
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజకీయపార్టీల బహిరంగసభలను అడ్డుకునేవారిపై, ఆటంకాలు సృష్టించేవారిపై చట్టరీత్యా కఠినచర్యలు తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారులు, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌కుమార్ ఆదేశించారు. ఎన్నికల సభలను అడ్డుకునే వ్యక్తులపై ప్రజాప్రాతినిధ్య చట్టం(ఆర్పీఏ)లోని సెక్షన్ 127 కింద కేసులు నమోదు చేయాలని మంగళవారం ఆయన ఉత్తర్వులు జారీ చేశారు. బహిరంగ సభలను అడ్డుకుని ఆటంకం కలిగిస్తున్నారని రాజకీయ పార్టీల నుంచి ఇటీవల కాలంలో ఫిర్యాదులు పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. నేరం రుజువైతే నిందితులకు గరిష్టంగా 6 నెలల వరకు జైలు శిక్ష లేదా రూ.2 వేల జరిమానా లేదా రెండూ విధించవచ్చు.’’అని రజత్‌కుమార్ హెచ్చరించారు. ఎన్నికల ఏర్పాట్లపై మంగళవారం ఆయన సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. రాజకీయ వైరుధ్యం, వ్యక్తిగత కక్షల ఆధారంగా అమాయకులపై కేసులు పెట్టి సెక్షన్ 127ను దుర్వినియోగం చేస్తే బాధ్యులైన అధికారులపై తీవ్ర చర్యలు తీసుకుంటామన్నారు.
లక్షన్నర మంది పోలింగ్ సిబ్బంది
ఎన్నికల్లో భాగంగా డిసెంబర్ 7న ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గం. వరకు పోలింగ్ నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం సూచనలు అందాయని రజత్‌కుమార్ తెలిపారు. ఒక్కో పోలింగ్ బూత్‌లో నలుగురు సిబ్బంది చొప్పున రాష్ట్రంలోని 32,542 పోలింగ్ కేంద్రాల్లో 1,30,168 మందితో పాటు అదనంగా 20 శాతం రిజర్వ్ సిబ్బందితో కలిపి 1.50 లక్షల మం దిని నియమిస్తామన్నారు. ఉద్యోగుల స్థానికత, పనిచేసే నియోజకవర్గంలో కాకుండా ఇతర ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాల్లో సిబ్బందిని నియమిస్తామని, సాఫ్ట్‌వేర్ ద్వారా ర్యాండమైజేషన్(లాటరీ తరహా) జరిపి పోలింగ్ కేంద్రాలకు కేటాయిస్తామన్నారు.
అదనంగా 217 పోలింగ్ స్టేషన్లు...
గ్రామాల్లో ఒక్కో పోలింగ్ స్టేషన్‌లో ఓటర్ల గరిష్ట పరిమితిని 1,200 నుంచి 1,400 మందికి పెంచాలని కలెక్టర్ల నుంచి వచ్చిన సూచనల మేరకు అదనంగా 217 కొత్త పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయిం చినట్లు తెలిపారు. ప్రతి తండాలో పోలింగ్ స్టేషన్‌ను ఏర్పాటు చేయాలని వచ్చిన అభ్యర్థనను పరిశీలించామన్నారు. అయితే తండాల్లో కొత్త పోలింగ్‌స్టేషన్లు ఏర్పాటు చేస్తే భద్రత సమస్యలు రావచ్చని కలెక్టర్లు అభిప్రాయపడటంతో ఈ ఆలోచనను విరమించుకు న్నామన్నారు. కాగా, టీఆర్‌ఎస్ ఎన్నికల ప్రచార కార్యక్రమానికి హాజరైన మహిళలకు డబ్బులను పంపిణీ చేస్తున్న ఆ పార్టీ నేత వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంపై స్పందిస్తూ సంబంధిత వ్యక్తిని గుర్తించి అతడిపై సెక్షన్ 171బీ కేసు నమోదు చేస్తామని స్పష్టం చేశారు.
వామపక్ష తీవ్రవాదుల కోసమే: ఏపీ, తెలంగాణ డీజీపీలు
వామపక్ష తీవ్రవాదుల కదలికలపై నిఘా పెట్టడంలో భాగంగా తమ రాష్ట్ర ఇంటలిజెన్స్ విభాగం కానిస్టేబుళ్లు తెలంగాణలో రహస్యంగా పనిచేస్తున్నారని ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ వివరణ ఇచ్చారు. తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో ఓటర్ల మనోగతంపై సర్వే నిర్వహిస్తున్నారనే ఆరోపణలపై జగిత్యాల జిల్లా ధర్మపురిలో పట్టుబడిన ఏపీ కానిస్టేబుళ్ల వ్యవహారంపై వివరణ కోరుతూ సీఈవో రజత్ కుమార్ జారీ చేసిన నోటీసులకు ఏపీ డీజీపీ మంగళవారం బదులిచ్చారు. ఈ వ్యవహారంపై తెలంగాణ డీజీపీ ఎం.మహేందర్ రెడ్డి సైతం ఏపీ డీజీపీ వివరణతో ఏకీభవిస్తూ సీఈవోకు లేఖ రాశారు. 2 రాష్ట్రాల డీజీపీల నుంచి వచ్చిన వివరణలతో సీఈవో సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రగతిభవన్‌తోపాటు మంత్రుల క్వార్టర్లలో టీఆర్‌ఎస్ పార్టీ సమావేశాల నిర్వహణపై ఆ పార్టీ సంజాయిషీ కోరుతూ జారీ చేసిన నోటీసులకు ఇంకా జవాబు రాలేదని రజత్‌కుమార్ తెలిపారు. శాసనసభ ఎన్నికల్లో గులాబీ రంగు బ్యాలెట్లను వినియోగించే సంప్రదాయం 1950 నుంచి కొనసాగుతోందని, దీనిపై కాంగ్రెస్ చేసిన ఫిర్యాదును ఈసీ పరిశీలనకు పంపామమన్నారు.
Comments
Please login to add a commentAdd a comment