్లు ఆ లారీ డ్రైవర్ చెప్పాడని వెల్లడించారు.
మరి సిరిసిల్లలో చీరలు తయారు చేస్తున్నప్పుడు లారీ నిండా చీరలు గచ్చిబౌలిలో డంప్ ఎందుకు చేయాల్సి వచ్చిందని ఆయన ప్రశ్నించారు. ఈ ఏడాది కూడా కిలోల లెక్క చీరలు తెచ్చి పంపిణీ చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. ముంబై, సూరత్‌ల నుంచి చీరలు ఎందుకు తెస్తున్నారో కేటీఆర్ సమాధానం చెప్పాలన్నారు.
టీఆర్‌ఎస్‌కు ఓటేస్తే గడీలో దోపిడీదారుడికి వేసినట్టే...
ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు ఓటేస్తే గడీలో నివసిస్తున్న దోపిడీదారుడికే పోతుందనే విషయాన్ని ప్రజలు గమనించాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి వ్యాఖ్యా నించారు. మంత్రి కేటీఆర్ మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారని, ధనరాశుల మధ్య విలాసజీవితం గడుపుతూ మధ్యలో విరామం సమయంలో బయటకు వచ్చి అవాకులు చెవాకులు పేలుతున్నాడని విమర్శించారు. మీడియా సంస్థల నియంత్రణ కోసం రాష్ట్ర, జిల్లా స్థాయి లో వెంటనే కమిటీలను ఏర్పాటు చేయాలని ఈసీని కోరారు. ఈ కార్యక్రమంలో పొన్నం ప్రభాకర్, మహ్మద్‌సలీం, డాక్టర్ గీతారెడ్డి, డాక్టర్ మల్లు రవి, దాసోజు శ్రవణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఓటమి భయంతోనే వేధింపులు....
నిధులను దుర్వినియోగం చేస్తూ రాష్ట్రంలోని ఆపద్ధర్మ ప్రభుత్వం ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడాన్ని ఖండిస్తున్నామని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి ఆర్.సి.కుంతియా అన్నారు. ఈ దుర్వినియోగంపై కేంద్ర, రాష్ట్ర ఎన్నికల అధికారులతో పాటు భారత రాష్ట్రపతికి కూడా ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.
ఎన్నికల ఫండ్ కోసం ప్రతి బూత్‌కు రూ.5వేలు విరాళాలుగా సేకరించాలని కోరారు. కాంగ్రెస్ నేతలను కేసుల పేరిట వేధిస్తున్న టీఆర్‌ఎస్‌కు ఓటమి భయం పట్టుకుందన్నారు. ఈ వేధింపులకు భయపడేది లేదని, సమైక్యంగా ఎదుర్కొంటామని, రానున్న ఎన్నికల్లో గెలిచి తెలంగాణ ఇచ్చిన సోనియాకు కానుకగా అందిస్తామని కుంతియా ధీమా వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment