సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ నిష్పాక్షికంగా వ్యవహరించడం లేదని టీ పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఆయన తీరుపై అభ్యంతరాలు ఉన్నాయని, ఆపద్ధర్మ ప్రభుత్వం యథేచ్ఛగా ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినా పట్టించుకోవటం లేదని విమర్శించారు. ఆర్టీసీ బస్సులపై, నగరంలో చాలాచోట్ల ప్రభుత్వ పథకాల ప్రకటనలు ఉన్నా తొలగించటం లేదని పేర్కొన్నారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆపద్ధర్మ ప్రభుత్వం ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తుండటంపై రజత్ కుమార్‌కు తమ పార్టీ నేతలు ఫిర్యాదు చేశారని, ఈ విషయంలో ఆయన నుంచి సరైనా స్పందన లేకుంటే కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని తెలిపారు.
ఈవీఎంల ట్యాంపరింగ్ జరుగుతుందన్న అనుమానాలు ఉన్నాయని చెప్పారు. ఈవీఎంల తనిఖీల్లో అన్ని రాజకీయ పార్టీలకు అవకాశం కల్పిస్తూ.. అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో దీని చేపట్టాలని కోరారు. వార్తాపత్రికలు, టీవీల యాజమాన్యాలు పక్షపాతంగా వ్యవహరిస్తున్నాయని, కొన్ని మీడియా సంస్థల యాజమాన్యం ఎవరు అన్నదానిపై వివరాలు ఎన్నికల సంఘానికి అందజేస్తామని చెప్పారు. తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్న వేళ.. ప్రసారమవుతున్న కొన్ని కథనాలను పేయిడ్ ఆర్టికల్స్ గా భావించాలని ఈసీని కోరుతామని చెప్పారు. మంగళవారం నుంచి వారం రోజులపాటు జనసంపర్క్ అభియాన్ పేరుతో డోర్ టు డోర్ ప్రచారం చేపడుతామని చెప్పారు. ప్రాజెక్టుల పేరుతో దోచుకున్న సొమ్మును కేసీఆర్ ఆల్ రెడీ పంచుతున్నారని, మన నుంచి దోచుకున్న సొమ్ము మనకే పంచుతున్నారని, ఈ విషయంలో ప్రజలు అప్రమత్తం కావాలన్నారు. ఆ సొమ్ముతోనే ఇతర పార్టీ నేతలను కొనేందుకు అన్ని విధాల దిగజారుతున్నారని విమర్శించారు. పొత్తుల విషయంలో తమ గురించి మాట్లాడుతున్న కేసీఆరే నంబర్ వన్ తెలంగాణ ద్రోహి అని మండిపడ్డారు. ఇచ్చిన ఏ ఒక్క హామీని నిలబెట్టుకోని కేసీఆర్.. బహిరంగ క్షమాపణ చెప్పి ప్రచారం చేపట్టాలని డిమాండ్ చేశారు. ‘కేసీఆర్ హఠావో తెలంగాణ బచావో’ అనే నినాదంతో ప్రజల్లోకి వెళుతామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment