ప్రశాంతంగా ఎన్నికలు జరగాలి | Special security for extremist-hit areas | Sakshi
Sakshi News home page

ప్రశాంతంగా ఎన్నికలు జరగాలి

Published Sat, Oct 13 2018 2:41 AM | Last Updated on Sat, Oct 13 2018 2:41 AM

Special security for extremist-hit areas - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో జరిగేలా చర్యలు చేపట్టాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్‌ సూచించారు. రాబోయే ఎన్నికలపై డీజీపీ, కమిషనర్లు, ఎస్పీలతో హైదరాబాద్‌ ఖైరతాబాద్‌లోని వాటర్‌బోర్డు కార్యాలయంలోని సమావేశం మందిరంలో చర్చించారు. ఎన్నికల నేపథ్యంలో ప్రతీ బూత్‌స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పటిష్ట భద్రత ఏర్పాటు చేయడం, గత ఎన్నికల్లో గుర్తించిన సమస్యాత్మక ప్రాంతాలు, అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో పటిష్ట నిఘా ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

డీజీపీతో పాటు ఎస్పీలు, కమిషనర్లకు వీవీ పాట్స్, ఈవీఎంల పనితీరుపై అవగాహన కల్పించారు. ఎన్నికల కోడ్‌ వేళ తీసుకోవాల్సిన చర్యలు, ఎన్నికల నిర్వహణకు సంబంధించి చేపట్టాల్సిన పలు అంశాలపై ఎన్నికల కమిషన్‌ అధికారులు వివరించినట్లు తెలిసింది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు భద్రతా చర్యలు చేపట్టాలని, ఎన్నికల సిబ్బందికి, ఎన్నికలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని రజత్‌కుమార్‌ ఆదేశించినట్లు సమాచారం.

అభ్యర్థులు ర్యాలీలు, సభలు, మైకులు, ప్రచార రథాల అనుమతులకు సంబంధించి ఎన్నికల కమిషన్‌కు చెందిన సువిధ యాప్‌ ద్వారా పొందాలని, ఈ యాప్‌ ద్వారా ఎన్నికల కమిషన్‌ పోలీస్‌ శాఖకు నోఅబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌ ఇచ్చేలా ఆదేశిస్తుందని కమిషనర్లు, ఎస్పీలకు ఎన్నికల కమిషన్‌ అధికారులు సూచించినట్లు తెలిసింది. ఓటర్లు రాజకీయ పార్టీల ప్రలోభాలు, నగదు, గిఫ్టుల పంపిణీ అంశాలను నేరుగా సీ–విజిల్‌ యాప్‌ ద్వారా ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయొచ్చని, ఈ యాప్‌ను ప్రజలు ఉపయోగించుకునేలా చూడాలని సూచించారు.

ప్రశాంతంగా నిర్వహిస్తాం: డీజీపీ
జిల్లాల ఎస్పీలు, కమిషనర్లు, రేంజ్‌ డీఐజీలతో ఎన్నికల అధికారులు సమావేశమయ్యారని, ఈసీ నిబంధనల ప్రకారం ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేలా కమిషన్‌ శిక్షణ ఇచ్చినట్లు డీజీపీ మహేందర్‌రెడ్డి తెలిపారు. వీవీ పాట్స్, సీ–విజిల్, సువిధ యాప్‌ను పోలీసులు ఎలా వినియోగించుకోవాలో శిక్షణలో సూచించారని చెప్పారు. శిక్షణలో భాగంగా సమస్యాత్మక ప్రాంతాలు ఎలా గుర్తించాలి అనే వాటిపై చర్చ జరిగిందని, భద్రతకు ఎంత మందిని మోహరించాలన్న దానిపై చర్చించామన్నారు.

రౌడీ షీటర్ల బైండోవర్లు, లైసెన్స్‌ ఆయుధాల డిపాజిట్‌ తదితర అంశాలను వేగవంతంగా అమలు చేస్తామన్నారు. మూడేళ్ల సర్వీసును ఒకే జిల్లాలో పూర్తి చేసుకున్న అధికారులను బదిలీచేయాలని ఈసీ సూచించిందని, నిబంధనలకు అనుగుణంగా ఈ నెల 17లోపు పోలీసు శాఖలో బదిలీల ప్రక్రియ పూర్తి చేస్తామని డీజీపీ మహేందర్‌రెడ్డి తెలిపారు. నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని, పక్క రాష్టాల పోలీసులతో కూడా సమన్వయం చేసుకుంటున్నట్లు వివరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement