చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో ఎవరిని కదిలించినా రాబోయే ఎన్నికల గురించే చర్చ. ఎవరు ఎటువైపు ఉంటారు..? ఏ వర్గపు ఓట్లు ఎక్కువగా ఉన్నాయి..? అన్న మాటలు ప్రధానంగా వినిపిస్తు న్నాయి. ఈ నేపథ్యంలోనే ఎన్నికల సంఘం కొత్త ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని ముమ్మరంగా చేపట్టింది. 2019 జనవరి నాటికి 18 ఏళ్లు నిండిన వారికి ఓటు నమోదు చేసుకోవడానికి ఇచ్చిన గడువు గత నెల 31తో ముగిసింది. బీఎల్‌వో, తహసీల్దార్ కార్యాలయం, మీ–సేవ, ఆన్‌లైన్ ద్వారా ఓటు హక్కు, నమోదు, వివరాల సవరణ కోసం జిల్లాలో ఓటర్లు దరఖాస్తు చేసుకున్నారు. ఓటర్ల నుంచి స్వీకరించిన అభ్యంతరాల తరువాత అధికారులు తుది జాబితాను విడుదలచేశారు.
జిల్లాలో కొత్తగా 1,66,571 ఓట్లు నమోదు
జిల్లా వ్యాప్తంగా ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ద్వారా అక్టోబర్ 31 నాటికి ఫారం–6 ద్వారా 1,66,571 మంది ఓటరు నమోదుకు దరఖాస్తు చేసుకున్నారు. అందులో ఆన్‌లైన్ ద్వారా 97,346 మంది, ఆఫ్‌లైన్ ద్వారా 69,225 మంది నమోదు చేసుకున్నారు. చంద్రగిరి నియోజకవర్గంలో ఎక్కువగా 24,228 మంది దరఖాస్తు చేసుకోవడంతో మొదటి స్థానంలో నిలిచింది. తిరుపతిలో 23,281, పలమనేరులో 17,494, మదనపల్లిలో 13,862, కుప్పంలో 12,272, శ్రీకాళహస్తిలో 10,819, పీలేరులో 10,019, చిత్తూరులో 9,407, జీడీనెల్లూరులో 9,040, నగరిలో 8,155, తంబళ్లపల్లెలో 8,052, పుంగనూరులో 7,644, పూతలపట్టులో 6,802, సత్యవేడులో 5,496 మంది ఓటరుగా నమోదు చేసుకున్నారు. అందులో తక్కువ ఓట్లు నమోదైన నియోజకవర్గం సత్యవేడు.
నిర్థారణ అనంతరమే తొలగింపు
అధికారులు తయారు చేసిన ముసాయిదా ఓటరు జాబితాలో రెండు సార్లు వచ్చిన పేర్లను మొదట గుర్తిస్తున్నారు. ఆ తరువాత ఆ ఓటరు ఇంటికి వెళ్లి ఈ విషయాన్ని వివరించి ఒక పేరును తొలగించేందుకు అనుమతి తీసుకుంటున్నారు. అలాగే పోలింగ్ కేంద్రాల వారీగా బీఎల్‌వోలు ఇంటింటికీ వెళ్లి మరోమారు పరిశీలిస్తున్నారు. డబుల్ ఎంట్రీ ఓట్ల తొలగింపుతో నియోజకవర్గంలో దాదాపు వెయ్యి ఓట్లు తగ్గే అవకాశముందని అధికారులు అంచనా వేశారు. ప్రధానంగా తిరుపతి, చిత్తూరు, మదనపల్లె, పుత్తూరు నియోజకవర్గాల్లో రెండుసార్లు పేర్లు నమోదైనట్లు గుర్తించారు. ఓటరు జాబితా పారదర్శకంగా ఉండాలనే సంకల్పంతో ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రద్యుమ్న, జేసీ గిరీష ప్రత్యేక ఇంటింటి సర్వేను చేపడుతున్నారు.
మరణించిన వారి పేర్లు లేకుండా
ఎలాంటి తప్పులు లేకుండా ఉండే ఓటర్ల జాబితాను తయారు చేసే దిశగా జిల్లా యంత్రాంగం చర్యలు చేపడుతోంది. రెండుసార్లు వచ్చిన పేర్లతో పాటు మరణించిన వారి పేర్లు లేకుండా చూస్తున్నారు. మున్సిపాలిటీ, తహసీల్దార్ కార్యాలయాల్లో మరణ ధ్రువీకరణ పత్రాల ఆధారంగా మరణించిన వారి పేర్లను తొలగిస్తున్నారు. రెండు పేర్లు ఉంటే బీఎల్‌వోలదే బాధ్యతని అధికారులు తేల్చి చెబుతున్నారు.
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు
ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం అక్టోబర్ 31తో ముసాయిదా ఓటర్ల సవరణ జాబితా ముగిసింది. ఓటరు నమోదుకు సమయం అయిపోయిందన్న అపోహ చాలా మందిలో ఉన్నట్టు తెలిసింది. అలాంటి వారు ఆన్‌లైన్‌లో నమోదుకు దరఖాస్తు చేసుకునేందుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. జిల్లాలో చేపట్టిన ప్రచారం సత్ఫలితాలు ఇస్తోంది. అనంతరం అనుబంధ ఓటరు జాబితాను ప్రచురించేందుకు ఎన్నికల సంఘం అధికారులు కార్యాచరణ రూపొందిస్తారు.– గిరీష, జిల్లా జాయింట్ కలెక్టర్
విస్తృత ప్రచారంతో ఫలితం
జిల్లాలోని గ్రామాల్లో ఓటరు నమో దు కోసం కలెక్టర్ ప్రద్యుమ్న, జేసీ గిరీష విస్తృతంగా ప్రచారం చేశారు. పోలింగ్ బూత్ వారీగా కేంద్రాలను ఏర్పాటుచేసి 2019 జనవరి 1వ తేదీ నాటికి 18 ఏళ్లు నిండిన యువతీ యువకులు ఓటరుగా నమోదు చేసుకునేలా చర్యలు తీసుకున్నారు. తప్పొప్పుల సవరణ, మార్పులు, చేర్పులు చేసుకోవచ్చని చెప్పారు. దీంతో దరఖాస్తులు ఎక్కువగా వచ్చా యి. ముఖ్యంగా యువత ఎక్కువ మంది ఉండడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment