సాక్షి, హైదరాబాద్: ఓటరుగా ఇంకా పేరు నమోదు చేసుకోలేదా? ఓటర్ల జాబితాలో పేరు గల్లంతైందా? కొత్త ప్రాంతానికి నివాసం మారారా? ఏప్రిల్ 11న జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో ఓటేయాలనుకుంటున్నారా? అయి తే ఓటరుగా నమోదు కావడానికి వెంటనే దరఖాస్తు చేసుకోండి. లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా చేపట్టిన ప్రత్యేక ఓటర్ల నమోదు కార్యక్రమం కింద దరఖాస్తుల స్వీకరణ శుక్రవారంతో ముగియనుంది. ఈ నేపథ్యంలో చివరి రోజు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈఓ) రజత్‌కుమార్ ప్రజలకు పిలుపునిచ్చారు.
అన్ని పోలింగ్ బూత్‌ల వద్ద బూత్ స్థాయి అధికారులు(బీఎల్‌ఓ) ఓటరు నమోదు దరఖాస్తుల(ఫారం–6)తో ప్రజలకు అందుబా టులో ఉంటారని వెల్లడించారు. ఓటరు నమోదు కోసం ఆన్‌లైన్‌లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికల ఏర్పాట్ల పై గురువారం ఆయన సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. కొత్త ఓటర్ల నమోదు కోసం ఇప్పటి వరకు 3 లక్షలకు పైగా దరఖాస్తులొచ్చాయని తెలిపారు. చివరి రోజు శుక్రవారం వరకు వచ్చిన దరఖాస్తులను పరిష్కరించి కొత్త ఓటర్లతో ఈ నెల 25న అనుబంధ ఓటర్ల జాబితాను ప్రచురిస్తామని వెల్లడించారు.
బెల్టు షాపులు మూత
రాష్ట్రంలో పకడ్బందీగా ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు చేస్తున్నామని సీఈఓ రజత్‌కుమార్ తెలిపారు. ‘‘అక్రమ మద్యం విక్రయించే బెల్టు షాపులను సంపూర్ణంగా మూసివేయాలని ఆదేశించాం. మద్యం దుకాణాలు కచ్చితమైన సమయ పాలన పాటించేలా చర్యలు తీసుకుంటున్నాం. ఏ పార్టీ అభ్యర్థి అయినా కులం, మతం పేరుతో ఓట్లను అభ్యర్థిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. ఎన్నికల కోడ్ అమలుకు 432 ఫ్లైయింగ్ స్క్వాడ్స్, 188 వీడియో బృందాలు, గ్రామీణ ప్రాంతాల్లో 430 నిఘా బృందాలు, 95 ఎన్నికల వ్యయ పరిశీలన బృందాలు ఏర్పాటు చేశాం’’అని వివరించారు. 2014 ఎన్నికల సందర్భంగా తెలంగాణ పరిధిలో 1,649 కేసులు నమోదయ్యాయని, వాటి దర్యాప్తును వేగవంతం చేయాలని పోలీసు శాఖను ఆదేశించామని వెల్లడించారు.
ఇప్పటి వరకు 71 కేసుల్లో నేరారోపణలు రుజువయ్యాయన్నారు. ఎన్నికల కేసులను ఎత్తివేయడం జరగదని స్పష్టంచేశారు. 2018లో 1,932 ఎన్నికల కేసులు నమోదయ్యాయని వివరించారు. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గిలో టీఆర్‌ఎస్ అభ్యర్థికి సంబంధించిన వ్యక్తి వద్ద రూ.17 కోట్ల అక్రమ నగదు పట్టుబడిందని, అయితే అధికార పార్టీతో కుమ్మక్కైన అధికారులు పట్టుబడిన నగదును తక్కువ చేసి చూపించారని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలను రజత్‌కుమార్ తోసిపుచ్చారు. ఆదాయ పన్ను అధికారులతో పాటు పంచనామా నిర్వహించిన అధికారులను పిలిపించి విచారించానని, కేవలం రూ.51 లక్షలు మాత్రమే లభించినట్లు తేలిందని వెల్లడించారు.
ఏప్రిల్ 5లోగా కార్డుల పంపిణీ...
కొత్త ఓటర్లకు ఉచితంగా ఫొటో ఓటరు గుర్తింపు కార్డులు జారీ చేస్తామని రజత్‌కుమార్ తెలిపారు. ఏప్రిల్ 5వ తేదీలోగా ఓటరు గుర్తింపు కార్డులు, ఫొటో ఓటరు స్లిప్పుల పంపిణీ పూర్తిచేస్తామని వెల్లడించారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా 17 లక్షల మందికి ఉచితంగా ఓటరు గుర్తింపు కార్డులు పంపిణీ చేశామన్నారు. పాత ఓటరు గుర్తింపు కార్డులు కలిగినవారు మాత్రం రూ.100 సేవా రుసుం చెల్లించి మీ–సేవా కేంద్రాల నుంచి కొత్త ఓటరు గుర్తింపు కార్డులు పొందవచ్చని చెప్పారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఓటరు గుర్తింపు కార్డుల జారీకి మీ–సేవ కేంద్రాలు రూ.25 రుసుం వసూలు చేయాలని నిర్ణయించామని, అయితే కార్డుల తయారీ వ్యయం పెరగడంతో సేవా రుసుంను రూ.200కు పెంచాలని మీ–సేవ డైరెక్టర్ ప్రతిపాదించారని తెలిపారు. ఓటర్లపై అధిక భారం పడకుండా రూ.100కు ఈ కార్డులు జారీ చేయాలని నిర్ణయించామన్నారు.
లక్ష్మీస్ ఎన్టీఆర్‌పై ఫిర్యాదు అందింది...
టీడీపీ వ్యవస్థాపకుడు దివంగత నందమూరి తారకరామారావు నిజ జీవితం ఆధారంగా ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో నిర్మితమైన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’సినిమాపై ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘంతో పాటు తన కార్యాలయానికి ఫిర్యాదు అందిం దని రజత్‌కుమార్ తెలిపారు. ఈ ఫిర్యా దుపై కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment