సాక్షి, రంగారెడ్డి జిల్లా : విద్యార్థులు ఓటరుగా నమోదు చేసుకునేందుకు జిల్లా యంత్రాంగం అవకాశం కల్పించింది. ఓటరు నమోదు కోసం శుక్రవారం ఇంటర్, డిగ్రీ కళాశాలల్లో ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ విద్యాసంస్థల్లో చదువుతున్న 18 ఏళ్లు నిండిన విద్యార్థులంతా ఓటు హక్కు పొందేం దుకు ఈ చర్యలు తీసుకున్నారు. గ్రామీణ నియోజకవర్గాలైన ఇబ్రహీంపట్నం, చేవెళ్ల, కల్వకుర్తి, షాద్‌నగర్ పరిధిలో ఉన్న కళాశాలల్లోనే ‘ప్రత్యేక ఓటరు నమోదు’ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు కలెక్టర్ రఘునందన్‌రావు తెలిపారు. అర్హత గల విద్యార్థులందరినీ ఓటరుగా నమోదు చేసే బాధ్యతలను ఈఆర్‌ఓలకు అప్పగించారు. ఇందుకు అన్ని కళాశాలల ప్రిన్సిపాళ్లు సహకరించాలని ఆదేశాలు జారీ చేశారు.
అన్ని నమోదు కేంద్రాల్లో అవసరమైన ఫారంలు అందుబాటులో ఉంటాయి. నివాస చిరునామా ధ్రువీకరణ పత్రం, పాస్‌పోర్ట్ సైజు ఫొటోని విద్యార్థులు తమ వెంట ఉంచుకోవాల్సి ఉంటుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ కేంద్రాలు పనిచేస్తాయి. ఇప్పటికే ఓటు హక్కు పొందిన విద్యార్థులు చేర్పులు మార్పులు సైతం చేసుకోవచ్చు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు పొందేందుకు యంత్రాంగం విస్తృత చర్యలు చేపడుతోంది. ఇప్పటికే ఈనెల 4వ తేదీన గ్రామీణ నియోజకవర్గాల్లో అన్ని పోలింగ్ బూత్‌లలో ప్రత్యేక నమోదు కేంద్రాన్ని ఏర్పాటు చేసి చాలా మందిని ఓటరుగా నమోదు చేశారు. అలాగే ఈనెల 11వ తేదీన కూడా ఈ కేంద్రాలను కొనసాగించనున్నారు. అయితే విద్యార్థులు ఓటరుగా నమోదు చేసుకునేందుకు నిరాసక్తత కనబర్చుతున్నట్లు యంత్రాంగం దృష్టికి రావడంతో దాన్ని అధిగమించడంలో భాగంగా శుక్రవారం అన్ని ఇంటర్, డిగ్రీ కళాశాలల్లోనూ ప్రత్యేక ఓటరు నమోదు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment