ప్రియమైన మీకు..  | January 25th Is The Last Date For Vote Entry Process Said By Telangana CEO Rajat Kumar | Sakshi
Sakshi News home page

ప్రియమైన మీకు.. 

Published Thu, Jan 10 2019 3:44 AM | Last Updated on Thu, Jan 10 2019 3:54 AM

January 25th Is The Last Date For Vote Entry Process Said By Telangana CEO Rajat Kumar - Sakshi

తెలంగాణ సీఈఓ రజత్‌ కుమార్‌

సాక్షి, హైదరాబాద్‌: ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ కార్యకమంలో భాగంగా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈఓ) డాక్టర్‌ రజత్‌కుమార్‌.. రాష్ట్రంలోని కోటీ 10 లక్షల కుటుంబాలకు లేఖలు రాయనున్నారు. కొత్త ఓటర్ల నమోదు(ఫారం–6), ప్రవాసుల ఓటర్ల నమోదు(ఫారం–6ఏ), చనిపోయిన, శాశ్వతంగా చిరునామా మారిన ఓటర్ల తొలగింపు(ఫారం–7), ఓటర్ల జాబితాలో పేరు సవరణ(ఫారం–8), అదే అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో చిరునామా మార్పు(ఫారం–8ఏ) కోసం ఏం చేయాలి? ఏ ఫారాలు సమర్పించాలి? అన్న అంశాల పట్ల ఈ లేఖల ద్వారా అవగాహన కల్పించనున్నారు. తిరుగు చిరునామా కలిగిన ఓ పోస్టు కార్డును ఈ లేఖకు జత చేసి పంపించనున్నారు. ఓటర్ల జాబితాపై సలహాలు, సూచనలు, అభ్యంతరాలను ఈ పోస్టు కార్డుపై రాసి పంపించాలని ఆహ్వానించనున్నారు.

ఈ విషయాన్ని సీఈఓ రజత్‌కుమార్‌ వెల్లడించారు. బుధవారం ఆయన సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఓటర్ల నమోదుపై చైతన్యపరిచేందుకు పౌరులకు బల్క్‌ ఎస్సెమ్మెస్‌లు పంపించనున్నట్టు చెప్పారు. ‘‘2019 జనవరి 1ని అర్హత తేదీగా చేపట్టిన ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 25 వరకు కొత్త ఓటర్ల నమోదుకు దరఖాస్తులు, ముసాయిదా ఓటర్ల జాబితాపై అభ్యంతరాలను స్వీకరిస్తున్నాం. ఫిబ్రవరి 22న తుది ఓటర్ల జాబితా ప్రచురిస్తాం. ఓటర్ల నమోదు ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతుంది. వచ్చే లోక్‌సభ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రారంభమయ్యే వరకు దరఖాస్తులు స్వీకరిస్తాం.

లోక్‌సభ ఎన్నికల కోసం మరో ప్రత్యేక సంక్షిప్త ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించని పక్షంలో ఫిబ్రవరి 22న ప్రచురించనున్న తుది ఓటర్ల జాబితా నుంచి ఒక్క ఓటరును కూడా తొలగించడానికి వీలుండదు. అందువల్ల బోగస్, చనిపోయిన, చిరునామా మారిన ఓటర్ల తొలగింపునకు దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 25 వరకు ఉన్న అవకాశాన్ని వినియోగించుకోవాలి’’అని ఆయన సూచించారు. గత నెల 26న ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని చేపట్టగా.. కొత్త ఓటర్ల నమోదు కోసం 8,64,128, ప్రవాసుల ఓటర్ల నమోదుకు 1123, ఓట్ల తొలగింపునకు 10,130, ఓటరు పేరు సవరణ కోసం 57,348, ఉన్న నియోజకవర్గం పరిధిలోనే చిరునామా మార్పునకు 22,098 దరఖాస్తులు కలిపి ఇప్పటివరకు మొత్తం 9,54,827 దరఖాస్తులు వచ్చినట్టు తెలిపారు. 

95 శాతం ఓట్ల తొలగింపు కరెక్టే...  

శాసనసభ ఎన్నికల్లో 22 లక్షల ఓట్లు గల్లంతైనట్లు విమర్శలొచ్చిన నేపథ్యంలో, ఓట్లు గల్లంతైనట్లు వచ్చిన ఫిర్యాదులపై విచారణ జరిపించామని రజత్‌కుమార్‌ వెల్లడించారు. 2015లో చేపట్టిన నేషనల్‌ ఎలక్టోరల్‌ రోల్‌ ప్యూరిఫికేషన్‌ అండ్‌ అథెంటిఫికేషన్‌(ఎన్‌ఈఆర్‌పీఏపీ) కార్యక్రమం కింద ఆ ఓట్లను తొలగించినట్లు తేలిందన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 6,30,652, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో 28,70,048 ఓటర్లు కలిపి మొత్తం 35,00,700 మంది ఓటర్లను ఈ కార్యక్రమం కింద తొలగించారని తెలిపారు. మేడ్చల్‌ జిల్లాను పైలట్‌ ప్రాజెక్టుగా తీసుకుని విచారణ జరపగా.. ఇక్కడ తొలగించిన 7.4లక్షల ఓట్లలో 6.8లక్షల ఓట్లను సరిగ్గానే తొలగించారని.. కేవలం 60వేల ఓట్లను మాత్రమే తప్పుగా తొలగించినట్లు నిర్ధారణ జరిగిందని వివరించారు.

మేడ్చల్‌ తరహాలోనే రాష్ట్రవ్యాప్తంగా తొలగించిన ఓట్లపై విచారణ నిర్వహిస్తున్నట్టు చెప్పారు. 2015లో ఎన్‌ఈఆర్‌పీఏపీ కింద ఓట్లు తొలగించిన తర్వాత 2016, 2017, 2018లో ఓటర్ల జాబితా సవరణ నిర్వహించామని, గతేడాది మూడు సార్లు కొత్త ఓటర్ల నమోదుకు అవకాశం కల్పించినా 2015లో ఓటు కోల్పోయిన వ్యక్తులు మళ్లీ ఓటరుగా నమోదు కాకపోవడం కూడా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు హక్కు లేకపోవడానికి ఓ కారణమని రజత్‌కుమార్‌ వివరించారు. 2016లో నిర్వహించిన ఇంటెన్సివ్‌ రివిజన్‌ ఆఫ్‌ ఎలక్ట్రోరల్‌ రోల్స్‌(ఐఆర్‌ఈఆర్‌) కింద రాష్ట్రంలో మరోసారి 24 లక్షల ఓట్లను తొలగించారని, అయితే ఈ విషయంలో ఎలాంటి ఫిర్యాదులు రాలేదని తెలిపారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో అధికార పార్టీకి అనుకూలంగా పనిచేశారన్న ఆరోపణలపై జీహెచ్‌ఎంసీ పరిధిలోని ముగ్గురు రిటర్నింగ్‌ అధికారులకు నోటిసులు జారీ చేశామని, వారిపై చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. 

ఈ నెలాఖరు వరకు ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు...  

రెండు ఉపాధ్యాయ, ఓ పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గాలకు త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈనెల 31 వరకు ఆయా నియోజకవర్గాల్లో కొత్త ఓటర్ల నమోదుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని రజత్‌కుమార్‌ తెలిపారు. మెదక్‌–నిజామాబాద్‌–ఆదిలాబాద్‌–కరీంనగర్‌ పట్టభద్రులు నియోజకవర్గంలో ఇప్పటి వరకు 1,42,958 మంది ఓటర్లు, మెదక్‌–నిజామాబాద్‌–ఆదిలాబాద్‌–కరీంనగర్‌/వరంగల్‌–ఖమ్మం –నల్లగొండ ఉపాధ్యాయుల నియోజకవర్గంలో 3,38,44 మంది ఓటర్లు ఉన్నారని వెల్లడించారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement