Voter registraion
-
దివ్యం..మీ ఓటు..
సాక్షి, కడప : ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధం కంటే పదునైనది. ఓటును నమోదు చేసుకోవడంతోపాటు ఓటు వేయడం అర్హులైన ప్రతి ఒక్కరి బాధ్యత. కేంద్ర ఎన్నికల సంఘం దివ్యాంగులకు ప్రత్యేకంగా ఒక యాప్‌ను రూపొందించింది. దీని ద్వారా వారు సులభతరంగా ఓటు నమోదు చేసుకుంటున్నారు. అలాగే ఓటింగ్ రోజున వీరికి ప్రత్యేకంగా కొన్ని సదుపాయాలను కల్పించారు. ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని పెంచడానికి కేంద్ర ఎన్నికల సంఘం అన్ని చర్యలు చేపడుతోంది. కాగా ఇన్నాళ్లు సరైన సౌకర్యాలు లేకపోవడంతో దివ్యాంగులు ఓటు నమోదుకు, ఓటును సద్వినియోగం చేసుకోవడానికి కొంత దూరమయ్యారు. ఇప్పుడు వారిలో చైతన్యం కలిగించడానికి ఎన్నికల సంఘం సరికొత్త విధానం అందుబాటులోకి తెచ్చింది. అందులో భాగంగా ప్రత్యేకంగా ఒక యాప్ రూపొందించారు. నమోదు.. సౌకర్యాలు ఇలా.. ఎన్నికల సంఘం ప్రవేశ పెట్టిన యాప్ విధానం ఇలా.. గూగుల్ ప్లే స్టోర్‌లోకి వెళ్లి సీడబ్ల్యూడీ అని టైప్ చేస్తే ఎన్నికల సంఘం రూపొందించిన పర్సన్స్ విత్ డిజెబిలిటి యాప్ వస్తుంది. దీన్ని డౌన్ లోడ్ చేసుకుంటే.. అందులో ఉన్న సౌకర్యాలు కనిపిస్తాయి. కొత్త ఓటు నమోదు, చిరునామా మార్పు, తప్పుల సవరణ, తొలగింపు వివరాలు ఉంటాయి. అలాగే ఓటింగ్ రోజున వీల్‌చైర్ అవసరం అయితే ఆ సదుపాయాన్ని పొందవచ్చు. అదే విధంగా పోలింగ్ బూత్ చిరునామా, ఎన్నికల కమిషన్‌కు సంబంధించిన తాజా సమాచారాన్ని ఎప్పటికి అప్పుడు తెలుసుకోవచ్చు. అలాగే ఓటరు పేరు, తండ్రి పేరు నియోజకవర్గం పేరు నమోదు చేసి సెర్చ్ చేస్తే ఓటు ఉందో.. లేదో..? తెలుసుకోవచ్చు. ప్రయాస లేకుండా ఓటు వేసి ఇంటికి... దివ్యాంగులు యాప్ ద్వారా అందించిన సమాచారం ఆధారంగా అధికారులు చర్యలు చేపడుతారు. వారున్న చోటికి వాహనాలను పంపిస్తారు. ఆ వాహనం పోలింగ్ కేంద్రానికి వెళ్తుంది. సదరు వ్యక్తి ఓటు హక్కును వినియోగించుకున్న తరువాత తిరిగి వారింటి వద్దకు తీసుకెళ్లే బాధ్యతను పోలింగ్ అధికారులు పర్యవేక్షిస్తారు. అలాగే అవసరమైన వారికి వీల్‌చైర్ సదుపాయం కూడా కల్పిస్తారు. ఇలా ఎన్నికల కమిషన్ దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా అన్ని చర్యలు చేపట్టింది. కాగా ఈ ఓటరు నమోదుపై జిల్లా విభిన్న ప్రతిభావంతులు సంక్షేమ శాఖ అవగాహన కార్యక్రమాలను కూడా చేపట్టింది. రండి.. ఓటెత్తుదాం.. ఓటు హక్కు నమోదు గడువు శుక్రవారంతో ముగియనుంది. ఇంకా ఓటు నమోదును చేసుకోని వారు త్వరపడాలి. ప్రత్యేక సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలి. -
ఒక్క రోజే అవకాశం
సాక్షి, హైదరాబాద్: ఓటరుగా ఇంకా పేరు నమోదు చేసుకోలేదా? ఓటర్ల జాబితాలో పేరు గల్లంతైందా? కొత్త ప్రాంతానికి నివాసం మారారా? ఏప్రిల్ 11న జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో ఓటేయాలనుకుంటున్నారా? అయి తే ఓటరుగా నమోదు కావడానికి వెంటనే దరఖాస్తు చేసుకోండి. లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా చేపట్టిన ప్రత్యేక ఓటర్ల నమోదు కార్యక్రమం కింద దరఖాస్తుల స్వీకరణ శుక్రవారంతో ముగియనుంది. ఈ నేపథ్యంలో చివరి రోజు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈఓ) రజత్‌కుమార్ ప్రజలకు పిలుపునిచ్చారు. అన్ని పోలింగ్ బూత్‌ల వద్ద బూత్ స్థాయి అధికారులు(బీఎల్ఓ) ఓటరు నమోదు దరఖాస్తుల(ఫారం–6)తో ప్రజలకు అందుబా టులో ఉంటారని వెల్లడించారు. ఓటరు నమోదు కోసం ఆన్లైన్లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికల ఏర్పాట్ల పై గురువారం ఆయన సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. కొత్త ఓటర్ల నమోదు కోసం ఇప్పటి వరకు 3 లక్షలకు పైగా దరఖాస్తులొచ్చాయని తెలిపారు. చివరి రోజు శుక్రవారం వరకు వచ్చిన దరఖాస్తులను పరిష్కరించి కొత్త ఓటర్లతో ఈ నెల 25న అనుబంధ ఓటర్ల జాబితాను ప్రచురిస్తామని వెల్లడించారు. బెల్టు షాపులు మూత రాష్ట్రంలో పకడ్బందీగా ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు చేస్తున్నామని సీఈఓ రజత్‌కుమార్ తెలిపారు. ‘‘అక్రమ మద్యం విక్రయించే బెల్టు షాపులను సంపూర్ణంగా మూసివేయాలని ఆదేశించాం. మద్యం దుకాణాలు కచ్చితమైన సమయ పాలన పాటించేలా చర్యలు తీసుకుంటున్నాం. ఏ పార్టీ అభ్యర్థి అయినా కులం, మతం పేరుతో ఓట్లను అభ్యర్థిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. ఎన్నికల కోడ్ అమలుకు 432 ఫ్లైయింగ్ స్క్వాడ్స్, 188 వీడియో బృందాలు, గ్రామీణ ప్రాంతాల్లో 430 నిఘా బృందాలు, 95 ఎన్నికల వ్యయ పరిశీలన బృందాలు ఏర్పాటు చేశాం’’అని వివరించారు. 2014 ఎన్నికల సందర్భంగా తెలంగాణ పరిధిలో 1,649 కేసులు నమోదయ్యాయని, వాటి దర్యాప్తును వేగవంతం చేయాలని పోలీసు శాఖను ఆదేశించామని వెల్లడించారు. ఇప్పటి వరకు 71 కేసుల్లో నేరారోపణలు రుజువయ్యాయన్నారు. ఎన్నికల కేసులను ఎత్తివేయడం జరగదని స్పష్టంచేశారు. 2018లో 1,932 ఎన్నికల కేసులు నమోదయ్యాయని వివరించారు. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గిలో టీఆర్ఎస్ అభ్యర్థికి సంబంధించిన వ్యక్తి వద్ద రూ.17 కోట్ల అక్రమ నగదు పట్టుబడిందని, అయితే అధికార పార్టీతో కుమ్మక్కైన అధికారులు పట్టుబడిన నగదును తక్కువ చేసి చూపించారని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలను రజత్‌కుమార్ తోసిపుచ్చారు. ఆదాయ పన్ను అధికారులతో పాటు పంచనామా నిర్వహించిన అధికారులను పిలిపించి విచారించానని, కేవలం రూ.51 లక్షలు మాత్రమే లభించినట్లు తేలిందని వెల్లడించారు. ఏప్రిల్ 5లోగా కార్డుల పంపిణీ... కొత్త ఓటర్లకు ఉచితంగా ఫొటో ఓటరు గుర్తింపు కార్డులు జారీ చేస్తామని రజత్‌కుమార్ తెలిపారు. ఏప్రిల్ 5వ తేదీలోగా ఓటరు గుర్తింపు కార్డులు, ఫొటో ఓటరు స్లిప్పుల పంపిణీ పూర్తిచేస్తామని వెల్లడించారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా 17 లక్షల మందికి ఉచితంగా ఓటరు గుర్తింపు కార్డులు పంపిణీ చేశామన్నారు. పాత ఓటరు గుర్తింపు కార్డులు కలిగినవారు మాత్రం రూ.100 సేవా రుసుం చెల్లించి మీ–సేవా కేంద్రాల నుంచి కొత్త ఓటరు గుర్తింపు కార్డులు పొందవచ్చని చెప్పారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఓటరు గుర్తింపు కార్డుల జారీకి మీ–సేవ కేంద్రాలు రూ.25 రుసుం వసూలు చేయాలని నిర్ణయించామని, అయితే కార్డుల తయారీ వ్యయం పెరగడంతో సేవా రుసుంను రూ.200కు పెంచాలని మీ–సేవ డైరెక్టర్ ప్రతిపాదించారని తెలిపారు. ఓటర్లపై అధిక భారం పడకుండా రూ.100కు ఈ కార్డులు జారీ చేయాలని నిర్ణయించామన్నారు. లక్ష్మీస్ ఎన్టీఆర్‌పై ఫిర్యాదు అందింది... టీడీపీ వ్యవస్థాపకుడు దివంగత నందమూరి తారకరామారావు నిజ జీవితం ఆధారంగా ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో నిర్మితమైన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’సినిమాపై ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘంతో పాటు తన కార్యాలయానికి ఫిర్యాదు అందిం దని రజత్‌కుమార్ తెలిపారు. ఈ ఫిర్యా దుపై కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నారు. -
ఓటు నమోదైతే ఒట్టు!
సాక్షి, శ్రీకాకుళం పాతబస్టాండ్: ఓటరు నమోదుకు ఇంకా రెండు రోజులే గడువు ఉన్న నేపథ్యంలో ఓటు నమోదు కోసం జనం ఎగబడుతున్నారు. అయితే దీనికి సంబంధించిన వెబ్సైట్ మాత్రం వారి ఉత్సాహంపై నీళ్లు చల్లుతోంది. రానున్న సార్వత్రిక ఎన్నికలకు ఓటు హక్కు పొందాల ని జిల్లాలోని పలువురు ఆన్లైన్ ద్వారా ప్రయత్నం చేస్తుండగా అది సాధ్యం కావడం లేదు. ఓటరుగా ఆన్లైన్లో నమోదు చేసుకోవడానికి ఎన్నికల సంఘం సీఈఓ ఈ–రిజిస్ట్రేషన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎన్వీఎస్పీ వెబ్సైట్లోకి వెళ్లి ఫారం–6ను నింపి అప్లోడ్ చేయ డం ద్వారా ఓటరు నమోదు చేసుకోవచ్చని ఎన్నిక ల సంఘం కూడా సూచించింది. జిల్లాలోని పలు వురు ఉద్యోగులు, యువకులతోపాటు జిల్లాకు చెంది ఇతర ప్రాంతాల్లో నివాసముంటున్న పలు వురు ఓటరుగా నమోదు చేసుకునేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. ఫారం–6 నింపుతుండగా కొన్నిసార్లు, ఫొటో అప్లోడ్ చేస్తుండగా కొన్ని సార్లు సమస్య తలెత్తుతోంది. దరఖాస్తు అసలు అప్లోడ్ కావడం లేదు. సమస్యను 1950కు నేరుగా గానీ, ఎస్ఎంఎస్ ద్వారా గాని తెలియజేద్దామంటే అది కూడా సాధ్యం కావడం లేదు. కొంద రు ఓటర్లు తమ ఓటు వివరాలను తెలుసుకునేం దుకు 1950కు వివరాలు పంపించినా తిరిగి వచ్చి న జవాబు అర్థంకాని భాషలో ఉండడంతో ఇబ్బందులు పడుతున్నారు. హెల్ప్‌లైన్ యాప్‌లో కూడా ఇలాంటి సమస్య లే ఎదురవుతున్నట్లు బాధితులు చెబుతున్నారు. ఓటరు నమోదునకు మరో రెండు రోజులే గడువు ఉండగా ఆన్లైన్లో ఇబ్బందులు ఎదురవుతుండడంతో ప్రత్యామ్నాయం చూపించాలని పలువురు కోరుతున్నారు. సంతకవిటి మండలం మందరాడ గ్రామానికి చెందిన లెంక భాగ్యశ్రీ ఓటు నమోదు చేసుకుందామని రెండురోజులుగా ప్రయత్నిస్తున్నారు. కానీ వెబ్సైట్ పనిచేయకపోవడంతో సాధ్యం కావడం లేదు. ఈమె శృంగవరపుకోటలో ఉండేవారు. వివా హం జరగడంతో సంతకవిటి మండలం మందరాడకు వచ్చారు. ఇటీవల ఎస్. కోటలో ఓటును రద్దు చేయించుకుని, మందరాడలో నమోదు చేసుకోవాలని రెండు రోజులుగా ప్రయత్నిస్తున్నా ఎన్వీఎస్పీ వెబ్సైట్ తెరుచుకోకపోవడంతో అది సాధ్యం కాలేదు. శ్రీకాకుళం నగరానికి చెందిన పాలిశెట్టి లీలవతి ఓటర్ల జాబితాలో తనపేరు ఉందో లేదో తెలుసుకునేం దుకు 1950కు ఎస్ఎంఎస్ పంపించింది. అక్కడి నుంచి తిరుగు సమాధానంగా మీ నంబర్ రిజిస్టర్ అయిందని, త్వరలోనే వివరాలు తెలుపుతామని సమాచారం వచ్చింది. తర్వాత వచ్చిన ఎస్ఎంఎస్ను చూడగా అందులో ప్లస్‌లు, మైనస్‌లు, వేర్వేరు గుర్తులు ఉండడంతో ఏం చేయాలో తెలీక మిన్నకుండిపోయింది. అష్టకష్టాలు.. మా గ్రామం యారబాడులో గతంలో నాకు ఓటు ఉండేది. ఇటీవల కొత్తగా వచ్చిన జాబితాలో పరిశీలిస్తే పేరు లేదు. ఎవరు తొలగించారో తెలీడం లేదు. మళ్లీ ఓటు కోసం దరఖాస్తు చేయడానికి మీ సేవ చుట్టూ రెండు రోజులుగా తిరుగుతున్నా. పని కావడం లేదు. దరఖాస్తు చేసేందుకు ఆన్లైన్ సర్వర్ బాగులేదు. సర్వర్ డౌన్లో ఉంది అని మీ సేవా వాళ్లు అంటున్నారు. సమయం చూస్తే రెండు రోజులే ఉంది. ఇప్పుడు సర్వర్ డౌన్ అంటే ఎలా? – ఎస్.రామినాయుడు, యారబాడు, నరసన్నపేట ఆన్లైన్లో పెట్టాం గానీ ఓటు రాలేదు పలాస మండలం చినంచల గ్రామానికి చెందిన నేను ఇటీవల ఓటు తనిఖీ చేయించాను. మా గ్రామానికి చెందిన ఓటరు లిస్టులో నా పేరులేదు. రెండు రోజుల కిందటే మళ్లీ ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నాను. కానీ ఇంతవరకు ఎలాంటి జవాబు రాలేదు. ఇంకా రెండురోజులు గడువు ఉంది. ఆన్లైన్ సమస్యగా చెబుతున్నారు తప్ప ఓటు హక్కు ఇవ్వడం లేదు. – బమ్మిడి కామయ్య, చినంచల గ్రామం, పలాస మండలం -
ఓటుపై సర్కస్ ఫీటు
శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలో ఓటర్ల నమోదు ప్రక్రియ అస్తవ్యస్తంగా జరుగుతోంది. ఈ ఏడాది ఓటర్ల నమోదు ప్రక్రియకు ప్రత్యేక సమ్మరీ నిర్వహించారు. ఇందులోనూ దొంగ ఓట్లు నమోదు చేయడంలో అధికార పార్టీ తన ప్రత్యేకత చూపించింది. స్థానికంగా పనిచేస్తున్న బీఎల్ఓలను భయపెట్టి వారికి అనుకూలంగా పని చేయించుకున్నట్లు తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి. సమ్మరీ జరుగుతున్న వేళలోనే తిత్లీ తుఫాన్ వచ్చింది. దీంతో అధికారులు ఓటరు నమోదుపై పూర్తిస్థాయిలో దృష్టి సారించలేకపోయారు. దీన్ని అదనుగా తీసుకున్న చోటా నేతలు పరిమితులు లేకుండా ఇబ్బడిముబ్బడిగా దరఖాస్తు చేశారు. ఒకరి ఓటును రెండు మూడు చోట్ల ఉంచడం, ఒకరి పేరున రెండు ఓట్లు ఉంచడం వంటి సర్కస్ ఫీట్లు చేశారు. అధికార పార్టీ కార్యకర్తలు బలంగా పనిచేస్తున్న చోట్ల ఈ ఫీట్లు ఎక్కువగా కనిపించాయి. అధికారులే గుర్తించారు తిత్లీ హడావుడి తగ్గాక ఓటరు నమోదు ప్రక్రియను పరిశీలిస్తే అధికార పార్టీ నేతలు చేసిన పనులు అధికారులకు తెలిశాయి. జిల్లాలో ఎక్కువగా డబుల్ ఓట్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. పది నియోజకవర్గాల పరిధిలో ఇప్పటివరకు కంప్యూటర్ ఆధారంగానే 9802 డబుల్ ఓట్లను వారు గుర్తించారు. వీరి దృష్టికి రాకుండా మరో 20 వేల వరకు ఉంటాయని అంచనా. తాజాగా నిర్వహించిన ఓటర్ల నమోదు సమ్మరీలో సుమారుగా 47,411 ఆన్లైన్ దరఖాస్తులు, నేరుగా ఫారం 6లు వచ్చినవి మరో 30 వేలు వరకు ఉంటాయని అధికారులు చెబుతున్నారు. సుమారుగా 77 వేల కొత్త దరఖాస్తుల్లో ఇలాంటి అక్రమాల డబుల్ ఓట్లు, అధికార పార్టీ చొరవతో అడ్డగోలుగా కుక్కిన ఓట్లు మరో 20 వేలు వరకు ఉండవచ్చని అంచనా ఉంది. ఈ సమ్మరీలో వచ్చిన ఓట్లు రానున్న ఎన్నికలకు కీలకం కావడంతో అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ క్షుద్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అంతే కాకుండా గతం మార్చిలో జరిగిన సమ్మరీలో జిల్లా సుమారుగా 33,957 ఓట్లను తొలగించారు. వీటిలో ఎక్కువగా ప్రతిపక్షంలో ఉన్న వారివే తొలగించారు. గతంలో ప్రజా ప్రతినిధులుగా పలు హోదాల్లో పనిచేసిన వారి ఓట్లు కూడా తొలగించడం వారి అడ్డగోలుతనానికి నిదర్శనమని పలువురు విమర్శిస్తున్నారు. సంబంధిత ఓటర్లు మళ్లీ దరఖాస్తు చేసుకున్నా చాలా మందికి ఇంకా ఓట్ల పునరుద్ధరణ జరగలేదు. ఎన్నికల ముందు ఓట్లు జాబితా కావడంతో అధికార పార్టీ ఈ కొత్త జాబితాను ఎన్ని అక్రమాలకు తెరతీస్తోందని ఓటర్లు భయపడుతున్నారు. బతికున్న మనిషిని చంపేశారు టెక్కలి మండలం తలగాం గ్రామానికి చెందిన పేడాడ లక్ష్మీనారాయణ అనే వృద్ధుడు ఎప్పటి నుంచో ఓటు వేస్తున్నారు. అయితే ఈయన వైఎస్సార్ సీపీకి అనుకూలంగా ఉన్నారనే కక్షతో ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో ఓటు హక్కును తొలగించారు. ఆయన బతికుండగానే మరణించినట్లు తప్పుడు ధ్రువీకరణతో ఓటును తొలగించారు. ఇప్పటికీ ఆయన ఓటు హక్కును పునరుద్ధరించలేదు. ఓటు తప్పిపోయింది పాలకొండ గతంలో మేజర్ పంచాయతీగా ఉన్నపుడు సర్పంచ్‌గా చేశాను. 2014 ఎన్నికల్లో కూడా ఓటు వినియోగించుకున్నాను. ప్రస్తుతం నాతో పాటు నా కుటుంబంలో నలుగురి ఓట్లు గల్లంతయ్యాయి. ఇప్పటి వరకు పాలకొండ విడిచిపెట్టి వెళ్లింది లేదు. అధికారులను అడిగితే సాంకేతిక కారణాలు చూపిస్తున్నారు. ప్రజాప్రతినిధుల ఓట్లే గల్లంతయితే సాధారణ ప్రజల పరిస్థితి ఏమిటి. – వెలమల మన్మధరావు, మాజీ సర్పంచ్, పాలకొండ చాలా అవకతవకలున్నాయి రాజాం మండలంలో చాలా ఓట్లను టీడీపీకి అనుకూలంగా మార్చుకునే ప్రయత్నంలో నాయకులు ఉన్నారు. ఈ దఫా ఎన్నికల్లో ఎలాగూ గెలవలేమనే ఉద్దేశంతో అడ్డదారులు తొక్కుతున్నారు. టీడీపీకి వ్యతిరేకంగా ఉన్నవారి ఓట్లు తెలియకుండానే తొలగిస్తున్నారు.– పాలవలస శ్రీనివాసరావు, వైఎస్సార్సీపీ మండల కన్వీనర్, రాజాం -
ఓటరోత్సాహం
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో ఎవరిని కదిలించినా రాబోయే ఎన్నికల గురించే చర్చ. ఎవరు ఎటువైపు ఉంటారు..? ఏ వర్గపు ఓట్లు ఎక్కువగా ఉన్నాయి..? అన్న మాటలు ప్రధానంగా వినిపిస్తు న్నాయి. ఈ నేపథ్యంలోనే ఎన్నికల సంఘం కొత్త ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని ముమ్మరంగా చేపట్టింది. 2019 జనవరి నాటికి 18 ఏళ్లు నిండిన వారికి ఓటు నమోదు చేసుకోవడానికి ఇచ్చిన గడువు గత నెల 31తో ముగిసింది. బీఎల్వో, తహసీల్దార్ కార్యాలయం, మీ–సేవ, ఆన్లైన్ ద్వారా ఓటు హక్కు, నమోదు, వివరాల సవరణ కోసం జిల్లాలో ఓటర్లు దరఖాస్తు చేసుకున్నారు. ఓటర్ల నుంచి స్వీకరించిన అభ్యంతరాల తరువాత అధికారులు తుది జాబితాను విడుదలచేశారు. జిల్లాలో కొత్తగా 1,66,571 ఓట్లు నమోదు జిల్లా వ్యాప్తంగా ఆన్లైన్, ఆఫ్‌లైన్ ద్వారా అక్టోబర్ 31 నాటికి ఫారం–6 ద్వారా 1,66,571 మంది ఓటరు నమోదుకు దరఖాస్తు చేసుకున్నారు. అందులో ఆన్లైన్ ద్వారా 97,346 మంది, ఆఫ్‌లైన్ ద్వారా 69,225 మంది నమోదు చేసుకున్నారు. చంద్రగిరి నియోజకవర్గంలో ఎక్కువగా 24,228 మంది దరఖాస్తు చేసుకోవడంతో మొదటి స్థానంలో నిలిచింది. తిరుపతిలో 23,281, పలమనేరులో 17,494, మదనపల్లిలో 13,862, కుప్పంలో 12,272, శ్రీకాళహస్తిలో 10,819, పీలేరులో 10,019, చిత్తూరులో 9,407, జీడీనెల్లూరులో 9,040, నగరిలో 8,155, తంబళ్లపల్లెలో 8,052, పుంగనూరులో 7,644, పూతలపట్టులో 6,802, సత్యవేడులో 5,496 మంది ఓటరుగా నమోదు చేసుకున్నారు. అందులో తక్కువ ఓట్లు నమోదైన నియోజకవర్గం సత్యవేడు. నిర్థారణ అనంతరమే తొలగింపు అధికారులు తయారు చేసిన ముసాయిదా ఓటరు జాబితాలో రెండు సార్లు వచ్చిన పేర్లను మొదట గుర్తిస్తున్నారు. ఆ తరువాత ఆ ఓటరు ఇంటికి వెళ్లి ఈ విషయాన్ని వివరించి ఒక పేరును తొలగించేందుకు అనుమతి తీసుకుంటున్నారు. అలాగే పోలింగ్ కేంద్రాల వారీగా బీఎల్వోలు ఇంటింటికీ వెళ్లి మరోమారు పరిశీలిస్తున్నారు. డబుల్ ఎంట్రీ ఓట్ల తొలగింపుతో నియోజకవర్గంలో దాదాపు వెయ్యి ఓట్లు తగ్గే అవకాశముందని అధికారులు అంచనా వేశారు. ప్రధానంగా తిరుపతి, చిత్తూరు, మదనపల్లె, పుత్తూరు నియోజకవర్గాల్లో రెండుసార్లు పేర్లు నమోదైనట్లు గుర్తించారు. ఓటరు జాబితా పారదర్శకంగా ఉండాలనే సంకల్పంతో ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రద్యుమ్న, జేసీ గిరీష ప్రత్యేక ఇంటింటి సర్వేను చేపడుతున్నారు. మరణించిన వారి పేర్లు లేకుండా ఎలాంటి తప్పులు లేకుండా ఉండే ఓటర్ల జాబితాను తయారు చేసే దిశగా జిల్లా యంత్రాంగం చర్యలు చేపడుతోంది. రెండుసార్లు వచ్చిన పేర్లతో పాటు మరణించిన వారి పేర్లు లేకుండా చూస్తున్నారు. మున్సిపాలిటీ, తహసీల్దార్ కార్యాలయాల్లో మరణ ధ్రువీకరణ పత్రాల ఆధారంగా మరణించిన వారి పేర్లను తొలగిస్తున్నారు. రెండు పేర్లు ఉంటే బీఎల్వోలదే బాధ్యతని అధికారులు తేల్చి చెబుతున్నారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం అక్టోబర్ 31తో ముసాయిదా ఓటర్ల సవరణ జాబితా ముగిసింది. ఓటరు నమోదుకు సమయం అయిపోయిందన్న అపోహ చాలా మందిలో ఉన్నట్టు తెలిసింది. అలాంటి వారు ఆన్లైన్లో నమోదుకు దరఖాస్తు చేసుకునేందుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. జిల్లాలో చేపట్టిన ప్రచారం సత్ఫలితాలు ఇస్తోంది. అనంతరం అనుబంధ ఓటరు జాబితాను ప్రచురించేందుకు ఎన్నికల సంఘం అధికారులు కార్యాచరణ రూపొందిస్తారు.– గిరీష, జిల్లా జాయింట్ కలెక్టర్ విస్తృత ప్రచారంతో ఫలితం జిల్లాలోని గ్రామాల్లో ఓటరు నమో దు కోసం కలెక్టర్ ప్రద్యుమ్న, జేసీ గిరీష విస్తృతంగా ప్రచారం చేశారు. పోలింగ్ బూత్ వారీగా కేంద్రాలను ఏర్పాటుచేసి 2019 జనవరి 1వ తేదీ నాటికి 18 ఏళ్లు నిండిన యువతీ యువకులు ఓటరుగా నమోదు చేసుకునేలా చర్యలు తీసుకున్నారు. తప్పొప్పుల సవరణ, మార్పులు, చేర్పులు చేసుకోవచ్చని చెప్పారు. దీంతో దరఖాస్తులు ఎక్కువగా వచ్చా యి. ముఖ్యంగా యువత ఎక్కువ మంది ఉండడం గమనార్హం. -
ముగిసిన ఓటరు నమోదు
కృష్ణాజిల్లా, చిలకలపూడి(మచిలీపట్నం): సెప్టెంబరు 1 నుంచి అక్టోబర్31వ తేదీ వరకు జరిగిన ఓటరు నమోదు ప్రక్రియలో జిల్లా వ్యాప్తంగా 2,25,669 ఓటరుగా నమోదు చేసుకునేందుకు దరఖాస్తు చేసుకున్నారు. ఇటీవల విడుదల చేసిన ఓటర్ల జాబితా ప్రకారం జిల్లా వ్యాప్తంగా 30,51,122 మంది ఓటర్లు ఉన్నారు. అయితే 2011 జనాభా లెక్కల ప్రకారం 18 ఏళ్లు పైబడిన వారు ఇంకా ఎంత మంది ఓటరుగా నమోదు చేసుకోవాలనే దానిపై కలెక్టరేట్లోని ఎన్నికల విభాగం సిబ్బంది కసరత్తు ప్రారంభించారు. గడవు పెంచాలి.. నియోజకవర్గాల వారీగా తొలగించిన ఓట్లు, చేర్పించుకునే ప్రక్రియలో ఆయా పార్టీల నాయకులు కసరత్తు చేసినప్పటికీ ఎక్కువశాతం ఓట్లు నమోదు కాలేదు. సర్వర్ సమస్య, కొంత మంది రెవెన్యూ సిబ్బంది లిఖితపూర్వకంగా ఇచ్చిన దరఖాస్తులను నిర్లక్ష్యం చేయటం తదితర కారణాలతో పూర్తిస్థాయిలో ఓటర్ల నమోదు ప్రక్రియ జరగలేదనేది కొంత మంది పార్టీల నాయకుల ఆరోపణ. ఎన్నికల సంఘం ఈ ప్రక్రియను మరికొన్ని రోజులు పొడిగిస్తే పూర్తిస్థాయిలో ఓటర్ల నమోదు జరుగుతుందని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే దీనిపై గురువారం సాయంత్రం వరకు ఎన్నికల సంఘం నుంచి ఎటువంటి ఉత్తర్వులు వెలువడలేదు. ఆన్లైన్లో అవకాశం.. బుధవారం ఓటరు నమోదు కార్యక్రమం ముగిసినప్పటికీ ఇంకా నూతనంగా ఓటరుగా నమోదు చేసుకునే వారు ఫారం–6 ద్వారాఆన్లైన్లో దరఖాస్తును అప్లోడ్ చేసుకునే అవకాశం ఉందని సిబ్బంది చెబుతున్నారు. 31వ తేదీ వరకు దరఖాస్తు చేసుకున్న వారిని పరిగణనలోకి తీసుకుంటారా లేదా ప్రస్తుతం ఓటరుగా నమోదయ్యేందుకు చేసుకున్న దరఖాస్తులు పరిశీలిస్తారా అనేది ఎన్నికల సంఘం నిర్ణయించాల్సి ఉంది. త్వరలో ఇంటింటి పరిశీలన ఎక్కువ మంది ఓటరుగా నమోదు చేసుకునేందుకు ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం జిల్లా యంత్రాంగం సిస్టమేటిక్ ఓటరెడ్యుకేషన్ అండ్ ఎలక్ట్రోరల్ పార్టిసిపేషన్ (స్వీప్) ద్వారా ఎన్నో అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఇటీవల 4,66 స్వేర్ ఫీట్లో రంగోలి కార్యక్రమాన్ని కూడా జిల్లా యంత్రాంగం నిర్వహించింది. ఈ కార్యక్రమం అనంతరం జిల్లా వ్యాప్తంగా పలు అంశాల్లో వేల సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. ప్రస్తుతం ఓటరు నమోదు, తొలగించటం, సవరణలు, పోలింగ్ కేంద్రాల మార్పులకు జిల్లా వ్యాప్తంగా 2,47,815 దరఖాస్తులు వచ్చాయి. వచ్చిన దరఖాస్తులను నవంబరు నెలలో ఇంటింటికి తిరిగి వాటిని పరిశీలించి ఎన్నికల సంఘానికి పంపటం జరుగుతుంది. -
ఓటర్లకు న్యాయం చేసేందుకే.. : మర్రి
సాక్షి, హైదరాబాద్: ఓటరు నమోదు కార్యక్రమం అస్తవ్యస్తంగా సాగుతోందని, ఓటర్లకు న్యాయం చేసేందుకే తాము కోర్టులో పోరాడుతున్నామని టీపీసీసీ ఎన్నికల సమన్వయ కమిటీ చైర్మన్ మర్రిశశిధర్‌రెడ్డి అన్నారు. ఇష్టం ఉన్న వారి ఓట్లను జాబితాలో ఉంచి, లేని వారి ఓట్లను తొలగిస్తున్నారని, టీఆర్ఎస్ ప్రభుత్వ ప్రోద్బలంతోనే ఇదంతా జరుగుతోందని ఆయన ఆరోపించారు. శనివారం గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడుతూ తాము వేసిన కేసులో కౌంటర్ దాఖలు సందర్భంగా హైకోర్టును తప్పుదోవ పట్టించేలా చెప్పిన అంశాలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఎన్నికల కమిషన్ చెప్పిన అంశాల్లో చాలా తప్పులున్నాయని, ఓటర్ల తుదిజాబితా అర్ధరాత్రి విడుదల చేస్తారా? అని ఆయన ప్రశ్నించారు. ఓటరు నమోదు అవకతవకలపై తాము వేసిన కేసు హైకోర్టులో సజీవంగా ఉందని, ఈనెల 31న మరోసారి విచారణకు రానుందని శశిధర్‌రెడ్డి వెల్లడించారు. -
పోటెత్తిన యువత
రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లావ్యాప్తంగా ప్రత్యేక ఓటరు నమోదు సవరణ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ప్రధానంగా ఓటు హక్కులేని యువత దాదాపు 85 శాతం వరకు నమోదు చేసుకున్నట్లు స్పష్టమవుతోంది. ఓటు నమోదుపై జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ ప్రత్యేక శ్రద్ధతో పదిరోజులుగా చేసిన విస్తృత ప్రచార కార్యక్రమాలతో యువతరం పోటెత్తింది. ఇంటర్, డిగ్రీ, ఇంజినీరింగ్ కళాశాలల్లో ఓటు నమోదు కార్యక్రమాలు, జిల్లాలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటా సర్వేలతోపాటు ప్రత్యేక ఓటరు నమోదు కేంద్రాల ఏర్పాటుతో ప్రజలు, యువత ఆఖరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. జిల్లావ్యాప్తంగా కొత్తగా ఓటరు నమోదుకు పది రోజుల్లో 65 వేల మంది వరకు దరఖాస్తు చేసుకున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. కరీంనగర్‌సిటీ: వచ్చిన దరఖాస్తులను మంగళవారం అర్ధరాత్రి వరకు పరిశీలించి ఉన్నతాధికారులకు నివేదించే పనిలో నిమగ్నమయ్యారు. పది రోజులుగా రెవెన్యూ, ఇతర శాఖల అధికారులు ఎన్నికల కసరత్తులో భాగంగా ఓటరు నమోదు, సవరణలపైనే దృష్టి సారించారు. ఎన్నికల సంఘం ఈనెల 10న ప్రకటించిన ముసాయిదా జాబితా అనంతరం సెప్టెంబర్ 25 వరకు ఓటరుగా నమోదు చేసుకునేందుకు, మార్పులు, చేర్పులకు అవకాశం కల్పించింది. జిల్లాలో 45 వేలకు పైగా యువత ఓటు హక్కు పొందాల్సి ఉండగా ఆ స్థాయిలో ఓటరుగా నమోదైనట్లు తెలుస్తోంది. తొలగింపులు, మార్పులు, చేర్పులు, గల్లంతైన ఓటర్ల నేపథ్యంలో సంఖ్యలో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ఓటు నమోదు చేసుకోవడానికి ఉన్న చివరి అవకాశం ఇది. ఇందుకోసం ఎన్నికల సంఘం ప్రత్యేక చర్యలు తీసుకుంది. 65 వేల మందిలో కేవలం మ్యాన్‌వల్‌గానే దరఖాస్తులు రాగా ఆన్‌లైన్‌లోనూ మరిన్ని దరఖాస్తులు వచ్చాయి. పూర్తి వివరాలు అధికారికంగా వెలువడాల్సి ఉంది. చాలా మంది పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో స్వయంగా పోలింగ్ కేంద్రాలకు వెళ్లి తమ ఓటును నమోదు చేసుకోవడానికి తాపత్రయ పడ్డారు. అన్ని తహసీల్దార్ కార్యాలయాలు కొన్ని రోజులుగా ఓటరు నమోదు, సవరణలకు వచ్చిన వారితో కిక్కిరిసిపోయాయి. 2018 జనవరి 1 నాటికి 18 సంవత్సరాలు నిండిన వారంతా ఓటు హక్కు పొందేందుకు అర్హులుగా ఎన్నికల సంఘం ప్రకటించిన విషయం తెలిసిందే. జిల్లాలో ప్రధానంగా కరీంనగర్ పట్టణం ఓటర్ల జాబితాలో చాలా వరకు ఓట్లు గల్లంతైనట్లు వచ్చిన ఆరోపణల్లో వాస్తవముందని గ్రహించిన యంత్రాంగం మరోసారి ఇంటింటి సర్వే చేపట్టింది. కరీంనగర్ పట్టణం ఓట్ల గల్లంతు, తొలగింపు, ఓటర్ల నమోదు శాతంలో చాలా వెనుకబడి ఉంది. ఈ క్రమంలో కరీంనగర్ పట్టణంపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీల సహకారం తీసుకున్నారు. కలెక్టరేట్లో ప్రత్యేకంగా సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేసి ప్రజల నుంచి ఫోన్ల ద్వారా ఓటరు జాబితాలో పేరుందో లేదో తెలియజేశారు. అందుకు వివిధ శాఖల నుంచి సిబ్బంది ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు పనిచేశారు. కరీంనగరంలోని పది ప్రాంతాల్లో ప్రత్యేక ఓటరు అవగాహన కేంద్రాలను ఏర్పాటు చేసి 50 డివిజన్లలో రెండు డివిజన్లకు ఒక జిల్లా అధికారిని ప్రత్యేకాధికారిగా నియమించి ఆయా శాఖల పరిధిలోని సిబ్బందితో ఇంటింటి సర్వే చేపడుతూ అర్హులైన ఓటర్లను నమోదుతో పాటు సవరణలు చేపట్టారు. 250 మంది బీఎల్వోలు, 100 మున్సిపల్ సిబ్బంది విధులు నిర్వహించారు. జిల్లాలో సోమవారం నాటికి ఓటరు నమోదుకు గాను 57,040 దరఖాస్తులు వచ్చాయి. తొలగింపు, ఆక్షేపణలకు సంబంధించి (ఫారం–7) 10,125, వివరాలను సరిదిద్దేందుకు (ఫారం–8) 4,314, ఒక పోలింగ్ నుంచి మరోపోలింగ్ కేంద్రానికి మార్పునకు (ఫారం–8ఏ) 3,640 దరఖాస్తులు వచ్చాయి. గల్లంతైన పేర్లను క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హులకు ఓటు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇదిలా ఉంటే డబుల్ ఓటర్ల తొలగింపునకు తెలంగాణలో ఎన్నికల సంఘం మొట్టమొదటిసారిగా ప్రత్యేక సాఫ్ట్వేర్ రూపొందించింది. అందులో భాగంగా రెండు, మూడు ప్రాంతాల్లో ఓటు హక్కు ఉన్నవారు ఒకే ప్రాంతంలో ఓటు హక్కు కలిగి ఉండేలా నోటీసులు అందించి చర్యలు తీసుకున్నారు. ఒకటి కన్నా ఎక్కువ చోట్ల ఓట్లున్న వారికి గుర్తించేందుకు ఎన్నికల సంఘం ప్రస్తుతం నూతన టెక్నాలజీని వినియోగించి ఈఆర్వోనెట్ వీటై జీరో పేరిట సాఫ్ట్‌వేర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ద్వారా జాబితాలో రెండు చోట్ల ఓటు హక్కును కలిగిన వారిని గుర్తించారు. ప్రస్తుతం జిల్లాలో 12 వేల మంది వరకు ఉన్నట్లు గుర్తించారు. వీరికి ఏదో ప్రాంతంలో జాబితా నుంచి తొలగించనున్నారు. ఇంకా మరణించిన వారికి సంబంధించి క్షేత్రస్థాయిలో తహసీల్దార్ల నుంచి మరణ ధ్రువీకరణ పత్రాలు తీసుకుని తొలగిస్తున్నారు. ఈనెల 25 వరకే ఓటరు నమోదుకు ఉన్న గడువును పొడిగించాలన్న వివిధ పార్టీలు, వర్గాల నుంచి వచ్చిన విన్నపాన్ని ఎన్నికల సంఘం స్వీకరించలేదు. అయితే.. ఇంకా ఓటు నమోదు చేసుకునే యువత 10 శాతం మిగిలిపోయారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రత్యేక ఓటరు నమోదు, సవరణల ప్రక్రియలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అక్టోబర్ 8న ఓటర్ల తుది జాబితా వెలువరించనున్నారు. -
మీ ఓటును సరిచూసుకోండి..
సాక్షి, సిటీబ్యూరో/బంజారాహిల్స్: వచ్చే ఏడాది జరుగుతాయనుకున్న అసెంబ్లీ ఎన్నికలు ముందే జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటి దాకా ఓటరు జాబితాలో పేర్లు లేని వారు ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి వారికోసం ఓటరు జాబితా సవరణల షెడ్యూల్ అవకాశం కల్పించింది. ఈ నెల 10వ తేదీ నుంచి 25వ తేదీ వరకు పేర్లు నమోదు చేయించుకోవచ్చునని ఎన్నికల కమిషన్ ప్రకటించి తగిన ఏర్పాట్లు చేయాల్సిందిగా జిల్లాల ఎన్నికల అధికారులను ఆదేశించింది. అందుకు అనుగుణంగా గ్రేటర్‌లోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో అవసరమైన ఫారాలతో పాటు ఎన్నికల సిబ్బంది అందుబాటులో ఉండాలని సూచించింది. కానీ, నగరంలోని పలు ప్రాంతాల్లో ఓటరు నమోదు సిబ్బంది అందుబాటులో ఉండడం లేదు. కొన్ని ప్రాంతాల్లో ఇంకా కేంద్రాలే తెరచుకోలేదు. ఈ ప్రక్రియ ఎలా జరుగుతుందో తెలుసుకుందామని శుక్రవారం ఆకస్మికంగా తనిఖీకి వెళ్లిన హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఎం. దానకిశోర్.. బంజారాహిల్స్‌లోని ముఫకంజా కాలేజీ సెంటర్లోని పరిస్థితి చూసి షాక్ తిన్నారు. ఇక్కడి పోలింగ్ కేంద్రంలో బూత్ లెవెల్ అధికారి(బీఎల్ఓ) లేకపోవడంతో అవాక్కయ్యారు. అక్కడ నియమించిన శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్ (ఎస్ఎఫ్ఏ) నగేశ్ గైర్హాజరు కావడంతో వెంటనే అతన్ని విధుల నుంచి తొలగించి ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని 32వ సెక్షన్ కింద కేసు నమోదు చేయాలని సంబంధిత ఓటరు నమోదుఅధికారికి ఆదేశాలు జారీ చేశారు. ఇదే నియోజకవర్గంలోని బంజారాహిల్స్ రోడ్ నెం.10 నూర్‌నగర్‌లోని నిజామియా హైస్కూల్ పోలింగ్ కేంద్రంలో శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల వరకు సిబ్బంది ఎవరూ రాకపోగా.. కనీసం గేట్లు కూడా తెరవలేదు. కేంద్రాల్లో వెక్కిరిస్తున్న సమస్యలు కొత్తగా ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకోవాలనుకున్న వారికి, చిరునామా మార్పులు వంటి సవరించుకోవాలనుకున్న వారికి ఎదురవుతున్న ఇబ్బందులకు ఇవి మచ్చుతునకలు. ఈ నెల 10 నుంచే పోలింగ్ కేంద్రాల్లో బీఎల్ఓలు ముసాయిదా ఓటర్ల జాబితాతో సిద్ధంగా ఉంటారని, అభ్యంతరాల స్వీకరణ, ఓటరు నమోదు చేపట్టి అక్కడికక్కడే సమస్యలు పరిష్కరిస్తారని జీహెచ్ఎంసీ దానకిశోర్‌తో పాటు రాష్ట్ర ఎన్నికల అధికారి రజత్‌కుమార్ సైతం ప్రకటించారు. కానీ నగరంలోని పలు పోలింగ్ కేంద్రాల్లో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. హైదరాబాద్ జిల్లా పరిధిలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాలకు 3,826 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు కావాల్సి ఉండగా చాలా ప్రాంతాల్లో ఆ దిశగా చర్యలు చేపట్టలేదు. నామమాత్రంగా తెరచిన చోట్ల సిబ్బంది లేరు. మరికొన్ని ప్రాంతాల్లో సామగ్రి లేదు. యాకూత్‌పురా నియోజకవర్గంలోని కుర్మగూడ హైస్కూల్ పోలింగ్ కేంద్రానికి సిబ్బంది ఉన్నా, అవసరమైన సామగ్రి ఇవ్వకపోవడంతో ఇబ్బందులెదురవుతదున్నాయని స్థానికులు పేర్కొన్నారు. దానకిశోర్ ఆకస్మిక తనిఖీ హైదరాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా సవరణ, కొత్త ఓటర్ల నమోదుకు నియమించిన బీఎల్ఓలు విధుల్లో నిర్లక్ష్యం కనబరిస్తే ప్రజాప్రాతినిధ్యం చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిషోర్ హెచ్చరించారు. ముఫకంజా కాలేజీ తనిఖీ సందర్భంగా అక్కడ పలు సమస్యలను ఆయన గుర్తించారు. నూతన ఓటరు నమోదుకు ఫారం–6తో పాటు ఓటర్ల బదిలీ, మరణించిన వారి ఓట్లను తొలగించేందుకు అవసరమైన దరఖాస్తులను సిద్ధంగా ఉంచుకోవాలని సిబ్బందికి సూచించారు. అనంతరం బంజారాహిల్స్ రోడ్ నెం–13లోని పోలింగ్ కేంద్రంలో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను తనిఖీ చేశారు. తమకు కేటాయించిన ప్రాంతాల్లో విధి నిర్వహణపై నిర్లక్ష్యం వహించడం, గైర్హాజరయ్యే బీఎల్ఓలకు జైలు శిక్షతో పాటు నగదు జరిమానా విధిస్తామని హెచ్చరించారు. ఎన్నికల విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించే సిబ్బందిపై చర్యలు తీసుకుంటే కోర్టులు కూడా జోక్యం చేసుకోవన్నారు. మీ ఓటును సరిచూసుకోండి ఓటరు జాబితాలో తమ పేరు, కుటుంబ సభ్యుల పేర్లు ఉన్నాయో, లేవో తెలుసుకోవడానికి www.ceotelangana.nic.in లో గాని, సమీపంలోని పోలింగ్ బూత్‌లోగాని చూసుకోవాలి. పేరు లేకుంటే అదే వెబ్సైట్లో లేదా సంబంధిత బీఎల్ఓ వద్ద ఓటర్‌గా నమోదు చేసుకోవాలి. ఇందుకు నిర్దేశిత ఫారంతో పాటు 4 ఫొటోలు, చిరునామా రుజువు పత్రం (గ్యాస్ బిల్లు, వాటర్ బిల్లు, డ్రైవింగ్ లైసెన్స్, కరెంట్ బిల్లు వంటివి) వయసు రుజువు పత్రం(డ్రైవింగ్ లైసెన్స్/ఆధార్/పదో తరగతి మార్కుల మెమో)సమర్పించాలి. ఓటర్లు ఈనెల 25 లోగా పేరు నమోదు చేసుకోవాలి. -
ఓటరు నమోదుకు విద్యార్థులకు అవకాశం
సాక్షి, రంగారెడ్డి జిల్లా : విద్యార్థులు ఓటరుగా నమోదు చేసుకునేందుకు జిల్లా యంత్రాంగం అవకాశం కల్పించింది. ఓటరు నమోదు కోసం శుక్రవారం ఇంటర్, డిగ్రీ కళాశాలల్లో ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ విద్యాసంస్థల్లో చదువుతున్న 18 ఏళ్లు నిండిన విద్యార్థులంతా ఓటు హక్కు పొందేం దుకు ఈ చర్యలు తీసుకున్నారు. గ్రామీణ నియోజకవర్గాలైన ఇబ్రహీంపట్నం, చేవెళ్ల, కల్వకుర్తి, షాద్‌నగర్ పరిధిలో ఉన్న కళాశాలల్లోనే ‘ప్రత్యేక ఓటరు నమోదు’ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు కలెక్టర్ రఘునందన్‌రావు తెలిపారు. అర్హత గల విద్యార్థులందరినీ ఓటరుగా నమోదు చేసే బాధ్యతలను ఈఆర్ఓలకు అప్పగించారు. ఇందుకు అన్ని కళాశాలల ప్రిన్సిపాళ్లు సహకరించాలని ఆదేశాలు జారీ చేశారు. అన్ని నమోదు కేంద్రాల్లో అవసరమైన ఫారంలు అందుబాటులో ఉంటాయి. నివాస చిరునామా ధ్రువీకరణ పత్రం, పాస్‌పోర్ట్ సైజు ఫొటోని విద్యార్థులు తమ వెంట ఉంచుకోవాల్సి ఉంటుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ కేంద్రాలు పనిచేస్తాయి. ఇప్పటికే ఓటు హక్కు పొందిన విద్యార్థులు చేర్పులు మార్పులు సైతం చేసుకోవచ్చు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు పొందేందుకు యంత్రాంగం విస్తృత చర్యలు చేపడుతోంది. ఇప్పటికే ఈనెల 4వ తేదీన గ్రామీణ నియోజకవర్గాల్లో అన్ని పోలింగ్ బూత్‌లలో ప్రత్యేక నమోదు కేంద్రాన్ని ఏర్పాటు చేసి చాలా మందిని ఓటరుగా నమోదు చేశారు. అలాగే ఈనెల 11వ తేదీన కూడా ఈ కేంద్రాలను కొనసాగించనున్నారు. అయితే విద్యార్థులు ఓటరుగా నమోదు చేసుకునేందుకు నిరాసక్తత కనబర్చుతున్నట్లు యంత్రాంగం దృష్టికి రావడంతో దాన్ని అధిగమించడంలో భాగంగా శుక్రవారం అన్ని ఇంటర్, డిగ్రీ కళాశాలల్లోనూ ప్రత్యేక ఓటరు నమోదు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. -
ఓటర్ నమోదును వేగవంతం చేయాలి
► ఎన్నికల పరిశీలకులు వీరబ్రహ్మయ్య ధర్మపురి : నూతన ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర ఎన్నికల పరిశీలకులు వీరబ్రహ్మయ్య బీఎల్వోలను ఆదేశించారు. ధర్మపురి మేజర్‌పంచాయతీ కార్యాలయంలో ఆదివారం ఓటరు నమోదుకు సంబంధించిన ఫారం– 6, 7, 8లను పరిశీలించారు. ఫారం–6 కొత్త ఓటరు నమోదు చేసుకోవడం కోసం, ఫారం–7 చనిపోయిన వారి పేర్లు తొలగించడం కోసం, వివాహమై వెళ్లిన వారి పేర్లు తొలగించడం కోసం అదే విధంగా 8ఏ ఫారం ఓటరు నమోదులో తప్పొప్పులను సవరించడం కోసం ఉపయోగించాలన్నారు. ఈకార్యక్రమంలో తహసీల్దార్ మహేశ్వర్, ఆర్ఐ శరత్, అంగన్ వాడలు మాధవీలత, రమాదేవి, బేర విజయలక్ష్మీ పుష్పలత ఉన్నారు.