సాక్షి, కడప : ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధం కంటే పదునైనది. ఓటును నమోదు చేసుకోవడంతోపాటు ఓటు వేయడం అర్హులైన ప్రతి ఒక్కరి బాధ్యత. కేంద్ర ఎన్నికల సంఘం దివ్యాంగులకు ప్రత్యేకంగా ఒక యాప్‌ను రూపొందించింది. దీని ద్వారా వారు సులభతరంగా ఓటు నమోదు చేసుకుంటున్నారు. అలాగే ఓటింగ్ రోజున వీరికి ప్రత్యేకంగా కొన్ని సదుపాయాలను కల్పించారు.
ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని పెంచడానికి కేంద్ర ఎన్నికల సంఘం అన్ని చర్యలు చేపడుతోంది. కాగా ఇన్నాళ్లు సరైన సౌకర్యాలు లేకపోవడంతో దివ్యాంగులు ఓటు నమోదుకు, ఓటును సద్వినియోగం చేసుకోవడానికి కొంత దూరమయ్యారు. ఇప్పుడు వారిలో చైతన్యం కలిగించడానికి ఎన్నికల సంఘం సరికొత్త విధానం అందుబాటులోకి తెచ్చింది. అందులో భాగంగా ప్రత్యేకంగా ఒక యాప్ రూపొందించారు.
నమోదు.. సౌకర్యాలు ఇలా..
ఎన్నికల సంఘం ప్రవేశ పెట్టిన యాప్ విధానం ఇలా.. గూగుల్ ప్లే స్టోర్‌లోకి వెళ్లి సీడబ్ల్యూడీ అని టైప్ చేస్తే ఎన్నికల సంఘం రూపొందించిన పర్సన్స్ విత్ డిజెబిలిటి యాప్ వస్తుంది. దీన్ని డౌన్ లోడ్ చేసుకుంటే.. అందులో ఉన్న సౌకర్యాలు కనిపిస్తాయి. కొత్త ఓటు నమోదు, చిరునామా మార్పు, తప్పుల సవరణ, తొలగింపు వివరాలు ఉంటాయి.
అలాగే ఓటింగ్ రోజున వీల్‌చైర్ అవసరం అయితే ఆ సదుపాయాన్ని పొందవచ్చు. అదే విధంగా పోలింగ్ బూత్ చిరునామా, ఎన్నికల కమిషన్‌కు సంబంధించిన తాజా సమాచారాన్ని ఎప్పటికి అప్పుడు తెలుసుకోవచ్చు. అలాగే ఓటరు పేరు, తండ్రి పేరు నియోజకవర్గం పేరు నమోదు చేసి సెర్చ్ చేస్తే ఓటు ఉందో.. లేదో..? తెలుసుకోవచ్చు.
ప్రయాస లేకుండా ఓటు వేసి ఇంటికి...
దివ్యాంగులు యాప్ ద్వారా అందించిన సమాచారం ఆధారంగా అధికారులు చర్యలు చేపడుతారు. వారున్న చోటికి వాహనాలను పంపిస్తారు. ఆ వాహనం పోలింగ్ కేంద్రానికి వెళ్తుంది. సదరు వ్యక్తి ఓటు హక్కును వినియోగించుకున్న తరువాత తిరిగి వారింటి వద్దకు తీసుకెళ్లే బాధ్యతను పోలింగ్ అధికారులు పర్యవేక్షిస్తారు.
అలాగే అవసరమైన వారికి వీల్‌చైర్ సదుపాయం కూడా కల్పిస్తారు. ఇలా ఎన్నికల కమిషన్ దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా అన్ని చర్యలు చేపట్టింది. కాగా ఈ ఓటరు నమోదుపై జిల్లా విభిన్న ప్రతిభావంతులు సంక్షేమ శాఖ అవగాహన కార్యక్రమాలను కూడా చేపట్టింది.
రండి.. ఓటెత్తుదాం..
ఓటు హక్కు నమోదు గడువు శుక్రవారంతో ముగియనుంది. ఇంకా ఓటు నమోదును చేసుకోని వారు త్వరపడాలి. ప్రత్యేక సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment