vote entry process
-
ప్రియమైన మీకు..
సాక్షి, హైదరాబాద్: ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ కార్యకమంలో భాగంగా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈఓ) డాక్టర్ రజత్‌కుమార్.. రాష్ట్రంలోని కోటీ 10 లక్షల కుటుంబాలకు లేఖలు రాయనున్నారు. కొత్త ఓటర్ల నమోదు(ఫారం–6), ప్రవాసుల ఓటర్ల నమోదు(ఫారం–6ఏ), చనిపోయిన, శాశ్వతంగా చిరునామా మారిన ఓటర్ల తొలగింపు(ఫారం–7), ఓటర్ల జాబితాలో పేరు సవరణ(ఫారం–8), అదే అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో చిరునామా మార్పు(ఫారం–8ఏ) కోసం ఏం చేయాలి? ఏ ఫారాలు సమర్పించాలి? అన్న అంశాల పట్ల ఈ లేఖల ద్వారా అవగాహన కల్పించనున్నారు. తిరుగు చిరునామా కలిగిన ఓ పోస్టు కార్డును ఈ లేఖకు జత చేసి పంపించనున్నారు. ఓటర్ల జాబితాపై సలహాలు, సూచనలు, అభ్యంతరాలను ఈ పోస్టు కార్డుపై రాసి పంపించాలని ఆహ్వానించనున్నారు. ఈ విషయాన్ని సీఈఓ రజత్‌కుమార్ వెల్లడించారు. బుధవారం ఆయన సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఓటర్ల నమోదుపై చైతన్యపరిచేందుకు పౌరులకు బల్క్ ఎస్సెమ్మెస్‌లు పంపించనున్నట్టు చెప్పారు. ‘‘2019 జనవరి 1ని అర్హత తేదీగా చేపట్టిన ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 25 వరకు కొత్త ఓటర్ల నమోదుకు దరఖాస్తులు, ముసాయిదా ఓటర్ల జాబితాపై అభ్యంతరాలను స్వీకరిస్తున్నాం. ఫిబ్రవరి 22న తుది ఓటర్ల జాబితా ప్రచురిస్తాం. ఓటర్ల నమోదు ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతుంది. వచ్చే లోక్‌సభ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రారంభమయ్యే వరకు దరఖాస్తులు స్వీకరిస్తాం. లోక్‌సభ ఎన్నికల కోసం మరో ప్రత్యేక సంక్షిప్త ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించని పక్షంలో ఫిబ్రవరి 22న ప్రచురించనున్న తుది ఓటర్ల జాబితా నుంచి ఒక్క ఓటరును కూడా తొలగించడానికి వీలుండదు. అందువల్ల బోగస్, చనిపోయిన, చిరునామా మారిన ఓటర్ల తొలగింపునకు దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 25 వరకు ఉన్న అవకాశాన్ని వినియోగించుకోవాలి’’అని ఆయన సూచించారు. గత నెల 26న ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని చేపట్టగా.. కొత్త ఓటర్ల నమోదు కోసం 8,64,128, ప్రవాసుల ఓటర్ల నమోదుకు 1123, ఓట్ల తొలగింపునకు 10,130, ఓటరు పేరు సవరణ కోసం 57,348, ఉన్న నియోజకవర్గం పరిధిలోనే చిరునామా మార్పునకు 22,098 దరఖాస్తులు కలిపి ఇప్పటివరకు మొత్తం 9,54,827 దరఖాస్తులు వచ్చినట్టు తెలిపారు. 95 శాతం ఓట్ల తొలగింపు కరెక్టే... శాసనసభ ఎన్నికల్లో 22 లక్షల ఓట్లు గల్లంతైనట్లు విమర్శలొచ్చిన నేపథ్యంలో, ఓట్లు గల్లంతైనట్లు వచ్చిన ఫిర్యాదులపై విచారణ జరిపించామని రజత్‌కుమార్ వెల్లడించారు. 2015లో చేపట్టిన నేషనల్ ఎలక్టోరల్ రోల్ ప్యూరిఫికేషన్ అండ్ అథెంటిఫికేషన్(ఎన్ఈఆర్పీఏపీ) కార్యక్రమం కింద ఆ ఓట్లను తొలగించినట్లు తేలిందన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో 6,30,652, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో 28,70,048 ఓటర్లు కలిపి మొత్తం 35,00,700 మంది ఓటర్లను ఈ కార్యక్రమం కింద తొలగించారని తెలిపారు. మేడ్చల్ జిల్లాను పైలట్ ప్రాజెక్టుగా తీసుకుని విచారణ జరపగా.. ఇక్కడ తొలగించిన 7.4లక్షల ఓట్లలో 6.8లక్షల ఓట్లను సరిగ్గానే తొలగించారని.. కేవలం 60వేల ఓట్లను మాత్రమే తప్పుగా తొలగించినట్లు నిర్ధారణ జరిగిందని వివరించారు. మేడ్చల్ తరహాలోనే రాష్ట్రవ్యాప్తంగా తొలగించిన ఓట్లపై విచారణ నిర్వహిస్తున్నట్టు చెప్పారు. 2015లో ఎన్ఈఆర్పీఏపీ కింద ఓట్లు తొలగించిన తర్వాత 2016, 2017, 2018లో ఓటర్ల జాబితా సవరణ నిర్వహించామని, గతేడాది మూడు సార్లు కొత్త ఓటర్ల నమోదుకు అవకాశం కల్పించినా 2015లో ఓటు కోల్పోయిన వ్యక్తులు మళ్లీ ఓటరుగా నమోదు కాకపోవడం కూడా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు హక్కు లేకపోవడానికి ఓ కారణమని రజత్‌కుమార్ వివరించారు. 2016లో నిర్వహించిన ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఎలక్ట్రోరల్ రోల్స్(ఐఆర్‌ఈఆర్) కింద రాష్ట్రంలో మరోసారి 24 లక్షల ఓట్లను తొలగించారని, అయితే ఈ విషయంలో ఎలాంటి ఫిర్యాదులు రాలేదని తెలిపారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో అధికార పార్టీకి అనుకూలంగా పనిచేశారన్న ఆరోపణలపై జీహెచ్ఎంసీ పరిధిలోని ముగ్గురు రిటర్నింగ్ అధికారులకు నోటిసులు జారీ చేశామని, వారిపై చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ఈ నెలాఖరు వరకు ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు... రెండు ఉపాధ్యాయ, ఓ పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గాలకు త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈనెల 31 వరకు ఆయా నియోజకవర్గాల్లో కొత్త ఓటర్ల నమోదుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని రజత్‌కుమార్ తెలిపారు. మెదక్–నిజామాబాద్–ఆదిలాబాద్–కరీంనగర్ పట్టభద్రులు నియోజకవర్గంలో ఇప్పటి వరకు 1,42,958 మంది ఓటర్లు, మెదక్–నిజామాబాద్–ఆదిలాబాద్–కరీంనగర్/వరంగల్–ఖమ్మం –నల్లగొండ ఉపాధ్యాయుల నియోజకవర్గంలో 3,38,44 మంది ఓటర్లు ఉన్నారని వెల్లడించారు. -
తొలగించిన ఓటర్లు వీరే!
సాక్షి, హైదరాబాద్: ఇటీవల ముగిసిన శాసనసభ ఎన్నికల్లో లక్షల ఓట్లు గల్లంతవడంపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) రజత్ కుమార్ స్పందించారు. 2015, 2017లో తొలగించిన ఓటర్ల పేర్లతో జాబితాలను జిల్లా ఎన్నికల అధికారులకు (డీఈఓ) అందజేశారు. ఈ పేర్లను సీఈఓ అధికారిక వెబ్సైట్లో సైతం పొందుపరిచినట్లు వెల్లడించారు. తొలగించిన ఓటర్ల జాబితాలో తమ పేర్లు ఉన్నా యో లేవో ఓటర్లు చూసుకోవాలని.. ఒక వేళ పేరు తొలగించినట్లు గుర్తిస్తే ఓటరు నమోదు కోసం స్థానిక బీఎల్ఓను సంప్రదించాలని రజత్‌కుమార్ సూచించారు. 2019 జనవరి 1 అర్హత తేదీగా చేపట్టిన తాజా ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంలో భాగంగా మం గళవారం గుర్తింపుపొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. కొత్త ఓటర్ల నమోదు కోసం ఈ నెల 20న రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక ప్రచారోద్యమాన్ని నిర్వహి స్తున్నామని, ఇందుకు సహకరించాలని రాజకీయ పార్టీలకు కోరారు. తొలి దశ పంచాయతీ ఎన్నికలు జరిగే చోట్లలో 23న ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. ఆ రోజు పోలింగ్ కేంద్రా ల వద్ద బూత్ స్థాయి అధికారులు (బీఎల్ఓ) ఓటర్ల జాబితాతో అందుబాటులో ఉండి కొత్త ఓటర్ల నమోదుకు దరఖాస్తులతో పాటు ము సాయిదా ఓటర్ల జాబితాపై అభ్యంతరాలను స్వీకరిస్తారని వెల్లడించారు. ఓటర్ల నమోదు కార్యక్రమం పట్ల ప్రజల్లో చైతన్యం పెంపొం దించేందుకు కృషి చేయాలని రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేశారు. 18–19 ఏళ్ల వయస్సున్న యువతీ యువకులతో పాటు మహిళలు, వికలాంగులు, పట్టణ ఓటర్లు, ట్రాన్స్జెండర్లు ఓటరు నమోదు చేసుకునే విధంగా ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో జీహెచ్ఎంసీ పరిధి లోని నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున ఓట్లు గల్లంతయ్యాయని విమర్శలొచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ పరిధిలో ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు రజత్‌కుమార్ ప్రకటించారు. ఆ చర్యలివే.. - ఈ నెల 9–11, 23–25 వరకు సాయంత్రం 4–7 గంటల వరకు బీఎల్ఓలు పోలింగ్ కేంద్రాల వద్ద కూర్చొని ఓటర్ల నమోదు దరఖాస్తులు, అభ్యంతరాలు స్వీకరిస్తారు. ప్రత్యేక ప్రచారోద్యమం నిర్వహించనున్న జనవరి 20వ తేదీన బీఎల్ఓలు పూర్తి రోజు పోలింగ్ కేంద్రం వద్ద అందుబాటులో ఉంటారు. - జీహెచ్ఎంసీలోని అన్ని వార్డుల కార్యాలయాల వద్ద ఓటర్లకు సహకరించేందుకు ఓ కంప్యూటర్ ఆపరేటర్‌ను ప్రత్యేకంగా నియమించనున్నారు. ఓటరు జాబితా సవరణకు సంబంధించిన దరఖాస్తుల పంపిణీతో పాటు ఓటరు నమోదుకు సంబంధించిన స్థితిగతులను ఆ కంప్యూటర్ ఆపరేటర్ దరఖాస్తుదారులకు తెలియజేస్తారు. - జనవరి 8 నుంచి 25 వరకు నగరంలోని ప్రముఖ మాల్స్ వద్ద ఓటరు నమోదు దరఖాస్తుల స్వీకరణ కోసం డ్రాప్ బాక్కులను ఏర్పాటు చేయనున్నారు. - ఈఆర్వోలు తమ పరిధిలోని అన్ని డిగ్రీ కళాశాలలను సందర్శించి అక్కడ చదువుతున్న యువతను ఓటరు నమోదులో పాల్గొనేలా చైతన్యపరుస్తారు. కళాశాలల ప్రిన్స్‌పాల్‌కు తగిన సంఖ్యలో ఓటరు నమోదు దరఖాస్తులు అందించడంతో పాటు కళాశాలలో డ్రాప్ బాక్స్ ఏర్పాటు చేస్తారు. జాబితా సవరణ గడువు పెంచండి అధికారులందరూ పంచాయతీ ఎన్నికల విధుల్లో బిజీగా ఉన్నారని, ఈ నేపథ్యంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం షెడ్యూల్‌ను పొడిగించాలని కాంగ్రెస్ నేత మర్రి శశిధర్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్సీ ఎన్. రాంచందర్ రావు డిమాండ్ చేశారు. గత మూడేళ్లల్లో పలు దఫాలుగా లక్షల ఓట్లను అడ్డగోలుగా తొలగించారని, ఓట్లు కోల్పోయిన వారందరికీ మళ్లీ ఓటరు జాబితాలో స్థానం కల్పించాలన్నారు. హైదరాబాద్ నగరంలో ఓటింగ్ శాతం పడిపోవడానికి కారణాలు తెలపాలని సీఈఓను కోరినట్లు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఓట్లను అడ్డగోలుగా తొలగించిన బీఎల్ఓలను బాధ్యులు చేయాలన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పెద్ద ఎత్తున ఓట్లు గల్లంతు కావడంతో టీఆర్ఎస్ పార్టీకి రావాల్సిన మెజారిటీ తగ్గిందని ఆ పార్టీ నేత గట్టు రాంచందర్ రావు పేర్కొన్నారు. -
4 రోజులే..
సాక్షి, రంగారెడ్డి జిల్లా : ఓటు పట్ల ఇంకా చాలా మంది నిర్లక్ష్యాన్ని వీడడం లేదు. 18 ఏళ్లు నిండినా ఓటరుగా నమోదు చేసుకోవడానికి ఆసక్తి చూపుతున్నట్లు కనిపించడం లేదు. ముఖ్యంగా చదువుకున్న యువతీ యువకులే ఈ విషయంలో వెనకబడినట్లు అధికారులు పేర్కొంటున్నారు. అర్హత గల ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు కావాలని విస్తృతంగా ప్రచారం జరుగుతున్నా మేల్కొనడం లేదు. సమాజాన్ని సరైన దిశలో నడిపించడంలో తమ ఓట్లే కీలకమన్న విషయాన్ని యువత గ్రహించాలి. ఈ నెల 10న విడుదలైన ఓటర్ల ముసాయిదా జాబితా ప్రకారం జిల్లాలో 26.56 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఈ జాబితాలో సవరణలతోపాటు కొత్తగా ఓటు నమోదు చేసుకోవడానికి ఈనెల 25వ తేదీ వరకు అవకాశమిచ్చారు. ఈ లోగా ఓటరుగా నమోదు చేసుకుంటేనే ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. ఈనెల 15, 16 తేదీల్లో ఓటరు నమోదుకు అన్ని అన్ని పోలింగ్ బూతుల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక క్యాంపులకు అనూహ్య స్పందన లభించింది. రెండు రోజుల్లోనే 23 వేల మంది ఓటు కోసం దరఖాస్తు చేసుకున్నారు. ముసాయిదా జాబితా వెలువడిన తేదీ నుంచి ఈనెల 21వ తేదీ వరకు ఈ సంఖ్య 26 వేలకు మాత్రమే చేరుకుందని అధికారులు పేర్కొంటున్నారు. ఓటు హక్కులేని వారు మరింత మంది ఉంటారన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఓటు హక్కుకు ఇవీ అర్హతలు.. స్థానికంగా నివాసం ఉంటూ ఈ ఏడాది జనవరి ఒకటికి 18 ఏళ్లు నిండిన వారంతా ఓటరుగా నమోదు చేసుకోవడానికి అర్హులు. వీరంతా ఫారం–6ను పూరించి బూత్ లెవల్ఆఫీసర్ (బీఎల్ఓ)కు అప్పగించాలి. ఆధార్ కార్డు తప్పనిసరి కాదు. వయసు నిర్ధారణ తెలిపే సర్టిఫికెట్ ఉంటే ఎటువంటి సమస్యా ఉండదు. ఒకవేళ లేకుంటే అధికారులు నివాస స్థలానికి వచ్చి విచారణ చేపట్టి ధ్రువీకరిస్తారు. ఒక నియోజకవర్గం నుంచి మరో నియోజకవర్గానికి ఓటరు నివాసం మారితే తొలుత మునుపటి నియోజకవర్గంలో ఓటును ఫారం–7 ద్వారా తొలగించుకోవాలి. తాజాగా ఓటరుగా నమోదు కావడానికి ఫారం–6ని పూరించి ఇవ్వాలి. ఇంటిపేరు, వ్యక్తి పేరు, పుట్టిన తేదీలో చేర్పులు మార్పులు ఉంటే ఫారం–8ని వినియోగించాలి. నియోజకవర్గ పరిధిలో ఓటరు తన నివాసాన్ని మార్చితే ఫారం–8ఏ వినియోగించాలి. -
ఓటర్ల తుది జాబితా ప్రకటన నేడు
కూడికలు తీసివేతల్లో పార్టీలు ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్: ఓటర్ల తుది జాబితాను శుక్రవారం జిల్లా యంత్రాంగం ప్రకటించనుంది. గత ఏడాది నవంబర్ 19వ తేదీ ఓటర్ల ముసాయిదా జాబితా ప్రకటించింది. అదే సమయంలో 2014 జనవరి 1నాటికి 18 సంవత్సరాలు నిండిన వారంతా ఓటర్లుగా నమోదు చేసుకోవచ్చని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ముసాయిదా జాబితాలో జిల్లాలో 23 లక్షల 15 వేల 407 మంది ఓటర్లుగా తేలారు. జనవరి 16వ తేదీ ఓటర్ల తుది జాబితా ప్రకటిస్తామని ముందుగానే ప్రకటించారు. అందుకోసం నవంబర్ 24, డిసెంబర్ 1, 8, 15, 22 తేదీల్లో ప్రత్యేక ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. జిల్లాలోని 2751 పోలింగ్ కేంద్రాల్లో ఓటర్ల నమోదు ప్రక్రియ నిర్వహించారు. జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈనెల 24వ తేదీ జిల్లాలో ఓటర్ల జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. 23 లక్షల 15 వేల 407 మంది ఓటర్లు ఉన్నట్లు తేల్చారు. గత జాబితాతో పోల్చుకుంటే కొత్తగా 2 లక్షల 7 వేల 19మంది ఓటర్లుగా చేరారు. అదే సమయంలో 73,121 మంది ఓటర్లను జాబితా నుంచి తొలగించడం జిల్లాలోని అన్ని రాజకీయ పార్టీలను కలవరపాటుకు గురిచేసింది. శుక్రవారం ప్రకటించనున్న ఓటర్ల తుది జాబితాపై రాజకీయ పార్టీలు దృష్టి సారించాయి. నియోజకవర్గాల వారీగా ఎంతమంది కొత్తగా ఓటు హక్కు పొందారు, ఎంతమంది ఓటు హక్కును కోల్పోయారన్న లెక్కలు వేసుకుంటున్నారు. తాజాగా ప్రకటించనున్న ఓటర్ల జాబితాను ఆధారం చేసుకొని త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో ప్రాధాన్యతను సంతరించుకొంది.