ఓటుపై సర్కస్‌ ఫీటు | Mistakes In Voter Lists Srikakulam | Sakshi
Sakshi News home page

ఓటుపై సర్కస్‌ ఫీటు

Published Fri, Nov 16 2018 7:20 AM | Last Updated on Fri, Nov 16 2018 7:20 AM

Mistakes In Voter Lists Srikakulam - Sakshi

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: జిల్లాలో ఓటర్ల నమోదు ప్రక్రియ అస్తవ్యస్తంగా జరుగుతోంది. ఈ ఏడాది ఓటర్ల నమోదు ప్రక్రియకు ప్రత్యేక సమ్మరీ నిర్వహించారు. ఇందులోనూ దొంగ ఓట్లు నమోదు చేయడంలో అధికార పార్టీ తన ప్రత్యేకత చూపించింది. స్థానికంగా పనిచేస్తున్న బీఎల్‌ఓలను భయపెట్టి వారికి అనుకూలంగా పని చేయించుకున్నట్లు తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి. సమ్మరీ జరుగుతున్న వేళలోనే తిత్లీ తుఫాన్‌ వచ్చింది. దీంతో అధికారులు ఓటరు నమోదుపై పూర్తిస్థాయిలో దృష్టి సారించలేకపోయారు. దీన్ని అదనుగా తీసుకున్న చోటా నేతలు పరిమితులు లేకుండా ఇబ్బడిముబ్బడిగా దరఖాస్తు చేశారు. ఒకరి ఓటును రెండు మూడు చోట్ల ఉంచడం, ఒకరి పేరున రెండు ఓట్లు ఉంచడం వంటి సర్కస్‌ ఫీట్లు చేశారు. అధికార పార్టీ కార్యకర్తలు బలంగా పనిచేస్తున్న చోట్ల ఈ ఫీట్లు ఎక్కువగా కనిపించాయి.

అధికారులే గుర్తించారు
తిత్లీ హడావుడి తగ్గాక ఓటరు నమోదు ప్రక్రియను పరిశీలిస్తే అధికార పార్టీ నేతలు చేసిన పనులు అధికారులకు తెలిశాయి. జిల్లాలో ఎక్కువగా డబుల్‌ ఓట్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. పది నియోజకవర్గాల పరిధిలో ఇప్పటివరకు కంప్యూటర్‌ ఆధారంగానే 9802 డబుల్‌ ఓట్లను వారు గుర్తించారు. వీరి దృష్టికి రాకుండా మరో 20 వేల వరకు ఉంటాయని అంచనా. తాజాగా నిర్వహించిన ఓటర్ల నమోదు సమ్మరీలో సుమారుగా 47,411 ఆన్‌లైన్‌ దరఖాస్తులు, నేరుగా ఫారం 6లు వచ్చినవి మరో 30 వేలు వరకు ఉంటాయని అధికారులు చెబుతున్నారు. సుమారుగా 77 వేల కొత్త దరఖాస్తుల్లో ఇలాంటి అక్రమాల డబుల్‌ ఓట్లు, అధికార పార్టీ చొరవతో అడ్డగోలుగా కుక్కిన ఓట్లు మరో 20 వేలు వరకు ఉండవచ్చని అంచనా ఉంది. ఈ సమ్మరీలో వచ్చిన ఓట్లు రానున్న ఎన్నికలకు కీలకం కావడంతో అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ క్షుద్ర ప్రయత్నాలు చేస్తున్నారు.  

అంతే కాకుండా గతం మార్చిలో జరిగిన సమ్మరీలో జిల్లా సుమారుగా 33,957 ఓట్లను తొలగించారు. వీటిలో ఎక్కువగా ప్రతిపక్షంలో ఉన్న వారివే తొలగించారు. గతంలో ప్రజా ప్రతినిధులుగా పలు హోదాల్లో పనిచేసిన వారి ఓట్లు కూడా తొలగించడం వారి అడ్డగోలుతనానికి నిదర్శనమని పలువురు విమర్శిస్తున్నారు. సంబంధిత ఓటర్లు మళ్లీ దరఖాస్తు చేసుకున్నా చాలా మందికి ఇంకా ఓట్ల పునరుద్ధరణ జరగలేదు. ఎన్నికల ముందు ఓట్లు జాబితా కావడంతో అధికార పార్టీ ఈ కొత్త జాబితాను ఎన్ని  అక్రమాలకు తెరతీస్తోందని ఓటర్లు భయపడుతున్నారు.

బతికున్న మనిషిని చంపేశారు
టెక్కలి మండలం తలగాం గ్రామానికి చెందిన పేడాడ లక్ష్మీనారాయణ అనే వృద్ధుడు ఎప్పటి నుంచో ఓటు వేస్తున్నారు. అయితే ఈయన వైఎస్సార్‌ సీపీకి అనుకూలంగా ఉన్నారనే కక్షతో ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో ఓటు హక్కును తొలగించారు. ఆయన బతికుండగానే మరణించినట్లు తప్పుడు ధ్రువీకరణతో ఓటును తొలగించారు. ఇప్పటికీ ఆయన ఓటు హక్కును పునరుద్ధరించలేదు.

ఓటు తప్పిపోయింది
పాలకొండ గతంలో మేజర్‌ పంచాయతీగా ఉన్నపుడు సర్పంచ్‌గా చేశాను. 2014 ఎన్నికల్లో కూడా ఓటు వినియోగించుకున్నాను. ప్రస్తుతం నాతో పాటు నా కుటుంబంలో నలుగురి ఓట్లు గల్లంతయ్యాయి. ఇప్పటి వరకు పాలకొండ విడిచిపెట్టి వెళ్లింది లేదు. అధికారులను అడిగితే సాంకేతిక కారణాలు చూపిస్తున్నారు. ప్రజాప్రతినిధుల ఓట్లే గల్లంతయితే సాధారణ ప్రజల పరిస్థితి ఏమిటి.
– వెలమల మన్మధరావు, మాజీ సర్పంచ్, పాలకొండ

చాలా అవకతవకలున్నాయి
రాజాం మండలంలో చాలా ఓట్లను టీడీపీకి అనుకూలంగా మార్చుకునే ప్రయత్నంలో నాయకులు ఉన్నారు. ఈ దఫా ఎన్నికల్లో ఎలాగూ గెలవలేమనే ఉద్దేశంతో అడ్డదారులు తొక్కుతున్నారు. టీడీపీకి వ్యతిరేకంగా ఉన్నవారి ఓట్లు తెలియకుండానే తొలగిస్తున్నారు.– పాలవలస శ్రీనివాసరావు, వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్, రాజాం

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement